ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై పచ్చ ముద్ర బలంగా పడింది. ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవే టీడీపీ మాజీ నేతకు దక్కింది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ లో తనదైన మార్పులు తీసుకు రావాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. సీనియర్లను పక్కనపెట్టి, తన వర్గాన్ని ప్రోత్సహించుకునే పనిలో పడ్డారు.
ఇప్పటికే నియోజక వర్గాల్లో పాతుకుపోయినవారికి కాంగ్రెస్ అధిష్టానమే సుపీరియర్, వారెవరూ రేవంత్ ని లెక్కపెట్టట్లేదు, లెక్క పెట్టరు కూడా. దీంతో కొత్త బ్యాచ్ ని సిద్ధం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. రాబోయే 20 నెలలు కష్టపడి పనిచేసినవారికే టికెట్లు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికా, లేక రేవంత్ ఇమేజ్ పెంచడానికి కష్టపడి పనిచేసేవారికా అనేది మాత్రం సస్పెన్స్.
చంద్రబాబు బాటలో రేవంత్..
ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాగేసుకునే సమయానికి చంద్రబాబుకి పెద్దగా సపోర్ట్ లేకపోయినా, బలవంతంగా అందరి నోళ్లూ మూయించారు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపి ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత ఆయన పార్టీలో తన వర్గాన్ని పెంచుకున్నారు. ఎన్టీఆర్ ని మాత్రమే అభిమానించేవారిని పూర్తిగా పక్కకు తప్పించారు.
ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో అందరికీ తెలిసిందే. జై ఎన్టీఆర్ అనే వారు పోయి, జై చంద్రబాబు అనేవారు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో అదే పని చేస్తున్నారు. జై కాంగ్రెస్, జై సోనియా అంటూ రేవంత్ బిల్డప్ ఇస్తున్నారే కానీ, పార్టీలో జై రేవంత్ అనేవారికే చోటు. యువతరానిరి పెద్దపీట అనే పేరుతో రేవంత్ తన వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి అన్ని నియోజకవర్గాల్లో రేవంత్ మనుషులే ఉండాలనేది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఇప్పటినుంచే ఆయన పావులు కదుపుతున్నారు. సీనియర్లను ఎక్కడికక్కడ వ్యతిరేకిస్తున్నారు. వారికి పక్కలో బల్లేల్లా తన మనుషుల్ని దింపుతున్నారు. అదను చూసి ఆయా నియోజకవర్గాలకు వారిని ఇన్ చార్జిలుగా నియమించాలనేది ఆయన ఆలోచన. అందుకే పార్టీకోసం కష్టం, 20 నెలల పని అంటూ ఏవేవో లెక్కలు చెబుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ వి ఇప్పటివరకూ మితవాద రాజకీయాలే. కేసీఆర్ నోటికి ఎవరూ ఎదురు చెప్పలేక బిక్కచచ్చిపోయారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది మా పార్టీయేనని చెప్పుకునే ధైర్యం కూడా ఎవరికీ లేకుండా పోయింది. అప్పట్లో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు తమ పార్టీయే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి కారణం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ కి ఆయన స్టైల్ లోనే, అదే భాషలో జవాబులు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డిది కేవలం మాటల ప్రతాపమే కానీ, చేతల ప్రతాపం కాదని అందరికీ తెలుసు. అందుకే కాంగ్రెస్ సీనియర్లు అదను కోసం వేచి చూస్తున్నారు. ఎగిరెగిరి పడే రేవంత్ రెడ్డి ఎప్పుడో ఒకసారి కిందడపటం ఖాయ మంటున్నారు. అయితే ఈలోగా తన వర్గాన్ని కాంగ్రెస్ లో బలపరచుకుని, పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఎవరి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.