విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు సంచలన కామెంట్స్ చేశారు. వర్చువల్ పద్ధతిలో ఆదివారం ‘మా’ కార్యవర్గం సమావేశం జరిగింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు టాలీవుడ్‌లో రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై నటి హేమ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానిపై క్రమశిక్షణ సంఘం నోటీసు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.
‘మా’ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణ సంఘానికి లేఖ రాయడంపై టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో నటి హేమపై చర్యలకు క్రమశిక్షణ సంఘం వేగంగా స్పందించిందనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో నేడు జరిగిన సమావేశంలో విలక్షణ నటుడు మోహన్‌బాబు తనదైన స్టైల్‌లో మాట్లాడి చర్చకు అవకాశం ఇచ్చారు. ‘మా’ అధ్యక్ష బరిలో మోహన్‌బాబు తనయుడు విష్ణు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మోహన్‌బాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా ఉంది. యథారాజా, తథా ప్రజా అని మా గురువు దాసరి గారు అన్నారు. ‘మా’లో సభ్యులు ఎంత మంది? ఏమిటి? ఎవరు? మనమెందుకు మీటింగ్ పెట్టుకున్నాం? ‘మా’ గొప్పతనం, మహాతల్లి, మనతల్లి. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు? ఎన్నెన్నో జరుగుతున్నాయి. అన్నీ చూస్తున్నాం. అందరూ మేధావులే.
మేధావులకు నమస్కారం. ఒకర్నొకరు అనే స్థితిలో లేరు. ఎవరికి వారు గొప్ప. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఎస్వీ రంగారావు దగ్గరి నుంచి అందర్నీ చూసిన వాన్ని. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఎన్నో వింతలు విశేషాలు. సరే ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనేది నాకు అర్థం కాలేదు. మరిచిపోయాను. క్షమించండి.
జీవితా ..రాజశేఖర్‌కు చెప్పమ్మా! వెల్‌కం. సంస్థ అతనిది. అతను ఎందుకిలా జరిగిందని అడిగితే నేను చెప్పలేనమ్మా. ‘మా’ అనేది అతనిది. మంచి నటుడు. అతను లేని కొరత ఉండింది’ అని మోహన్‌బాబు మాట్లాడ్డంపై టాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు.
మోహన్‌బాబు మాటల్లో నిర్వేదం, ఆవేదన ప్రతిబింబిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇండస్ట్రీలో తాజా పరిస్థితులపై ఆయన మనస్తాపం చెందినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.