ఏటీఎం అన్నది మోడీనే కదా.. మరి షెకావత్‌

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నవయుగ కంపెనీకి నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చిన టెండర్‌ను రద్దుచేసింది. ఇందుకు సంబంధించి ఒక నిపుణుల…

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం నవయుగ కంపెనీకి నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చిన టెండర్‌ను రద్దుచేసింది. ఇందుకు సంబంధించి ఒక నిపుణుల కమిటీని నియమించి, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా చర్యలు తీసుకుంది. ఇందులో సుమారు 2300 కోట్ల అవినీతి, నిబంధనల ఉల్లంఘన వంటివి జరిగాయని కమిటీ అంచనా వేసింది. విధ్యుత్‌ ప్రాజెక్టు అసలు ప్రారంభం కాకముందే 724 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చిన తీరును తప్పుపట్టింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ ఈ కాంట్రాక్ట్‌ను రద్దుచేసి, రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో మళ్లీ టెండర్లు పిలిచి నవంబర్‌ ఒకటి నాటికి పనులు ఆరంభించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఎలాగూ వరదల కారణంగా పనులు సాగవు.

పార్లమెంటులో షెకావత్‌ ఈ మధ్యకాలంలో రెండు చిత్రమైన ప్రకటనలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి గురించి జవాబు చెప్పకపోగా, విచారణ లేమీ జరగడం లేదని అన్నారు. తాజాగా కాంట్రాక్టు రద్దు బాధాకరం అన్నారు. దీనివల్ల ప్రాజెక్టు జాప్యం అవుతుందా? అన్న అనుమానం వ్యక్తం చేశారట. ఆయన నిజంగానే అదే ఉద్దేశంతో ఉంటే ఆ విషయాన్ని ప్రధాని మోడీతో చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే గత ఎన్నికల ముందు ప్రధాని మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం, రాజధాని ప్రాజెక్టులు టీడీపీ నాయకత్వానికి ఏటీఎంల మాదిరి ఉపయోగపడుతున్నాయని చెప్పివెళ్లారు. అంటే ఆనాటి టీడీపీ ప్రభుత్వం దొరికిన కాడికి ఆ ప్రాజెక్టులలో డబ్బు తినేసిందని కదా మోడీ చెప్పింది.

దానిపై విచారణ చేయిస్తామని, కేంద్రానికి కొత్త ప్రభుత్వం లేఖలు రాయాలని, పోలవరంలో అవినీతి బయటకు తీయాలని ఏపీ బీజేపీ నేతలు పలువురు పెద్దఎత్తున ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు సుమారు 2300 కోట్ల మేర అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించినట్లు వార్తలు వచ్చాయి. మరి అలాంటప్పుడు దానిపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్నది కేంద్రమంత్రి చెప్పాలి కదా? లేకపోతే ప్రధాని మోడీ ఉబుసుపోక పోలవరంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించి వెళ్లారా? కేంద్రమంత్రే విషయంపై అవగాహన లేకుండా మాట్లాడితే ఏమిచేయాలి? గతంలో ఉమాభారతి, నితిన్‌ గడ్కరిలు మంత్రులుగా ఉండేవారు. గడ్కరి హయాంలో కాంట్రాక్టు రద్దు తదితర అంశాలలో ఎంత వివాదం అయిందో షెకావత్‌కు తెలిసి ఉండకపోవచ్చు.

ఆనాటి కాంట్రాక్టర్‌ రాయపాటి సాంబశివరావు 2014 ఎన్నికల సమయంలో ఎంత మొత్తంలో టీడీపీకి డబ్బు ఇచ్చింది? కాంట్రాక్టు పరిణామాల గురించి గడ్కరికి చెవిలో ఏమిచెప్పింది షెకావత్‌కు తెలిసి ఉండకపోవచ్చు. అసలు ప్రాజెక్టులో అవినీతి జరిగినా వదలివేయాలని ఆయన చెబుతున్నారా? అలాగే నామినెటెడ్‌ పద్ధతిలో తమకు కావల్సిన కాంట్రాక్టర్లకు వందలు, వేలకోట్ల పనులు ఏ ప్రభుత్వం అయినా అప్పగించవచ్చని కేంద్రమంత్రి చెప్పదలిచారా? ఇదేనా. బీజేపీ అవినీతిపై పోరాడేతీరు? టీడీపీ నేతలకు ఒక ఆర్ట్‌ ఉందని అంటారు. చంద్రబాబు తెలివిగా తన మనుషులను ఆయా వ్యవస్తలలో పెట్టి రాజకీయం నడుపుతారని ప్రసిద్ధి, గతంలో కాంగ్రెస్‌లో ఆయనకు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో కూడా తన మద్ధతుదారులు ఉండేలా జాగ్రత్తపడ్డారని అంటారు.

కాకపోతే అనుకోకుండా బీజేపీకి దూరం అయ్యారు. దాంతో బీజేపీలోని ఆయన మద్ధతుదారులు నిస్సహాయంగా మిగిలిపోయారు. దారుణమైన ఓటమి తర్వాత బీజేపీలోకి చంద్రబాబు సన్నిహితులే వెళ్లారు. పైగా వారు చంద్రబాబుపై ఉన్న స్వామిభక్తిని వదలుకోవడం లేదు. అంటే బీజేపీలో వారు కోవర్టులుగా పనిచేస్తున్నారన్నమాట. బీజేపీ ఏపీ ఇన్‌చార్జీ సునీల్‌ దియోదర్‌ తన ప్రసంగాలలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతుంటే, బీజేపీలో చేరిన టీడీపీ మాజీనేత సుజనా చౌదరి మాత్రం చంద్రబాబుపై అసలు కేసులేరావని చెబుతున్నారు. దీనిని బట్టి చంద్రబాబు కోటరి బీజేపీలో యాక్టివ్‌ అయిపోయిందని అనుకోవాలి. ఏది ఏమైనా కేంద్రమంత్రి షెకావత్‌ అవినీతి విషయంలో, పోలవరం ప్రాజెక్టులో ఏమి జరిగిందన్న దానిపై పూర్తి అవగాహన చేసుకుని మాట్లాడాలి తప్పు టీడీపీ వారి ప్రతినిధిగా మాట్లాడితే అర్ధంలేదు.

నెల రోజులలోపు కొత్త కాంట్రాక్టర్‌ నియామకం జరిగితే నష్టం ఏమి ఉండదు. అయితే అదే సమయంలో జగన్‌ ప్రభుత్వం కూడా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారం లిటిగేషన్‌గా మారకూడదు. పోలవరం పనులు చకచకా జరిగి వారు ప్రకటించినట్లు 2021 నాటికి అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు జగన్‌కు గొప్పపేరు వస్తుంది. అయితే కేంద్రమంత్రికి ముందుగానే ఏపీ ప్రభుత్వం నుంచి సంబంధిత మంత్రి లేదా ఉన్నతాధికారులు ఎవరైనా ఈ పరిస్థితిని వివరించి ఉండాల్సింది. అంటే కేంద్రంతో సమాచారం లోపం లేకుండా జాగ్రత్తపడాలన్నమాట. ఇక మాజీమంత్రి దేవినేని ఉమా వంటివారు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. తమవర్గం వారికి కాంట్రాక్టు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

అంటే దాని అర్థం టీడీపీవారు తమకు చుట్టమనో, తమవర్గం అనో, లేదా తమకు మద్ధతు ఇచ్చే మీడియా పెద్దలకు సన్నిహితుడనో నవయుగకు నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చారా అన్న ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వాలి. అలా నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వడం నిబంధనలు అనుమతిస్తాయా అన్నదానికి జవాబు ఇవ్వాలి. అసలు కేంద్రం చేపట్టవలసిన ఈ ప్రాజెక్టును ఎందుకు తీసుకుంది? మొదటి రెండేళ్లు ఎందుకు పట్టించుకోనిది కూడా వివరించాలి. టీడీపీ నేతల ఆరోపణలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వారి సమాధానాలు ఎలా ఉన్నా, జగన్‌ ప్రభుత్వంపై పెద్ద బాధ్యత ఉంది. కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలి. లేకుంటే జగన్‌పై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది