పవన్ కల్యాణ్ పై తనకున్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నాడు రామ్ చరణ్. ఓసారి స్టేజ్ పై పవన్ కు ముద్దుపెట్టి మరీ తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ కు, పవన్ పై స్పందించే సందర్భం ఎదురైంది. ఈసారి స్పందించిన చరణ్, కల్యాణ్ బాబాయ్ గురించి ఎక్కువగా మాట్లాడితే దిష్టి తగులుతుందన్నాడు.
“కొన్ని రిలేషన్ షిప్స్ గురించి బయటకు చెబితే దిష్టి తగులుతుంది. అందుకే బయటకు ఎక్కువగా మాట్లాడను. కల్యాణ్ బాబాయ్ తో నా రిలేషన్ అలాంటిది. చిన్నప్పట్నుంచి నాన్న షూటింగ్ కు వెళ్లినప్పుడు నన్ను, బాబాయ్ చూసుకునే వారు. అక్కని, చెల్లిని, నన్ను బాబాయే చూసుకునేవారు. ట్యూషన్ లో బాగా చదువుకోకపోయినా ఆయనే వచ్చి గట్టిగా తిట్టేవారు. బాగా చదువుకోమని చెప్పేవారు.”
అలా చిన్నప్పట్నుంచి పవన్ తో తనకు ఓ అనుబంధం ఏర్పడిందని చెప్పుకొచ్చాడు చరణ్. పెద్దయిన తర్వాత చిరంజీవి తనతో నేరుగా చెప్పలేని విషయాల్ని పవన్ తో చెప్పించిన సంఘటనల్ని గుర్తుచేసుకున్నాడు.
“నేను పెద్దయిన తర్వాత నాన్నగారు నాకు నేరుగా చెప్పలేని విషయాలు కొన్ని కల్యాణ్ బాబాయ్ ద్వారా తెలియజేసేవారు. కల్యాణ్ బాబాయ్ ఒక్కోసారి నాకు బ్రదర్ గా, ఒక్కోసారి బాబాయ్ గా ఉండేవారు. అందుకే కల్యాణ్ బాబాయ్ గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ ఆపాలో తెలియక అలా సైలెంట్ అయిపోతాను. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.”
ఇలా పవన్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు చరణ్. ఎన్టీఆర్ నిర్వహించిన ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభ ఎపిసోడ్ లో ఈ విషయాల్ని బయటపెట్టాడు.