‘‘జియాలజీ యింతగా అభివృద్ధి చెందని రోజుల్లో నేలలో నీళ్లు ఎక్కడ పడతాయో చెప్పే వాళ్లుండేవారు విన్నారా?’’ అన్నాడు సిఎం సిబ్బందిలో ఒకడిగా వచ్చిన ఓ పోలీసధికారి, తన కథకు ఉపోద్ఘాతంగా.
ముఖ్యమంత్రిణి వెంటనే ‘‘విన్నా, కానీ నేను నమ్మను. వీళ్లేదో ఓ చేతి కఱ్ఱ పట్టుకుని నేల మీద తాటిస్తూ వెళతారని, నీళ్లున్న చోట వైబ్రేషన్స్ వచ్చాయంటూ తవ్విస్తారని ఒక్కోప్పుడు అక్కడ తవ్వితే జల పడేదని చెప్తారు. కానీ సైంటిఫిక్‌గా అది ఎలా ప్రూవ్ చేయగలరు? నీటికీ, మనిషికీ మధ్య వైబ్రేషన్స్ ఏమిటి? పైగా భూమిలో కొన్ని వందల అడుగుల లోతున ఉన్న జలధార..!’’ అన్నారు.
కానీ అక్కడున్న చాలామంది ‘అలాటిది విన్నామండీ, నిజంగా పడుతుందట’ అన్నారు. మరి కొంతమంది ‘జియాలజిస్టులు పెదవి విరిచేసిన చోట కూడా వీళ్లు జల పడుతుందని చెప్పగా మేము కళ్లారా చూశాం, పడ్డాయి కూడా’. అన్నారు. సిఎంకు విసుగు వచ్చింది. ‘‘అలాటి విద్య ఉందని యింతమంది అంటున్నపుడు యిక దీనిలో అద్భుతం ఏముంటుంది? మామూలు సంగతేగా!’’ అని తేల్చేశారు.
‘‘ఆగండాగండి, జల ఎక్కడ పడుతుందో చెప్పేవాడి కథ కాదిది, శవం ఎక్కడుందో చెప్పేవాడి కథ యిది.’’ అన్నాడు ఆ పోలీసధికారి. శ్రోతలందరూ హాఁ అన్నారు ఒకేసారి.
‘‘అలాటి వాడు నిజంగా ఉన్నాడా?’’ అని అడిగారు సిఎం నిర్ఘాంతపోతూ.
‘‘ఆహా, నేను చోడవరంలో పోస్టయినప్పుడు తగిలిన మొదటి కేసు ఓ మిస్సింగ్ కేసు. ఆ పరిసరాలన్నీ రాతి ప్రాంతం. నీళ్లు తక్కువ, కొట్లాటలు ఎక్కువ, కోపం వస్తే కొడవలి తీసే రకపు జనాలు. గ్రూపిజం బలంగా ఉంది. మనిషి రెండు రోజులు కనబడకపోతే ఫలానావాళ్లు చంపేసేరని కొందరంటారు. మాకేం తెలియదంటారు యివతలి వాళ్లు. శవం దొరికితే నిరూపిస్తాం, శవాన్ని వెతికిపెట్టండి అని పోలీసుల మీద పడతుంది అవతలి గ్రూపు. పోయినవాడి కుటుంబసభ్యుల చేత ఫిర్యాదు యిప్పిస్తారు. ఊరంతా రాళ్లూ రప్పలు, రాళ్ల గుట్టలు! ఎక్కడని వెతుకుతాం?’’
‘‘ఔనౌను. నేనూ పని చేశాను అలాటి ఊళ్లో. అన్నీ యిలాటి కేసులే. శవం కనబడకపోతే, అవతలివాళ్ల దగ్గర్నుంచి డబ్బు తీసుకుని సరిగ్గా వెతకడం లేదంటారు యివతలివాళ్లు, పేపరు వాళ్లకు చెప్పి రాయించేస్తారు కూడా. నెలకో కేసు తగిలేది. రెండేళ్లలో బదిలీ చేయించుకుని బయటపడ్డాను.’’ అన్నాడు పోలీసు శాఖలోని మరో అధికారి.
‘‘అక్కడ నెల్లాళ్లకో కేసయితే యిక్కడ పదిహేను, యిరవై రోజులకు ఒకటి. పిచ్చెక్కిపోయేది. నేను చార్జి తీసుకోగానే అలాటి కేసు తగిలింది. ఒత్తిడి తట్టుకోలేక ఓ రోజు బాగా విసుక్కున్నపుడు ఓ కానిస్టేబుల్ ‘ఓబులయ్య చురుగ్గా ఉండి ఉంటే యీ బెడద ఉండేది కాదు’ అన్నాడు. వాడెవడు అన్నాను. అప్పుడు అతని కథ తెలిసింది. ఓబులయ్య తాతకు కళ్లు మసగ్గా ఉండి సరిగ్గా కనపడేవి కావు కానీ చేతికఱ్ఱ సాయంతో జల ఎక్కడ పడేదో చెప్పగలిగేవాడు. రాతి ప్రాంతం కదా, నీటి ఎద్దడి ఎక్కువ. బావి తవ్వడానికి ఖర్చు బాగా అయ్యేది. నీళ్లు ఎక్కడ పడతాయో కచ్చితంగా తెలిస్తే బోల్డు డబ్బు ఆదా. అందుకని జల పడే చోటు చెప్పేవాళ్లకు డబ్బు బాగానే ముట్టచెప్పేవారు రైతులు.
వయసుడిగిన కొద్దీ ఓపిక తగ్గి ఎక్కువ దూరం తిరగలేక పోయేవాడతను. తన కొడుక్కి ఆ విద్య నేర్పి బయటి ఊళ్లకు పంపుదామనుకున్నాడు. కానీ కొడుక్కి అది పట్టుబడలేదు. వాళ్లనేదేమిటంటే, నీళ్లున్న చోటికి వచ్చినపుడు కఱ్ఱలో ఓ కంపనం వస్తుందట. దాన్ని రిసీవ్ చేసుకునే శక్తి మన శరీరంలో ఉండాలిట. ‘అది నీకు లేదు కానీ, నీ కొడుక్కి ఉన్నట్టుంది’ అన్నాడు ముసలాయన. దాంతో ఓబులయ్య తండ్రి అతనిపై ప్రెషర్ తెచ్చాడు ‘తాత దగ్గర ఆ విద్య నేర్చుకో’ అంటూ! కానీ ఓబులయ్య ‘కూలీనాలీ చేసుకుని బతుకుతా. ఇలాటివి చేస్తే రిస్కు. ఒకవేళ నీళ్లు పడకపోతే పట్టుకుని తంతారు.’ అన్నాడు.
కానీ తండ్రి వినలేదు. తాత కూడా ‘నాతో అంతరించి పోకూడదురా’ అంటూ మనవణ్ని బతిమాలి దీక్షకు కూర్చోబెట్టాడు. ఓబులయ్య మొక్కుబడిగా ఆ మంత్రాలేవో నాలుగు నేర్చుకున్నాడు. ఆ విద్యాభ్యాసం సాగుతూండగానే తాత హఠాత్తుగా పోయాడు. ఓబులయ్య హమ్మయ్య అనుకున్నాడు. కానీ తండ్రి అనుకోలేదు. ‘నేర్చుకున్నవరకూ చాలు, ఆ విద్య మన రక్తంలోనే ఉంది. పద’ అంటూ బలవంతంగా వృత్తిలోకి దింపాడు. అయితే తమాషా ఏమిటంటే ఓబులయ్య నీళ్లు పడతాయని చెప్పిన చోటల్లా ఏదో ఒక శవం బయటపడేది. ఇతన్ని ఎంగేజ్ చేసినవాళ్లకు ఒళ్లు మండిపోయేది. కానీ పోలీసు వాళ్లకు, ఏదో ఒక గ్రూపు వాళ్లకు సంతోషం కలిగేది…’’
ఇది వింటూనే శ్రోతలందరూ పకపకా నవ్వారు. ‘ఎవడి గోల వాడిది’ అన్నాడొకతను.
సిఎం ‘ఇదే నాకు అర్థం కానిది. ప్రవహించే నీళ్లు, వాటికి వైబ్రేషన్స్ అంటే ఏమో అనుకుంటాం. కానీ జీవం పోయి పడి ఉన్న శవానికి వైబ్రేషన్స్ ఏముంటాయండి? వాటిల్లోంచి ఏ సంకేతాలు బతికున్న మనిషికి వెళతాయి? అతను అవి ఉన్న స్థలాన్ని ఎలా కనిపెట్టగలడు?’’ అన్నారు.
‘‘మనకు అర్థం కాని విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టే దీన్ని అద్భుతరసయామిని అనుకుంటున్నాం మేడమ్, మీరు మధ్యలో తర్కచర్చ మొదలెట్టకండి.’’ అన్నాడు ఓ సీనియర్ జర్నలిస్టు.
పోలీసు అధికారి కథ మళ్లీ మొదలుపెట్టాడు. ‘‘నాలుగైదుసార్లు యిలాగే అయ్యేసరికి, బావి తవ్వుదామని యితన్ని పిలిచిన రైతులు పట్టుకుని ఉతికారు. ఇతను ఆ పని మానేసి కూలి పనికి వెళ్లేవాడు. ఐదారు నెలలు అయ్యేసరికే నా బోటివాడే ఆ వూరికి ఎస్సయిగా ట్రాన్సఫరై వచ్చి మిస్సింగ్ కేసు గురించి బుఱ్ఱ బద్దలు కొట్టూ ఉంటే, ఊళ్లో వాళ్లెవరో చెప్పారు. వెంటనే ఓబులయ్యను పిలిపించి అనుమానం ఉన్న ప్రాంతాల్లో తిప్పారు. శవం బయటపడింది. కేసు నడిచింది. ఇక ఓబులయ్య విద్యలో పోలీసువాళ్లకు బాగా ప్రయోజనం కనబడింది.
ఆ ప్రాంతంలో హత్యలు ఎక్కువని చెప్పాను కదా, శవం కనబడక పోతే యితన్ని లాక్కుని వచ్చేవారు. ఏదో ఒక శవం, పాతదో-కొత్తదో కనబడేది. శవం కనబడక అటకెక్కించిన పాతపాత కేసులు రిజాల్వ్ కావడం మొదలెట్టాయి. పోలీసువాళ్లకు పై నుంచి మెప్పులు వచ్చేవి. ఆ హత్య బయటపడితే లాభపడే పార్టీల నుంచి బహుమతులు ముట్టేవి. దాంతో ఏ హత్యా జరగకపోయినా, పోలీసు వాళ్లు యితన్ని వారానికి ఓ సారి తీసుకెళ్లి ఊరు పరిసరాలన్నీ తిప్పేవారు. శవం దొరికితే డబ్బు బాగా ముట్టచెప్పేవారు. కొన్ని రోజులకు వేరే వూరి పోలీసు వాళ్లు కూడా వచ్చి ఓబులయ్యను తీసుకెళ్లేవారు…’’
‘‘దృశ్యం సినిమాలోని లేడీ పోలీసు ఆఫీసరుకి యితని గురించి తెలిసి ఉంటే యితన్ని తీసుకెళ్లి కొడుకు శవం వెతకమనేదేమో! ఇతను పోలీసు స్టేషన్లో నేల కిందే ఉందని చెప్పేసి ఉండేవాడేమో.’’ అని జోక్ చేశాడొకతను.
వెంటనే సిఎం ‘‘కొంపదీసి ఆ సినిమా చూసి కథ అల్లటం లేదు కదా మీరు!’’అన్నారు పోలీసధికారితో.
‘‘భలేవారే, మేడం. ఇది ఎప్పుడో జరిగింది. సినిమా యీ మధ్య వచ్చింది. పైగా నేను ఆ వూరు వెళ్లేసరికే అతనా వృత్తి మానేశాడని చెప్పాను కదా!’’ అన్నాడతను.
‘‘అదేం!? లాభదాయకమైన వృత్తి మానేయడం దేనికి? పైగా ప్రభుత్వానికి సాయపడుతున్నాడు కూడా!’’
‘‘డబ్బు వస్తున్నా అతనికి యీ పని యిష్టం లేదండి. ‘నీళ్లయితే పదిమంది దప్పిక తీరుతుంది. ఇదేమిటి దరిద్రంగా శవాలు తవ్వే పని, రాత్రి కలల్లో కూడా శవాలే’ అనేవాడు. కూలి పనికి వెళ్లి తెచ్చుకున్నదాని మీదనే బతికేవాడు. దీని మీద వచ్చిన డబ్బంతా మూటగట్టి పెట్టాడు. దాని మీద అతని కొడుకు దృష్టి పడింది. ‘నాకిక్కడ పని దొరకటం లేదు. దుబాయి వెళతా. ఈ డబ్బు పెట్టి పంపించు’ అని గొంతుక మీద కూర్చున్నాడు. ‘మా నాన్న పోయాడు. మీ అమ్మా పోయింది. ఒంటరిగా ఉన్నాను. నువ్వెక్కడికో వెళ్లిపోతే ఎలారా?’ అని ఓబులయ్య బతిమాలినా వినలేదు. చివరకు ఓ ఏజంటుకి ఆ డబ్బిచ్చి దుబాయి వెళ్లాడు. అక్కడో ఉద్యోగం చూసుకుని మూణ్నెళ్లకోసారి కొంత డబ్బు తండ్రికి పంపేవాడు. ‘ఇక నాకు యీ పీనుగల డబ్బెందుకు?’ అనేవాడు ఓబులయ్య పోలీసులతో. చాలా బతిమాలితే తప్ప కదిలేవాడు కాదు.
ఓసారి ఓ పార్టీ వాళ్లు బాగా బలవంత పెట్టారు. వాళ్లకది ప్రెస్టేజి క్వశ్చన్ అయిపోయింది. ఇతన్ని బాగా తిప్పారు. ఊరి పొలిమేరల్లో శవం బయటపడింది. తీరా చూస్తే అది కొడుకుది! అతను నిర్ఘాంతపోయాడు. దుబాయిలో ఉండి, ఇండియాకి వచ్చే తన స్నేహితుల ద్వారా క్రమం తప్పకుండా డబ్బు పంపిస్తున్నవాడు యిలా, తన ఊరి నేల కిందే మృతుడై పడి ఉండడం ఎలా సంభవం?
పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విచారించారు. ఇతను పంపించాడంటూ డబ్బు పట్టుకొచ్చినవాణ్ని వెతికి పట్టుకుని ఝాడిస్తే చాలా కథ బయటపడింది. ఓబులయ్య కొడుకు ఓ మోతుబరి కూతుర్ని ప్రేమించాడు. ఆమెను తీసుకుని దుబాయి పారిపోదా మనుకున్నాడు. చివరి నిమిషంలో మోతుబరికి తెలిసిపోయింది. ఇతన్ని పట్టుకుని చంపించి ఊరవతల పాతి పెట్టించాడు. సంగతి బయటపడకుండా ఎవరో ఒకరి ద్వారా తండ్రికి డబ్బు పంపే ఏర్పాటు చేశాడు.
అప్పట్లో సెల్‌ఫోన్లు ఉండేది కావు. ఓబులయ్యకు చదువు రాకపోవడం చేత ఉత్తరాల ప్రసక్తి లేదు. దుబాయిలో బాగానే ఉన్నాడని ఎవరి చేతనైనా చెప్పిస్తే సరిపోయేది. కానీ ఓబులయ్య కున్న ప్రత్యేక శక్తి వలన విషయం బయటపడింది. ఇది ఓబులయ్యనే కలవర పరిచింది, విషాదంలో ముంచింది. తన కొడుకుని చంపించిన వాళ్లపై కేసు పెట్టలేదు. ప్రభుత్వమే కేసు నడిపింది. ఓబులయ్య శవాన్వేషణ వృత్తి మానేశాడు. కూలి పనినే నమ్ముకున్నాడు. ఇప్పుడు ఎవరెంత బతిమాలినా రాడు.
ఇదీ నాకు కానిస్టేబుల్ చెప్పిన ఓబులయ్య కథ. అంతా విని నేను నిట్టూర్చాను. ‘అతనుండి ఉంటే బాగుండేది. కానీ అతని బాధనూ మనం అర్థం చేసుకోవాలి. ఎవరెవరివో శవాలు తగలడం వేరు, సొంత కొడుకు శవం కళ్లబడడం వేరు. అతని సంగతి వదిలేసి మన పద్ధతిలో మనం వెతుకుదాం.’ అన్నాను నేను.
‘‘కరక్టుగా చెప్పారు. రియల్లీ అన్‌ఫార్చునేట్ ఫెలో. అద్భుతకథ చెప్తానంటూ అద్భుతశక్తులున్న ఒక వ్యక్తి విషాద గాథ చెప్పారు మీరు.’’ అన్నారు సిఎం కూర్చున్న చోట నుంచి లేవబోతూ. ‘‘కథ యింకా అయిపోలేదు, మేడమ్.’’ అని పోలీసధికారి అనడంతో ‘అలాగా’ అంటూ మళ్లీ కూర్చున్నారు.
ఓబులయ్య గురించి నాకు తెలిసిన ఓ ఏడాదిన్నరకు.. యింకా అంతకంటె పైనే అయివుంటుంది లెండి.. ఓ పెద్ద కేసు వచ్చింది. ఓ రాజకీయ నాయకుడు ఊళ్లో అందరికీ తలలో నాలుకగా ఉండే ఓ పెద్దమనిషిని చంపించేశాడు. ఆ పెద్దమనిషిదీ పెద్ద స్థాయి కుటుంబమే. తమ్ముళ్లు, కొడుకులూ చాలా మందీమార్బలం ఉండేది. నాయకుడు చేసే పనులు సహించలేక ‘ఈసారి నేను ఎన్నికలలో నిలబడతా’ అన్నాడీయన. అంతే మర్నాటికల్లా మాయమై పోయాడు.
‘చంపి పారేశారు. శవాన్ని మాయం చేశారు కాబట్టి కానీ లేకపోతే నిరూపించేవాళ్లం.’ అంటారు పెద్దమనిషి కుటుంబీకులు. మా మీద పడ్డారు. నాయకుడి దగ్గర్నుంచి లంచం తీసుకున్నానని నామీద ఆరోపణలు చేశారు. లేదు మహాప్రభో అంటే ‘అయితే శవాన్ని కనిపెట్టు’ అంటారు. ‘కాల్చి బూడిద చేసేశారేమో, దూరంగా తీసుకెళ్లి ఏ డ్యామ్‌లోనో పడేశారేమో’ అని వాదించాను. ‘అలా నిరూపించు’ అంటారు వాళ్లు. ‘మా నాన్నగారు ఎనౌన్స్‌మెంట్ చేయంగానే యిలాటిదేదో జరుగుతుందని భయపడి మేము ఊరి చుట్టూ కాపలా పెట్టాం. శవం ఊరు పొలిమేర దాటి ఉండదు. కాలిస్తే మా వాళ్లు ఎవరో ఒకరు చూసి ఉంటారు.’ అని వాదించారు.
ఎన్నిక దగ్గర పడడంతో, ఇద్దరికీ పలుకుబడి ఉండడంతో పైనుంచి ఒత్తిడి రాసాగింది. కేసు క్లోజ్ చేయమని కొందరు, లేదు ఓపెన్‌గానే ఉంచాలి, నాయకుడి ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసు పెండింగులో ఉన్నట్లు కనపడాలి అని మరో వర్గం పట్టుబట్టింది. మాకు పిచ్చెక్కి పోయింది. సర్కిల్ ఇన్‌స్పెక్టరుగారు ఓబులయ్యను పిలిచి, బెదిరించి, పని చేయిద్దామని నిశ్చయించారు. ఓబులయ్య ఓ పట్టాన లొంగలేదు. చివరకు చనిపోయిన పెద్దమనిషి మీద గౌరవం కొద్దీ ఒప్పుకున్నాడు.
ఊరంతా రెండు రోజులు తిరిగాడు. ఎక్కడా ఏమీ ఆచూకీ దొరకలేదు. మూడో రోజు మధ్యాహ్నం అమ్మవారి గుడి దగ్గర తచ్చాడాడు. కాస్త సందేహిస్తూనే ‘నాకేమిటో యిక్కడే ప్రకంపనలు వస్తున్నాయి’ అన్నాడు. అంతా నివ్వెరపోయారు. అది నాయకుడి పొలంలోనే కొత్తగా కట్టిన గుడి. గ్రామదేవతది కాదు కానీ, ఊళ్లో శ్రామికజనం కొలిచే చిన్న దేవతకై రాళ్లూ, సున్నంతో కట్టిన గుడి. అట్టహాసం ఏమీ ఉండదు, చిన్నదే. అక్కడ శవం ఎలా ఉంటుంది? ‘అమ్మవారి శక్తియే నీకు తరంగాల్లా వస్తోందేమో’ అన్నారు ఊళ్లో వాళ్లందరూ.
‘అభ్యాసం లేదు, సాధన లేదు. మంత్రశక్తి అలాగే కూర్చుంటుందా? ఓబులయ్య శక్తంతా పోయింది. పిచ్చిపిచ్చిగా చెప్తున్నాడు. ఇతన్ని నమ్ముకుంటే మునిగినట్లే’ అన్నారు నాయకుడి మనుషులు.
వాళ్లలా అనడంతో పెద్దమనిషి తాలూకువాళ్లు ‘గుడి తవ్వి చూస్తే తప్పేముంది? కావాలంటే మా ఖర్చుతో మేం మళ్లీ కట్టించి పెడతాం.’ అన్నారు. కానీ నాయకుడి పక్షం వాళ్లు ఒప్పుకోలేదు. నాయకుడు కూడా ‘‘పాలిటిక్స్ కోసం సెంటిమెంట్లతో ఆడుకోకండి. గుడి పడగొట్టే పని పెట్టుకుంటే, రేపు మసీదంటారు, చర్చి అంటారు. ఈ ప్రాంతమంతా మతకలహాలతో నిండిపోతుంది. ఇక్కడితో ఆపడం మంచిది.’’ అని ప్రకటించాడు. దాంతో ఎవరూ ఏమీ అనలేకపోయారు. వేరెక్కడా శవం కనబడక పోవడంతో పెద్దమనిషి బంధువులందరూ కోపంతో రగిలారు కానీ ఏం చేయలేక పళ్లు నూరుకున్నారు…’’
‘‘కథ మాట ఎలా ఉన్నా నీ సస్పెన్స్ మాత్రం అద్భుతంగా ఉందయ్యా! దృశ్యం 2 సినిమాలో పోలీసు స్టేషన్ ఫ్లోరింగు కాబట్టి దాన్ని తవ్వించి చూశారు. గుడి అయితే ముట్టుకునే ప్రశ్న లేదు. ‘అన్‌రిజాల్వ్‌డ్ మిస్టరీ’ అనే పేర మా సండే బుక్‌లో ఓ కథనం వేసుకోవచ్చు.’’ అన్నాడు ఒక జర్నలిస్టు.
‘‘అన్‌రిజాల్వ్‌డ్ మిస్టరీ అని ఎవరన్నారు?’’
‘‘మరి’’ అని పలుకంఠాలు ఒకేసారి ప్రశ్నించాయి.
‘‘..వారం రోజుల తర్వాత ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వానలు వచ్చాయి. గుడి పక్కనున్న పెద్ద చెట్టు మీద పిడుగు పడి, అది కాలి, గుడి మీద పడింది. అదే టైముకి భూమి స్వల్పంగా కంపించింది కూడా. గుడి నేలమట్టమై, విగ్రహం ఒక పక్కకు ఒరిగింది. కిందనున్న గోతిలోని శవం బయట పడింది…’’
‘‘అయ్యబాబోయ్, క్లయిమాక్స్ విజువల్‌గా కూడా అదిరిందండోయ్.’’ అని అరిచారెవరో!
‘‘..ఇక ఆ పైన జరిగింది నేను చెప్తాను చూడండి. పెద్దమనిషి తాలూకు వాళ్లు ఓబులయ్యకు నిలువెత్తు బంగారం యిచ్చి ఉంటారు.. ఇలాటి అద్భుతశక్తి ఉన్నందుకు వేనోళ్ల ప్రసంశించి ఉంటారు..’’
అతన్ని ఒక చేత్తో వారిస్తూ పోలీసధికారి కథకు ముక్తాయింపు చెప్పాడు – ‘‘అంతవరకు ఎవరైనా ఊహిస్తారు. కానీ మూడు రోజుల తర్వాత మాతో సహా ఎవరూ ఊహించనిది జరిగింది. ఓబులయ్య శవం ఊరి మధ్యలో చెట్టుకి వేలాడింది. ఉరి వేసుకున్నాడని చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. చంపి, వేలాడగట్టారని గాయాల బట్టి స్పష్టంగా తెలిసేట్లాగానే చేశారు. నాయకుడి పనే అని అందరికీ తెలుసు. కానీ ఎవరూ కిక్కురుమనలేదు. ఆ పైన ఆ ప్రాంతాల్లోనే కాదు, నాకు తెలిసిన ఏ ప్రాంతంలోనూ శవాన్ని అన్వేషించే శక్తి ఉందని ఎవరూ చెప్పుకోలేదు.’’ అద్భుతరసయామిని సీరీస్‌లో మరో కథ వచ్చే నెల రెండో బుధవారం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)