కడప జిల్లా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తిరిగి మాతృ పార్టీ టీడీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమస్య లేకపోయినా, నియోజక వర్గ స్థాయిలో అధికార పార్టీ నేతలు అవమానించే రీతిలో వ్యవహరిస్తుండడంతో తమ నాయకుడు మనస్తాపం చెందినట్టు రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశామనే అంతర్మథనం చెందుతు న్నట్టు తెలుస్తోంది.
జమ్మలమడుగులో మార్కెట్‌యార్డు నూతన భవన ప్రారంభం, అలాగే ఓ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ విషయంలో అందరి ఎదుట రామసుబ్బారెడ్డిని ఆ నియోజక వర్గ ప్రజాప్రతినిధి అవమానించడంతో సీనియర్ నేత అభిమానులు కలత చెందారనే చర్చ నడుస్తోంది.
ఒకవైపు అధిష్టానం పెద్దలు కొన్ని నెలల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి, పి.రామసుబ్బారెడ్డిని కూర్చోపెట్టి చర్చించి, క్లారిటీ ఇచ్చారు. 2024లో తిరిగి జమ్మలమడుగు అభ్యర్థిగా సుధీర్‌రెడ్డే ఉంటారని అధిష్టానం పెద్దలు తేల్చి చెప్పారు. రామసుబ్బారెడ్డికి తగిన గౌరవం ఇస్తామని చెప్పి పంపారు. దీంతో తాను పార్టీ మారుతాననే ప్రచారంలో నిజం లేదని అప్పట్లో రామసుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. కానీ ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయేలా పొగపెడుతున్నారని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో రామసుబ్బారెడ్డి మాటను ఎవరూ పట్టించుకోవద్దని అధికారులకు సదరు ప్రజాప్రతినిధి అనధికార ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటనే ప్రశ్న రామసుబ్బారెడ్డి, ఆయన అనుచరుల నుంచి వస్తున్న ప్రశ్న. ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమావేశానికి రామసుబ్బారెడ్డి వెళ్లలేదు. దీంతో రామసుబ్బారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారానికి బలం కలిగిస్తోంది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కుటుంబం రాజకీయంగా బలమైంది.
పొన్నపురెడ్డి శివారెడ్డి 1983, 85, 89లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్లో పనిచేశారు. శివారెడ్డి హత్యానంతరం ఆయన అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి తెరపైకి వచ్చారు. ఈయన 1994, 99లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. అప్పటి నుంచి వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్నారు. కానీ సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.
ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరడం, అలాగే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేర డంతో జమ్మలమడుగులో ప్రతిపక్ష పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తనను గౌరవించే టీడీపీలోకి వెళ్లాలనే తలంపుతో ఆయన ఉన్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీలోని కొందరు నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆదిరించినా …స్థానిక నేతలతో విభేదాల వల్ల పార్టీ వీడే పరిస్థితి.