ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మంత్రి అవంతి శ్రీనివాసరావు మహిళలతో సరస సంభాషణలు సాగించినట్టు సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ కావడంపై జగన్ ప్రభుత్వం సీరియస్గా ఉంది.
ఈ విషయమై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాఖీ పండుగ సందర్భంగా ఆ ఉదంతంపై సీరియస్గా స్పందించడాన్ని జగన్ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందనే టాక్ వినిపిస్తోంది.
వాసిరెడ్డి పద్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధుల ఆడియోల కలకలంపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వాటిని తమ ప్రభుత్వం ప్రోత్సహించడం లేదా సహించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదని తేల్చి చెప్పారు. ఈ ఆడియోల్లోని వాయిస్ తమది కాదని అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసరావు చెబుతున్నారని ఆమె గుర్తు చేశారు.
అదంతా అభూతకల్పన అని వాళ్లిద్దరూ కొట్టి పారేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే మహిళా కమిషన్ తరపున అసలు వాస్తవాలేంటో నిర్ధారించుకునేందుకు విచారణ జరుపుతున్నామన్నారు.
వరుసగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సరస సంభాషణలకు సంబంధించి ఆడియోలు వైరల్ కావడంపై పూర్తిస్థాయిలో సమాచారం తెప్పించుకుంటామన్నారు. ఒకవేళ ఆ ఆడియోల్లోని వాయిస్ నిజమని తేలితే కఠినంగా శిక్షిస్తామన్నారు. మహిళలతో అసభ్య ప్రవర్తను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని వాసిరెడ్డి పద్మ తేల్చి చెప్పారు.