ఆయనో సీనియర్ నిర్మాత. కాస్త గ్యాప్ తరువాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసారు మళ్లీ. ఓ భారీ సినిమా తలకెత్తుకున్నారు. కానీ హీరో ఇదిగో అదిగో అంటూ, ఆయనకు మూడ్ వచ్చినపుడు, ఖాళీ దొరికినపుడు షూట్ చేస్తూ, ఈ లోగా వేరే సినిమాలు చేసుకుంటూ పని కానిస్తున్నారు. దీంతో ఏమీ అనలేక, ఆగలేక కిందా మీదా అయిపోతున్నాడా సీనియర్ నిర్మాత.
ఆఖరికి ఓ రోజు..'కాస్త కనికరించండి..మిమ్మల్ని నమ్మి 150 కోట్లు పణంగా పెడుతున్నా' అనే టైపులో ఓ విన్నపాన్ని మెసేజ్ రూపంలో పంపించారు. ఆ వెంటనే హీరో నుంచి కబురు వచ్చింది. కానీ డేట్ లు కేటాయించడానికి కాదు. క్లాస్ పీకడానికి. ఆ క్లాస్ ఇలా సాగిందని బోగట్టా.
' నువ్వు నన్ను నమ్మి 150 కోట్లు పెట్టడం ఏమిటి? కథను నమ్మి పెడుతున్నా అని చెప్పు..కథ డిమాండ్ చేస్తే పెడుతున్నా అని చెప్పు..అంతే కానీ నన్ను నమ్మి, నా కోసం పెడుతున్నా లాంటి కబుర్లు చెప్పొద్దు. కథ డిమాండ్ చేయకపోతే, అవసరం లేకపోతే 150 కోట్లు పెడతావా? ' ఇలా ఈ విధంగా క్లాసి పీకి పంపారట. డేట్ లు కేటాయించకుండానే.
ఏం చేస్తారు ఆ సీనియర్ నిర్మాత. హీరోలు అన్నాక పడాల్సిందే. భరించాల్సిందే. పూరి జగన్నాధ్ చెప్పారుగా..'గిల్లితే గిల్లించుకోవాల్సిందే కానీ, అరవకూడదు అని'.