cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బియాండ్ బాలీవుడ్ః ప్రాంతీయ సినిమాలు అదుర్స్!

బియాండ్ బాలీవుడ్ః ప్రాంతీయ సినిమాలు అదుర్స్!

బాలీవుడ్ కు సబ్జెక్టులు లేక ఇతర భాషల వైపు చూస్తూ ఉంది. ప్రాంతీయ భాషల్లో వచ్చే సినిమాలను రీమేక్ చేయడం, డబ్బింగ్ చేయడం.. ఇదే  బాలీవుడ్ కు ఇప్పుడు విజయానికి సూత్రం అవుతూ ఉంది. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే రోజులు పోయాయి. ఇప్పుడు దక్షిణాది సినీ స్టార్లకు, ప్రాంతీయ భాషల సినిమా వాళ్లకు కూడా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కుతూ ఉండటం గమనార్హం. ఒకటి కదు, రెండు కాదు.. వివిధ భాషల నుంచి వివిధ సినిమాలు సాధించిన సంచలన విజయాలు యావత్ భారతదేశాన్నీ ఆకర్షించాయి. హిందీ సినిమాలు మాత్రమే దేశమంతా ఆడతాయి అనే పరిస్థితి పోయి, ఏ భాష సినిమా అయినా అంతటా ఆడే పరిస్థితి వచ్చిందిప్పుడు. ప్రత్యేకించి గత నాలుగైదేళ్లలో ఈ పరిస్థితి విస్తృతం కావడం గమనార్హం.

ఇదివరకూ తెలుగులో ఒక సినిమా హిట్ అయ్యిందంటే అది తమిళంలో రీమేక్ అయ్యేది, తమిళంలో హిట్ అయిన సినిమా తెలుగులోకి  డబ్బింగ్ అయ్యేది. అయితే ఇప్పుడు సౌత్ లో వచ్చే ప్రతి సినిమా మీదా బాలీవుడ్ కన్నుపడుతూ ఉంది. సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసే పద్ధతి 80లలోనూ 90లలో కూడా ఉన్నా.. అప్పుడు కథ వేరు ఇప్పుడు కథ వేరు. శాటిలైట్, డిజిటల్ మార్కెట్ పరిధి విస్తృతం అయ్యాకా దక్షిణాది సినిమాలకు బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. దాదాపుగా ప్రతి ప్రముఖ సినిమా ఇప్పుడు హిందీలోకి డబ్ అవుతూ ఉంది! హిందీ డబ్బింగ్ ను ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి సౌత్ సినిమాలు. ఇక్కడి చోటామోటా హీరోలు కూడా బాలీవుడ్ వెర్షన్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించుకునే అవకాశాలను పెంచుకున్నాయి.

ఇక ప్రాంతీయ భాషల వైపు బాలీవుడ్ ఇప్పుడు ఆశగా చూస్తూ ఉంది. వాటిని రీమేక్ చేయడానికి, లేదంటే డబ్బింగ్ చేసుకోవడానికి అక్కడి ప్రొడ్యూసర్లు పోటీ పడుతూ ఉన్నారు. బాలీవుడ్ లో షో మెన్ గా వెలుగుతున్న వాళ్లే ఈ విషయంలో ఉత్సాహంతో ఉండటం గమనార్హం. ఇక్కడ క్రేజీగా విడుదల అవుతున్న సినిమాలను రీమేక్ విషయంలో ముందుగానే వారు స్పందిస్తూ ఉన్నారు. ‘డియర్ కామ్రేడ్’ విషయంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ ఇంకా విడుదలకు ముందే స్పందించాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

దాదాపు ఆరు కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించి ఆ సినిమా విడుదలకు ముందే రీమేక్ రైట్స్ ను కొనేశారని సమాచారం. తీరా ఆ సినిమా తెలుగులో అంతగా ఆడకపోవడంతో ఇప్పుడు హిందీ వెర్షన్ రీమేక్ ఉంటుందా? లేక డబ్బింగ్ మాత్రమే ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే కేవలం డబ్బింగ్ చేసినా విజయ్ దేవరకొండకు హిందీ జనాల మధ్యన ఉన్న క్రేజ్ తో ఆ సినిమాకు లాభాలే దక్కే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమను అని కాకుండా.. ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో బాగా ఆసక్తిని రేపింది కూడా ఈ మధ్యకాలంలో ప్రాంతీయ భాష సినిమాలే.

ఒకవైపు బాలీవుడ్ లో స్టార్ హీరోలు విజయాలను సాధించడానికి డక్కామొక్కీలు తింటున్నారు. సల్మాన్ పక్కా కమర్షియల్ సినిమాలే చేస్తూ ఉన్నాడు. వాటిల్లో ఒక్కటి హిట్ అయితే రెండు మూడు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక షారూక్ విజయం అందుకుని చాలా కాలం అయ్యింది. ‘దంగల్’ అనంతరం ఆమిర్ ఖాన్ కూడా మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోతూ ఉన్నాడు. ఇక అక్షయ్ కుమార్ ఏవో సినిమాలు చేస్తూ పోతున్నాడు. వాటితో సగటు ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్షన్ ఏర్పడిందో చెప్పలేని పరిస్థితి. అందరినీ మెప్పించే సినిమాలు చేయలేకపోతున్నాడు అజయ్ దేవగణ్. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు మెరుపులు మెరిపిస్తున్న పరిస్థితి లేదు.

విభిన్న సినిమాలను ఆశించే ప్రేక్షకుల ఆకలిని సౌత్ సినిమాలే తీరుస్తూ ఉన్న వైనాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. తెలుగు విషయానికే వస్తే గత కొంతకాలంలో ‘అ!’, ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘పెళ్లి చూపులు’, ‘మహానటి’, ‘అర్జున్ రెడ్డి’ తాజాగా ‘మల్లేశం’ వంటి విభిన్నభరిత సినిమాలు వచ్చాయి. ఇవి సినిమాను ఇష్టపడే, సినిమాలో కొత్త దనాన్ని ఆశించే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. క్యారెక్టర్ స్టడీ విషయంలో ఈ సినిమాలు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒక్కోటి ఒక్కో రకమైన అనుభూతిని కలిగించాయి.

తెలుగులో రాజ్యం కమర్షియల్ సినిమాలదే. అలాంటి చోట కమర్షియల్ హిట్ కొడితే తప్ప నిలదొక్కుకోలేని పరిస్థితి ఉన్న చోట ఇలాంటి సినిమాలు రావడం అభినందనీయం. ఈ సినిమాలు తెలుగుతేర మూవీ క్రిటిక్స్ ను కూడా ఆకట్టుకున్నాయి. అమితానంద పెట్టాయి. వైవిధ్యభరితం అనిపించుకున్నాయి. ఇలాంటి మరిన్ని సినిమాలు రావడానికి ఈ సినిమాలు ఊతం ఇచ్చాయి. ఇక వైవిధ్యభరిత సినిమాలకు, ‘రా’ సినిమాలకు కేరాఫ్ అయిన మలయాళం కూడా ఆ పరంపరను కొనసాగిస్తూ ఉంది. ప్రేమమ్, అంగమాలి డైరీస్, మయానాదీ,మహేశింటే ప్రతీకారం.. వంటి విభిన్ననమైన సినిమాలను గత రెండు మూడేళ్లలో అందించి మలయాళీ చిత్ర పరిశ్రమ.

ఈ విషయంలో తమిళులు కూడా తీసిపోలేదు. జిగర్ తాండా,సేతుపతి, పేరన్బు తదితర వైవిధ్యభరిత సినిమాలు, సినిమా నుంచి అనుభూతులను ఆశించే వారిని ఆకట్టుకున్నాయి.  కన్నడ నుంచి ‘తిథి’, మరాఠీ నుంచి ‘సైరట్’, ‘కోర్ట్’ వంటి ఎమోషనల్ డ్రామాలు వచ్చాయి. ఇంకా అస్సామీ తదితర భారతీయ ప్రాంతీయ భాషల నుంచి కూడా అభినందనలు అందుకునే స్థాయి సినిమాలు వచ్చాయి వస్తున్నాయి. ప్రాంతీయ భాషల సినిమాల్లో కూడా ఇప్పుడు వైవిధ్యం పాళ్లు పెరుగుతూ ఉన్నాయి. ప్రయోగాలు పెరుగుతూ ఉన్నాయి.

కొన్నేళ్ల కిందటి వరకూ తెలుగు సినిమాలను ఎందుకు చూస్తారు? తెలుగు నుంచి డబ్ అయిన సినిమాల పట్ల అంత క్రేజ్ ఎందుకు? అని హిందీ వాళ్లను అడిగితే ‘ఫైట్స్’ అనే సమాధానం ఇచ్చేవాళ్లు. తెలుగు సినిమాల్లో భారీ ఫైటింగులు, వెరైటీ ఆయుధాలతో దాడులు చేసుకునే సీన్లు ఉంటాయని... అవి సరదాగా, కామెడీగా అనిపిస్తాయి కాబట్టి చూస్తామని కొంతమంది గడుసరి హిందీ ప్రేక్షకులు చెప్పేవాళ్లు. అయితే ఇప్పుడు అవే తెలుగు సినిమాలను వాళ్లు రీమేక్ చేసుకుని చూపే పరిస్థితి వచ్చింది. ఫైటింగుల సినిమా కాని అర్జున్ రెడ్డి హిందీలో రీమేక్ అయ్యి మూడు వందల కోట్ల రూపాయల పై స్థాయి వసూళ్లను సాధించింది.

ఇక సౌత్ సెలబ్రిటీల, సౌత్ సినిమా వాళ్లకు ముంబై లో చాలా విలువ పెరిగిన వైనాన్ని కూడా గమనింవచ్చు. హిందీలో స్టార్స్ గా చలామణి అయిన తెలుగు జనాలు, దక్షిణాది క్రియేటర్లు తక్కువ మందే. మొన్నటి వరకూ రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, శంకర్ లనే దక్షిణాది ప్రముఖ దర్శకులుగా చూసేది బాలీవుడ్ మీడియా. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సందీప్ రెడ్డి వంటి దర్శకుడు కూడా అక్కడ మీడియాకు కావాల్సిన వ్యక్తిగా మారిపోయాడు. సౌత్ హీరోలను కాఫీ తాగుదురమ్మంటూ కరణ్ జొహార్ పిలుస్తున్నాడు.

సౌత్ హీరోల ఇంటర్వ్యూల కోసం అక్కడి సినీ జర్నలిస్టులు  వస్తున్నారు. ఇలా సౌత్, తెలుగు సెలబ్రిటీలకు ముంబైలో క్రేజ్ గట్టిగానే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే బాలీవుడ్ సినీ జనాలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి హైదరాబాద్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగు సినిమా వాళ్లు కూడా తమ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళ్లే పని మొదలైంది! ఇలా భారతీయ సినిమా ముఖచిత్రంలో చాలా మార్పే కనిపిస్తూ ఉంది!

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది