హీరో నానిని టార్గెట్ చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం చేసిన హడావుడికి టాలీవడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి గట్టి కౌంటర్ రాబోతోంది. విషయం ఇలా వదిలేస్తే ఇకపై ప్రతిసారీ ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుుకుంటాయనే ఆలోచన గిల్డ్ సభ్యుల్లో కలుగుతోంది.
''…సినిమా అనేది నిర్మాత దగ్గర మొదలవుతుంది. సినిమా అనేది థియేటర్ లో ప్రదర్శన కోసమే తయారవుతుంది. అందులో సందేహం లేదు. కానీ సమయాన్ని బట్టి, సమస్యను బట్టి సినిమాను ఎక్కడ వేయాలో అన్నది నిర్మాత నిర్ణయించుకుంటాడు తప్ప, ఫోర్స్ చేసి అతన్ని ఇలాగే చేయాలి అని ఎవ్వరూ శాసించడానికి లేదు.
ఎందుకుంటే పెట్టుబడి నిర్మాతది. కష్టం నిర్మాతది. నష్టం నిర్మాతది. సినిమా ఎవరికి అమ్మాలో నిర్ణయించుకునేది నిర్మాత. శాటిలైట్ వచ్చిన తరువాత ఎక్కడ మంచి బేరం వుంటుందో అక్కడ అమ్మే ఆలోచన నిర్మాతది. అలాగే థియేటర్ కు వెసులుబాటు లేకపోతే, నష్టం, కష్టం భరించే స్థోమత లేకపోతే ఓటిటికి వెళ్లకతప్పదు.
అలా అని చెప్పి హీరోనో, ఆర్టిస్ట్ నో టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదు. అసలు నిర్మాతను ఇలా చేయి అలా చేయి శాసించడం ఏమిటి? నష్టం వస్తే ఎవరు భరిస్తారు? ఇప్పుడు విమర్శలు చేసిన వారు భరిస్తారా? …''
గిల్డ్ సభ్యులంతా ఇలా అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు ఇవే విషయాలను గిల్డ్ తరపున అఫీషియల్ గా కౌంటర్ గా ఇవ్వాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.