జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వైసీపీ తీవ్రస్థాయిలో రాజకీయ దాడి సాగిస్తోంది. అప్పుడప్పుడు ట్వీట్లతో ఉనికి చాటుకునే పవన్‌కల్యాణ్‌ను ఏపీ మంత్రులు ఎందుకంత సీరియస్‌గా పట్టించుకుంటున్నారనే ప్రశ్న వస్తోంది. మరోవైపు వైసీపీ ట్రాప్‌లో ఎల్లో మీడియా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అడపాదడపా కనిపించే పవన్‌కల్యాణ్ పేరు మీడియాలో ప్రముఖంగా కనిపించడంపై టీడీపీ అసహనంగా వుంది. ఇది రాజకీయంగా తమకు నష్టం కలిగిస్తుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వైసీపీ, జనసేన మధ్యే సాగుతున్న వాతావరణం నెలకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీకి ఇది ఆవేదన కలిగించేదే. ఇదంతా వైసీపీ మైండ్‌గేమ్‌లో భాగమనే చెప్పొచ్చు.
ఏపీలో టీడీపీ ఉనికి లేకుండా చేసే క్రమంలో వ్యూహాత్మకంగా పవన్‌కల్యాణ్‌ను వైసీపీ తెరపైకి బలంగా తెస్తోంది. అందుకే పవన్ ట్వీట్లపై మంత్రులు ఘాటుగా స్పందించడం. పవన్‌కల్యాణ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రభుత్వానికి, మూడు రాజధానులకు వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా తయారైంది.
మంచైనా, చెడైనా ఆ రెండు పార్టీల గురించే ఎల్లో మీడియాలో సైతం డిబేట్లు నిర్వహించాల్సిన దుస్థితి. ఇది వైసీపీ, జనసేనలకు లాభిస్తుంది. మరి టీడీపీ ఏం కావాలి? ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ నిస్సహాయంగా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందేనా? వైసీపీపై తమ నాయకుడు వీరోచిత పోరాటం చేస్తున్నారని జనసేన శ్రేణులు, అలాగే ఆయన సామాజిక వర్గీయుల్లో కొందరు సంబరపడి పోతున్నారు. పవన్‌కల్యాణ్‌ను మంత్రులు తిట్టడం వెనుక వ్యూహం లేకపోలేదు.
జనసేనను ప్రత్యామ్నాయ శక్తిగా చూపడం వైసీపీకి రాజకీయ ప్రయోజనాల రీత్యా ఎంతో అవసరం. అందుకే పవన్ ఒక్క ట్వీట్ చేసినా మంత్రులు క్యూ కట్టి మరీ ఎదురు దాడికి పాల్పడుతున్నారు. తెలుగుదేశం నేతలు ఏం చేస్తున్నారో కూడా తెలియని దుస్థితి. వైసీపీ వ్యూహం సత్ఫలితాలు ఇస్తుందనేందుకు ఇదే నిదర్శనం. రానున్న రోజుల్లో పవన్ వద్దనుకున్నా… ఆయన్ను వైసీపీ లీడర్ చేస్తుందనడంలో సందేహం లేదు. అలాగే పనిలో పనిగా టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను కలవనివ్వరు.
రానున్న రోజుల్లో ఈ పరిణామాలన్నీ పవన్‌కల్యాణ్‌కు సంబంధం లేకుండానే జరిగిపోతాయి. తెలుసుకునే లోపు ఏవేవో జరిగిపోయి వుంటాయి. రాజకీయం అంటే అదే కదా!