సినిమా కంటెంట్ లకు వ్యూస్ రావడం పెద్ద కష్టం కాదు. దానికి సవాలక్ష మార్గాలు వున్నాయి. కానీ ట్రెండింగ్ లోకి రావడం కష్టం. ట్రెండింగ్ లోకి రావాలంటే రియల్ వ్యూస్ రావాలి. అలా ట్రెండింగ్ లో వచ్చి నిలబడడం మరీ కష్టం. ఎందుకంటే గంట గంటకూ కొత్త కంటెంట్ వచ్చి పడిపోతూ వుంటుంది. ఇలాంటి నేపధ్యంలో ఓ పాట వారం రోజుల పాటు ట్రెండింగ్ లో అది కూడా నెంబర్ వన్ పొజిషన్ లో అలాగే వుందీ అంటే..సమ్ థింగ్ స్పెషల్ అనుకోవాల్సిందే.
నాని హీరోగా తయారవుతున్న డిఫరెంట్ సినిమా దసరా. ఈ సినిమా నుంచి వచ్చిన పాట యూ ట్యూబ్ లో వారం రోజుల పాటు నెంబర్ వన్ పోజిషన్ లో నిలదొక్కుకుంది. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే ఈ పాట ఇప్పటి వరకు నాని చూపించని విధంగా చూపించింది. పక్కా రగ్డ్ లుక్ తో, మాస్ అప్పీల్ తో సాగిన పాట ఇది. పాట మొత్తం డార్క్ థీమ్ నే. అని నచ్చే ఏడున్నర మిలియన్ల వ్యూస్ వచ్చాయన్న మాట.
నాని అంటే క్లాస్ లుక్ తో వుంటాడనే ఇన్నాళ్లూ వున్న ఫీలింగ్. తొలిసారి అస్సలు గుర్తు పట్టలేని గెటప్ లో కనిపించాడు. ఫ్యాన్స్ అయితే కొంచెం గాభరా పడ్డారు కూడా. నాని ఇంత రఫ్ అండ్ రగ్డ్ గా వుంటే చూడగలమా అని. అయితే సినిమా అంతా ఇలా వుండడని, కేవలం ఈ పాటలోనే అన్నది యూనిట్ వర్గాల బోగట్టా.
48 కోట్లు నాన్ థియేటర్, 24 కోట్ల తెలుగు థియేటర్ హక్కులు ఇప్పటికే బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే వున్నాయి. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగి రెడ్డి, నరసమ్మ తదితరులు పాడారు. కాసర్ల శ్యామ్ సంగీతం అందించారు.
విరాటపర్వం లాంటి ప్రశంసాత్మక చిత్రం అందించిన సుధాకర్ చెరుకూరి నిర్మాత. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.