కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధాను బదిలీ చేయడంతో ఎమ్మెల్యేకు చెక్ పెట్టినట్టైందనే అభిప్రాయాలు కడప జిల్లాలో వ్యక్తమవుతున్నాయి. “అంతా నా ఇష్టం” అన్నట్టు ఎమ్మెల్యే రాచమల్లు అండ చూసుకుని కమిషనర్ రాధా వ్యవహరించే వారనే విమర్శలున్నాయి. ఆమె నియంతృత్వ, లెక్కలేనితనంపై వైసీపీ కౌన్సిలర్లే గుర్రుగా ఉన్నారు.
కమిషనర్ రాధాపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఆరు నెలల క్రితం ప్రొద్దుటూరులో టీడీపీ బీసీ నాయకుడి హత్య కేసులో కమిషనర్ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం. ఒక అధికారిననే విషయాన్ని మరిచిపోయి, పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఆమె మూటకట్టుకున్నారు. అలాగే ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలో పలు పనుల్లో ఆమె అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు కూడా సమాచారం ఇవ్వలేదనే చర్చ నడుస్తోంది. ఇటీవల గృహనిర్మాణ పనులపై రాష్ట్ర అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో … ఒత్తిడి భరించలేకున్నామని, ఏదైనా చేసుకోవాలనే భావన కలుగుతోందంటూ కమిషనర్ రాధా తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ నేపథ్యంలో ఆమె బదిలీ అనివార్యమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో మూడేళ్ల పాటు ప్రొద్దుటూనులోనే ఆమెను కమిషనర్‌గా కొనసాగించాలనే ఎమ్మెల్యే ఆకాంక్షలు నెరవేరలేదని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. ఆమెను తిరిగి తన మాతృవిభాగం వైద్యశాఖకు ప్రభుత్వం పంపింది.
కమిషనర్ బదిలీకి సంబంధించి ప్రభుత్వ ఉద్దేశం ఏమైనప్పటికీ… ఇది ఎమ్మెల్యేను కట్టడి చేయడమే అనే అభిప్రాయాలు మాత్రం కడప జిల్లాలో బలంగా ఉన్నాయి.