రీసెంట్ గా లాంఛ్ అయింది బంగార్రాజు సినిమా. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా రాబోతున్న ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకుడు. సినిమాకు సంబంధించి మీడియాలో వస్తున్న గాసిప్స్ తో పాటు, మరెన్నో విశేషాల్ని బయటపెట్టాడు ఈ దర్శకుడు.
“బంగార్రాజు సినిమాను కొంతమంది సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అంటున్నారు. మరికొంతమంది ప్రీక్వెల్ అంటున్నారు. నేనైతే ఏదీ అనను. ఎందుకంటే, ఇదొక ఫ్రెష్ కథ. గతంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా చూడని వాళ్లకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. అయితే అప్పటి సినిమాను గుర్తు తెచ్చేందుకు సినిమా ప్రారంభంలో సోగ్గాడే సినిమా క్లిప్స్ కొన్ని చూపించబోతున్నాం. కథ-స్క్రీన్ ప్లేకు ఇది అవసరం.”
మనం సినిమాలో నాగార్జున-నాగచైతన్య కలిసి నటించారు. అదే సినిమా క్లైమాక్స్ లో అఖిల్ కూడా కనిపించాడు. మరి బంగార్రాజులో అఖిల్ ను ఎందుకు తీసుకోలేదు? లేదంటే మనం సినిమా టైపులో మెరుస్తాడా? ఈ ప్రశ్నకు కూడా కల్యాణ్ కృష్ణ సమాధానం ఇచ్చాడు.
“బంగార్రాజు సినిమాలో నాగచైతన్య, నాగార్జున మాత్రమే కనిపిస్తారు. నిజానికి ఈ సినిమాలో అఖిల్ కూడా ఉండాల్సింది. స్క్రిప్ట్ లో అలా ప్లాన్ చేశాం కూడా. కానీ ప్రస్తుతం అఖిల్ చేస్తున్న సినిమాతో బంగార్రాజుకు కాల్షీట్లు క్లాష్ అవుతున్నాయి. అందుకే అఖిల్ ను తీసుకోలేకపోయాం.”
ఇలా అఖిల్ బిజీ అనే విషయాన్ని బయటపెట్టాడు కల్యాణ్ కృష్ణ. నిజానికి అఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఒకే ఒక్కటి. ఆ సినిమాతో పాటు బంగార్రాజులో ఓ చిన్న పాత్ర పోషించడానికి కాల్షీట్లు క్లాష్ అవ్వడం లాంటి సమస్యలు ఎదురుకావు. పైగా ఇది నాగార్జున సినిమా. నాగ్ చెబితే అఖిల్ కాదనడు. కానీ కల్యాణ్ కృష్ణ ఈ విషయాన్ని కవర్ చేయలేకపోయాడు. అఖిల్ బిజీ అని చెప్పే ప్రయత్నం చేశాడు.