మెగాసైన్యం మూకుమ్మడి తప్పు

పరిణితి వచ్చే వరకు, ఒక వయసు వచ్చే వరుకు పిల్లలు చేసే తప్పులకు తండ్రులదే బాధ్యత. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే అంటోంది. మేజ‌ర్లు కాని వారు డ్రైవ్…

పరిణితి వచ్చే వరకు, ఒక వయసు వచ్చే వరుకు పిల్లలు చేసే తప్పులకు తండ్రులదే బాధ్యత. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే అంటోంది. మేజ‌ర్లు కాని వారు డ్రైవ్ చేస్తే ఆ తప్పు తల్లితండ్రులదే అంటోంది. ఈ లెక్కన మెగా సైన్యం చేస్తున్న మూకుమ్మడి దాడి ఫలితం మెగాస్టార్ ఖాతాలోకే చేరుతుంది తప్ప వేరు కాదు.

మెగాస్టార్ ముందు గరికపాటి నరసింహారావు చాలా అల్పుడు. సాక్షాత్తూ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య గారి మనవడు అనంత్ శ్రీరామ్ లాంటి ప్రముఖ విద్వాంసుడే ఆయను ‘గరిక’పాటి అని చెప్పారు కనుక మనం నమ్మాల్సిందే. అలాంటి గరిగపాటి, హానుభావుడు..మేధావి..మెగాస్టార్ పట్ల క్షమింపరాని ఘోరాపరాధం చేసారు కనుక నాగబాబు దగ్గర నుంచి ఆర్జీవీ వరకు అందరూ నానా మాటలు అన్నారు. క్షణికావేశాన్ని అణుచుకోలేకపోయారు కనుక గరికపాటి కూడా భరించారు. క్షమాపణ చెప్పారు.

కానీ మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే సంస్థ అధిపతి అయిన స్యామి నాయుడు కూడా గరికపాటిని ఇంకా టార్గెట్ చేసి, గరిక, పూలు పంపిస్తున్నాం అంటూ సుద్దులు చెబుతున్నారు చూడండి. అక్కడ కొంచెం బాధగా వుంది.

గరికపాటి నిజంగానే మెగాస్టార్ ముందు ‘గరిక’ పాటి చేయకపోవచ్చు. ఎందుకుంటే ఆయన మెగాస్టార్. వందకు పైగా సినిమాలు చేసారు. వేల కోట్లు ఆర్జించారు. ఆయన ముందు ఈ ఆవేశం ఆపుకొలేని వెర్రిబాపనోడు ఏపాటి? కానీ ఎంత కాదన్నా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి కూడా లోకువైపోయాడే..పాపం.

అందుకే అన్నారు. నోరు సంబాళించుకోవాలి అని. లేదూ అంటే ఇదిగో ఇలాగే చులకనైపోతారు. మొగుడికి లోకువైతే అందరికీ లోకువే అని సామెత. ఇప్పుడు గరికపాటి బతుకు అలా అయిపోయింది. శతావధానాలు, ద్విశతావధానాలు గాలికిపోయాయి. పురాణాలు, పద్యాలు అవలోకగా వల్లించగల మేధస్సు గోదాట్లో కలిసిపోయింది.

కానీ మెగాస్టార్ ఒక విషయం గమనించాలి. ఎవరు అన్నా మెగా ఫ్యాన్స్ అన్నారు, చిరంజీవి బ్రదర్ అన్నారు. చిరంజీవి తాలూకా జ‌నాలు అన్నారు అంటారు తప్ప, వాళ్లందరికీ స్వంత ఐడెంటిటీ వుండదు. అందువల్ల ఇవన్నీ పడేది మెగాస్టార్ ఖాతాలోనే. వీళ్లంతా ఆయన మెచ్చుకోలు కోసం ఇలా చేస్తూ వుండొచ్చు. కానీ దాని ప్లస్ లు మైనస్ లు మాత్రం పడేది మెగా ఖాతాలోనే. 

అది గమనించి అయినా ఈ ‘గరిక’ పాటి ఉద్యమాన్ని ఆపమని కనుసైగ చేస్తే సరి. లేదూ అంటే ఆయనే ఇదంతా చేయిస్తున్నారని జ‌నం నమ్మే పరిస్థితి వుంటుంది.