రాజకీయాల్లో కూడా జోకర్స్ పార్టీలుంటాయా? అంటే…ఉంటాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పుణ్యమా అని తెలంగాణలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నోటికి హద్దూఅదుపూ లేకుండా విమర్శలకు దిగుతుండడాన్ని చూడొచ్చు.
ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీజేపీపై టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మాటల దాడి చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీని అవహేళన చేశారు. బీజేపీ అంటే… బిగ్ జోకర్స్ పార్టీగా అభివర్ణించారు. పసువు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఫేక్ ఎంపీ అరవింద్ అని విరుచుకుపడ్డారు.
అలాంటి అరవింద్‌కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, హరీష్‌రావుల గురించే మాట్లాడే స్థాయి లేదని హితవు పలికారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలున్న అర్వింద్.. ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తారా? అని ప్రశ్నించారు.
అవినీతి గురించి అరవింద్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. 28 మంది అవినీతిపరులను దేశం దాటించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రాక ముందే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇక షెడ్యూల్ వస్తే రాజకీయ విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.