గత ఏడాది పంటనష్టానికి సంబంధించి ప్రభుత్వం బీమా చెల్లింపులను చేపట్టడం రాయలసీమ ప్రాంతంలో రైతాంగానికి ఆనందకరమైన అంశం అవుతూ ఉంది. చంద్రబాబు హయాంలో ఇన్సూరెన్స్ ల ఊసేలేదు. అప్పుడు మాటెత్తితే రుణమాఫీ చేశామంటూ ఇన్సూరెన్స్ ల, ఇన్ పుట్ సబ్సిడీల ఊసేలేకుండా చేశారు. రుణమాఫీ అంటూ ఏడాదికి కొంత మొత్తాన్ని కొంతమంది రైతుల ఖాతాలకు జమ చేశారు. అయితే మాఫీ చేసింది కూడా మూడేళ్లే.
తాము సంపూర్ణ రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఏం చేశారో అందరికీ తెలిసిన సంగతే. ప్రత్యేకించి రైతులకు ఆ విషయం బాగా తెలుసు. ఐదేళ్లలో మూడు విడతల మాఫీనే జరిగినట్టుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్లే ఒప్పుకుంటున్నారు. మిగిలిన రెండు విడతల మాఫీని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేయాలంటూ తెలుగుదేశం వాళ్లు వాదిస్తూ ఉండటం గమనార్హం!
ఇలాంటి చీదరింపు వాదనలతో తెలుగుదేశం పార్టీ వాళ్లు తమ డొల్లతనాన్ని తామే బయటపెట్టుకుంటూ ఉన్నారు. ఇక రైతులు మరిచిపోయినట్టే అనుకున్న పంటల బీమా పథకానికి జగన్ ప్రభుత్వం ఆదరణ చూపిస్తూ ఉంది. గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు ఇప్పుడు చెల్లింపులు మొదలయ్యాయి. రైతులందరికీ ఇది చాలా ఉపయుక్తమైన కార్యక్రమం అవుతోంది. ఎకరాకు కనీసం నాలుగు వేల రూపాయల పై మొత్తమే బీమా మొత్తంగా అందుతోంది. కొంతమంది రైతులు భారీ మొత్తం బీమా కూడా దక్కుతూ ఉంది.
యాభై వేలు, అరవై వేల రూపాయల బీమాను పొందుతున్న రైతుల కుటుంబాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాయలసీమ రైతాంగానికి ఇది ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా నిలుస్తోంది. ఇన్ పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్స్ లు ఇక మరిచిపోయిన కథలే అనుకుంటున్న తరుణంలో.. ఈ చెల్లింపులు వ్యవసాయధారులకు సాగు పట్ల ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి. పంటనష్టపోయినా బీమా ఉందనే భరోసా వ్యవసాయధారులకు మేలు చేస్తుంది. మాఫీల కన్నా.. ఇన్సూరెన్స్ లు చాలా అర్థవంతమైనవని ఆలోచనపరులు ఎవరైనా అర్థం చేసుకోగలరు.