మరో మూడు రోజుల్లో అక్టోబర్ 15 వస్తుంది. దానికి విశేషం ఏముంది. అన్ని డేట్స్ మాదిరిగా క్యాలెండర్ లో అది కూడా ఒక డేట్ కదా అని ఎవరైనా పొరబడితే మాత్రం అదే రాంగ్ లో కాలేసినట్లే. ఆ రోజున ఏపీ జనాలు విశాఖ వైపు ఒక లుక్కేయాల్సిందే. ఎందుకంటే ఆ రోజే వికేంద్రీకరణకు మద్దతుగా లక్షలాది మందితో భారీ ఎత్తున విశాఖ గర్జనకు నాన్ పొలిటికల్ జేఏసీ ప్లాన్ చేసింది.
దాంతో అమరావతికి కౌంటర్ గా సాగే ఈ కార్యక్రమం ఎలా సాగుతుంది అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. అదే రోజున జనసేనాని విశాఖ టూర్ పెట్టుకున్నారు. మరి అది ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాం అని జనసైనికులు అంటున్నా విశాఖకు వస్తానని చాలా కాలంగా ఊరిస్తున్న పవన్ కరెక్ట్ గా గర్జన రోజే విశాఖలో ఎంట్రీ ఇవ్వడం అంటే అందులో అమరావతి రాజధాని సౌండ్ ఉందని వైసీపీ మంత్రులు నేతలు మండిపడుతున్నారు.
పవర్ స్టార్ విశాఖలో ఉండగా జరిగే గర్జన ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలి. ఇపుడు మరో కొత్త విషయం ముందుకు వచ్చింది. అదే రోజున అంటే 15న ఉత్తరాంధ్రా టీడీపీ నేతలతో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ సహా కీలక నేతలు, జిల్లా బాధ్యులు అటెండ్ అవుతారట.
విశాఖ గర్జన వెనక వైసీపీ ఉందనుకుంటే ఆ గర్జనకు ప్రతి స్పదనగా అటు పవన్ ఇటు అచ్చెన్న బరిలోకి దిగిపోయారు. విశాఖలో గర్జన జరిగే రోజునే ఉత్తరాంధ్రా అంతటా అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీలు జరుగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఇపుడు టీడీపీ జనసేన బరిలోకి దిగడంతో పొలిటికల్ హీట్ మరింతగా పెరుగుతోంది.
విశాఖలో 15న ఏమి జరుగుతుంది అన్నదైతే ఎవరికీ అర్ధం కావడంలేదు. ఈ వాడి వేడి సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్యన ఎవరి గర్జనకు రీ సౌండ్ వస్తుందో చూడాలి అంటున్నారు.