జగన్‌ సర్కార్‌ పొద్దు ఎరుగదు.. బాబుకు నిద్రపట్టదు

కొత్తబిచ్చగాడు పొద్దు ఎరుగడన్నట్లుగా కొత్తసర్కారు తీరు కన్పిస్తోంది. ఇలా వచ్చారో లేదో హడావుడి ఎక్కువగా చూపుతున్నారన్నట్లు తొలి అసెంబ్లీ సమావేశంలో టీడీపీ ఎమ్‌ఎల్‌ఏ బుచ్చయ్య చౌదరి వ్యంగ్యంగా అన్నారు. నిజానికి ఒక్క బుచ్చయ్య చౌదరే కాదు.…

కొత్తబిచ్చగాడు పొద్దు ఎరుగడన్నట్లుగా కొత్తసర్కారు తీరు కన్పిస్తోంది. ఇలా వచ్చారో లేదో హడావుడి ఎక్కువగా చూపుతున్నారన్నట్లు తొలి అసెంబ్లీ సమావేశంలో టీడీపీ ఎమ్‌ఎల్‌ఏ బుచ్చయ్య చౌదరి వ్యంగ్యంగా అన్నారు. నిజానికి ఒక్క బుచ్చయ్య చౌదరే కాదు. యావత్‌ తెలుగుదేశం నేతలు, క్యాడర్‌ కూడా ఇదే పదేపదే అనుకుంటున్నారు. జగన్‌ సీఎం అయ్యాక మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా కొంతగ్యాప్‌ ఇచ్చి మొత్తం అన్నిశాఖలను గుప్పిట్లోకి లాక్కుని పట్టు బిగించారు. ప్రధాన అధికార్ల సమావేశాలతో అధికార్లను అన్నా, అన్నా అని సంభోదిస్తూ అన్నివిధాల సహకరించమని కోరారు. దాంతో అధికార్లు సంతుష్టులయ్యారు.అవినీతి జరగకుండా పాలనా వ్యవహారాలలో చేతులు కలపమని పదేపదే కోరారు. ఇలా వచ్చారో లేదో పాదయాత్రలో తను ఇచ్చిన హామీల పరంపరను తుంగలోకి తొక్కిపెట్టలేదు. పైగా, గుప్పెడేసి హామీలను అమలుచేసే యత్నంలో తలమునకలయ్యారు.

ఆశావర్కర్లకు జీతాలు అమాంతం పెంచడంతో జగన్‌ హవా స్పీడందుకుంది. ఇక్కడే టీడీపీ నేతలకు మింగుడుపడలేదు. దయనీయమైన సంఖ్యతో పేలవమైన ప్రతిపక్షానికి పరిమితమైన చంద్రబాబు అండ్‌కో జగన్‌ పాలన జనాల్లో పుంతలు తొక్కుతోంది. సర్కారు ఒక్కక్షణం కాలాయాపన చేయకుండా ప్రజారంజకమైన విధులు నిర్వాహణలోనే సాగుతోంది. దాంతో బాబు అండ్‌కోకి నోటమ్మట మాటరాక, తింటున్న అన్నం రుచించక, మెత్తని తల్పంపై కూడా నిద్రపట్టక కళ్లు సాగదీసుకుని చూసే పరిస్థితి ఏర్పడింది. ఎంచక్కా ఐదేళ్లపాటు ఏలుకోమని ఏపీ జనాలు బంగారు పళ్లెంలో దండిగా సీట్లతో ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు. రాష్ట్రంలో కనీసం మంత్రిపదవి కూడా ఏనాడు చేయలేదు. అలాంటి జగన్‌ అధికారం, మంది మార్బలం, కులం, క్యాడర్‌తో విందులు వినోదాలతో తొలి ఏడాది ఆనందాన్ని అనుభవించాల్సింది. కానీ, ఆదిశలో జగన్‌ లేకపోవడం ప్రతిపక్షాల్లో అయోమయం నెలకొంది. అన్నివర్గాల నుంచి గెలుపు సన్మానాలు స్వీకరిస్తూ గజమాలలతో ఊరేగాలి.

ఆ సరదాలను, సందడులను పక్కకుపెట్టి పేదరోద అని జనాలకే అంకితమైన తీరు, జనాలకు అది చేస్తాను ఇది చేస్తానని హామీలు అమలు చేసిన తీరుతో నొసలు నొక్కుకోసాగారు. ఇలా అయితే, టీడీపీని జనాల్లో ఎలా నిలపాలి. టీడీపీకి ఉన్న కరడుగట్టిన ఓటుబ్యాంకును జారిపోకుండా ఎలా కాపాడుకోవాలి? అని చంద్రన్న మీనమేషాలు లెక్కింపుల్లో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధోగతిలో కూరుకు పోయిందనుకుంటే మేమున్నామని కేంద్రంలో కాంగ్రెస్‌ కూడా తోడయ్యింది. మాకీ నాయకత్వం వద్దుబాబోయ్‌ అంటూ ఇందిరమ్మ వారసులు పదవిగండంతో దశదిశలు పరుగులు తీస్తున్నారు. మీరు లేకుంటే కాంగ్రెస్‌కు గతేలేదని పార్టీలో ముసలి ముడగ నేతలు ఆకుర్రగాంధీల వెంటపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌ అధోగతిలో తేరుకోలేకుండా ఉన్నట్లే అధోగతికి దారి వెతుకులాటలో కాంగ్రెస్‌ అధిష్టానం తలమునకలై ఉంది. ఇక మైక్‌ చూస్తే అప్‌డేట్‌ రాజకీయాలు వల్లెవేసే యాంకర్‌లా పవన్‌ కొత్తసర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.

అడపాతడపా గెస్టుఆర్టిస్టులా వచ్చి జగన్‌ సర్కారుకు వంద రోజులే టైమ్‌ ఇస్తున్నాం. ఆపైన సర్కారు నిర్వాకాలను ఎండగడతాం అని హెచ్చరికలు జారీ చేసేసారు. అవ్వ- తాతలకు మూడువేలు ఇస్తానని మోసం చేసారని టీడీపీ వంతపాటను అందిపుచ్చుకుని తనమంది ముందు, మీడియా ముందు రాగయుక్తంగా పాడారు. జనాల్లో వీసమెత్తు స్పందనే లేదు. పవన్‌ సిన్మాలకు ఓకే, రాజకీయ గంతులకు మాత్రం సైకొట్టమని 2019 ఎన్నికల్లో జనాలు ఒకేఒక సీటు చేతిలో పెట్టి తేల్చిచెప్పేసారు. అయినా చిన్నన్న నాగబాబు ప్రోత్సాహ బలిమితో రాజకీయ ప్రత్యేక అతిథిగా ఏపీలో మెరుపులు మెరిపిస్తున్నారు. మరికొద్దివారాల్లో పవన్‌ గీసిన లక్షణరేఖకు 100రోజులు కొత్త సర్కారుకు నిండుతుంది. ఆపైన పవన్‌వారి పోరుబాట ఉలికింపులు సర్వజనులు చూడాల్సిందే. ఇక వామ పక్షాలు ఏపీలో ఆటలో అరటిపళ్లు అయిపోయారు.

టీడీపీ నేతలకు ఎంతమాత్రం జీర్ణంకాని జగన్‌ వేగంతో కూడిన పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటనలు వారికి నిద్రపోనీయడం లేదు. రాత్రిగడిచేసరికి మరుసటిరోజు ఏమి వింటామా అనేబితుకు ఒకటి వారిని పట్టిపీడిస్తోంది. ఎన్నికల్లో వేలకోట్లు జనాల్లో వెదజల్లి, 130 సీట్లు మూటకట్టేందుకు సిద్దపడ్డ బాబుకు ఘోర పరాజయాన్ని నెత్తికెత్తిన జనాలు అర్ధంకాకుండా పోయారు. ఆ పరాభవం కంటే జగన్‌ అను నిత్యం గుప్పెడు కొత్త పథకాలు అమలు చేయడానికి సిద్ధపడడం కంటికి కునుకులేకుండా చేస్తోంది. ఇదెక్కడి సీఎం తీరు అని సాక్షాత్తు చంద్రబాబే ఆశ్చర్యపోతున్నారు. జగన్‌ జనరంజకమైన పాలనను రుచిచూపిస్తుంటే జనాల్లోకి ఎలా వెళ్లగలం? టీడీపీ పునాదులు కదిలిపోయే సూచనలే ఎక్కువయ్యాయి. కార్యకర్తల్లో, జనాల్లో పార్టీ చులకన కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టగలమని బితుకు బాబు అండ్‌కోకి ఆరంభం అయ్యింది. మరోవైపు పార్టీలోంచి వలసల గాసిప్సు వెలువడుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఏది నిజమో? ఏది బూటకమో? తెలియని విధంగా పార్టీలో ఉన్న 23మందిలో పలువురు బీజేపీలోకి వెడతారనే కథనాలు, ప్లాష్‌లు వస్తునే ఉన్నాయి.

చంద్రన్నకు ఘోర ఓటమి ఎంత కృంగదీసిందో అంతకు పదింతలు జగన్‌ హామీల పాలన బితుకులాడిస్తోంది. బాబుకు మనస్సు కుదుటపడేలా చేయడానికి తగిన మానసిక ధైర్యం ఇచ్చే నేతలు ఎవరూలేరు. పార్టీలో కాగడాలతో వెతికినా దొరకరు. వృద్ధుడైన బాబుకు మానసిక ధైర్యాన్ని ఇచ్చే ఓదార్పు కావాలి. అందుకే అసెంబ్లీని మద్యలో వదిలి అమెరికా వెళ్లారు. అక్కడ తెలుగోళ్లు చూసే జాలిచూపుల్లో కూడా మానసిక ధైర్యం చిక్కబడలేదు. ఎందుకొచ్చిన అమెరికా పర్యటన అని అప్పుడే అనుకున్నారు. తను సప్తసముద్రాలు దాటుకుని మర్రిచెట్టు తొర్రలో ఉన్న పంజరంలో చిలకను తెచ్చేసాహసం చేసినా మానసిక ప్రశాంతత లభ్యంకాదని బాబు డిసైడ్‌ అయిపోయారు. ఎందుకంటే ఆచిలుక కూడా బాబు ఐదేళ్ల నిర్వాకంపై చిలుకపలుకులు పలుకక మానదు. పదేళ్ల విరా మం తర్వాత అధికారమిస్తే లక్షలకోట్ల అవినీతికి జనాల సాక్షిగా పాల్పడ్డావని ప్రత్యర్ధులు, మీడియా హోరెత్తాయి. చట్టాలను అసెంబ్లీసాక్షిగా హీనపరిచావు. జనఘోషలను తుంగలోకి తొక్కేసావు. అందుకే ఈహీనగతి సంప్రాప్తమయ్యిందని చిలుక పలుకులు వినకతప్పదు. ఏదైనా తెలుగుగడ్డమీదే మానసిక ఉల్లాసం వెతుక్కుందాం అని కరకట్టల్లో అనుమతులు లేకుండా నిర్మితమైన స్వగృహం చేరుకున్నారు.

ఇక బాబుకు పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత ఊరట కల్గించేలా 23 ఎమ్‌ఎల్‌ఏల్లో ఇద్దరు ముగ్గురునేతలు ఉన్నారు. బాబుకు లేనిపోని నూరిపోతల్లో నాటినుంచి నేటివరకు తమ తీరులో ఎలాంటి మార్పులేకుండా అప్రతిహాతంగా సాగుతున్నారు. కొత్త సర్కారు నిత్యం హామీలను అమలు చేయడానికి నడుంబిగిస్తోంది. మన టీడీపీ సర్కారు దిగేమందు దాదాపు అన్నిశాఖల్లో గల్లా పెట్టెల్లో చిల్లిగవ్వ లేకుండా చేసాం. పైగా, వేలకోట్లు అప్పులు బాకీలు ఇవే కొత్తసర్కారుకు సత్తుపళ్లెంలో పెట్టి అప్పగించి దిగిపోయాం. సాధారణంగా ఏపిలో ఏలుబడికే కటకట పరిస్థితి కొత్తసర్కారుకు ఉంది. అలాంటిది జగన్‌  ముందు వెనుకలు చూడకుండా పాదయాత్ర హామీలు అమల్లో ఉన్నాడు. అవి ప్రకటించడం వరకే అత్యద్భుతంగా ఉంటాయి. ఆపైన అమలు అయ్యేసరికి చిల్లుపడ్డ గల్లాపెట్టె చేతులు ఎత్తేస్తుంది. జనాలు అందిపుచ్చుకోవడానికి పనులు మానుకుని రోడ్లు ఎక్కిపోతారు. వారికి ఇస్తామన్నది అందకపోతే, కోరికోరి జగన్‌ జనాలను రెచ్చగొట్టుకున్నట్లు అవుతుంది.

ఏ జనాలయితే, మనం ఇచ్చిన పసుపుకుంకాలు, రైతుభరోసాలు, దండిగా పెన్షన్లు అందుకుని మనకు ఓటేయలేదో? వారే జగన్‌ సర్కారు కూకటివేళ్లతో పెళ్లగిస్తారు. ఇదంతా ఎప్పుడో జరిగే సిన్మా కాదు. అతిత్వరలో మనకళ్లముందే జరుగనుందని టీడీపీ క్యాడర్‌ గంపెడు ఆశలతో ఉంది. ఇదే నూరిపోతను బాబు చెవులకు ఎక్కించి బాబు చెవులను చాటల్లా చేస్తున్న అనుచర గణం అదేపనిలో ఉంది. అయితే, ఇలాంటి నూరిపోతలు బాబుకు కొత్తకాదు. నూరిపోతలను స్వీకరించి తలాడించడంలో బాబుకు పరమవీక్‌నెస్‌ అని పార్టీలో విన్పిస్తుంది. టీడీపీలో తొలిరోజుల్లో పార్టీపై బాబు పట్టు సాధిస్తున్నప్పుడు ఎందరెం దరో చెప్పారు. ఎన్‌టీఆర్‌ను, లక్ష్మీపార్వతిని దించినప్పుడు చెవులు వాచేలా చెప్పుడు మాటలు చెప్పారు. ఎన్‌టీఆర్‌ కుటుంబాన్ని రాజకీయాల వైపు చూడకుండా అణచడంలో పలునూరిపోతలకు బాబు చెవులొదిలారు. అయితే, ఇలాంటి నూరిపోయడాలు ఉత్తుత్తివయ్యాయి. ఏఒక్కటి ఎవరెవరో చెప్పినట్లు జరగనేలేదు. ఊహించని విధంగా ఏదేదో జరిగి పోయింది.

ఎన్‌టీఆర్‌ను బాబు ఒక్కరే దించలేదు. ఎన్‌టీఆర్‌ కుటుంబం, పార్టీనేతలు మొత్తం బాబు వైపు మోహరిస్తేనే సాధ్యమయ్యింది. అలా మోహరింపచేయడానికి బాబు అశోక్‌ గజపతిరాజునే కాబోయే సీఎం అని భూతద్దంలో చూపారు. పార్టీ యావత్తు రామారావును దించేసి అశోక్‌గజపతినే సీఎంను చేయాలనుకుంటున్నారనే అప్పటికప్పుడు ఒక అబద్థాన్ని చెప్పారు. అలా ఎన్‌టీఆర్‌ను దించకుంటే లక్ష్మీపార్వతి సీఎం అయిపోతారనే తప్పుడు సంకేతం ఎన్‌టీఆర్‌ కుటుంబానికి నూరిపోసారు. అప్పుడు మొత్తం కుటుంబం బాబు వెనక్కి చేరారు. ఇవన్నీ 40ఏళ్ల చంద్రన్న రాజకీయ ఇండస్ట్రీలో దశలవారిగా ఉత్కంఠభరితంగా జరిగిపోయాయి. బాబుకు తెలుసు. తానోబెల్లం, తనచుట్టూ చేరినవారు బెల్లాన్ని ఆశించే ఈగల్లాంటి నేతల చెప్పుడు మాటలు తియ్యగానే ఉంటాయి. ఆచరణలో అసాధ్యంగానే కన్పిస్తాయి. కానీ, ఓటమిపాలయిన తను, ఎవరి నూరిపోతను కాదన్నా, ఎదురు చెప్పినా, వారు చిన్నబోయి పార్టీలోంచి వెళ్లిపోతారు. అందుకే ఎవరేమి చెప్పినా తలాడించే పరిస్థితి. అందుకే పెద్దలు చెప్పకనే చెప్పారు.

అందితే జుట్టు, అందకుంటే ఏదైనా పట్టుకోవాలి. ఏమిచెప్పినా వినాల్సిందే. ఇదే తన 40ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో జరిగింది. ఇప్పుడు జరుగుతోంది. చెవులు తినేసినోళ్లు వెళ్లిపోతే ఇంట్లో ఒంటరి అయిపోయిన బాబుకు తిరిగి మనోవైకల్యమే. జగన్‌ పాలనబితుకే. బాబు సీఎంగా పదేళ్ల ఉమ్మడి రాష్ట్రపాలన, ఐదేళ్లూ విభజనలో చిన్నదైన ఏపీ రాష్ట్రపాలనలో పండిపోయారు. జనాలకు ఏమేరకు సంక్షేమపథకాలు అందించగలమో? నిధులు ఎలా సమకూర్చుకోగలమో తెలుసు. ఇప్పుడు తన క్యాడర్‌ చెబుతున్న ఏపీ ఖజానా జగన్‌ హామీల అమలుకు, సర్కారు జీతాలకు సరితూగేదికాదు. అనసరంగా జగన్‌ కోరికోరి వేలకోట్ల విలువచేసే పథకాలను ఏమీకానట్లు ప్రకటించి మీదకు తెచ్చుకుంటాడనేది తనక్యాడర్‌ విజ్ఞతకే వదిలేసారు. జగన్‌ అవధులమేర తీసుకుంటున్న ఆర్ధికనిర్ణయాలు అవినీతిలో పాలకులు లేకుంటే పక్కాగా చేయొచ్చు అనేది బాబుకు తెలిసినంతగా దేశంలో ఏముఖ్యమంత్రికి తెలియదు.

జగన్‌ చదువుకున్న కుర్ర రాజకీయవేత్త. తను ఏమిచేయాలంటే దాన్ని మనసావాచా చేయడంలో దిట్ట. వైయస్‌ మృతికి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు ఓదార్చేందుకు ఓదార్పుయాత్ర చేసారు. ఓదార్పుయాత్రను కాంగ్రెస్‌ నిలువరిస్తే ఆపార్టీని వదిలేసి స్వంతంగా పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ కుట్రచేసి 16నెలలు జైలు పాల్జేసింది. 11ఆర్ధిక కేసులు బనాయించి కోర్టుబోనులో నిలిపినా పదేళ్లపాటు జనాల్లో మమేకమై గెలుచుకువచ్చారు. ఇచ్చిన హామీలను అమలుచేయడానికి పాలకుడుగా తొలిరోజు నుంచే సిద్ధపడ్డాడంటే నమ్ము నమ్మకపో కథనంలా తయారయ్యింది. పైగా, ఆనాటి ఆర్ధికమంత్రి రోశయ్యలా నేటి జగన్‌మంత్రివర్గంలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సర్కార్‌ మీద ఈగవాలితే తనపై దుడ్డుపడినంతగా రెచ్చుతున్నారు.

గతసర్కారు అవినీతి నిర్వాకం ఊదరగొడ్తున్నారు. అలాగే, మంత్రులు నలుగురైదుగురు తప్ప అంతా ఒకటి అంటే పదంటున్నారు. ఇక సీనియర్‌ నేతలుగా ఉన్న ధర్మాన, అంబటి, కాకాని, చెవిరెడ్డి, రోజా ఇలా ఎవరికివారే అతిరధ మహారధుల్లా రాణిస్తున్నారు. పైగా, జగన్‌ అవినీతిపై పోరుబాటను పదేపదే తలచుకుంటూ సాగుతున్నారు. ఇక వైకాపా ఇప్పట్లో జనాల్లో హీనపడదు. టీడీపీ తేజరిల్లదని బాబు గ్రహించేసారు. తప్పదన్నట్లు హీనపడ్డ పార్టీలో చేయాల్సిన తాటాకుచప్పుళ్లకే పరిమితం అయ్యారు.
-యర్నాగుల సుధాకరరావు

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది