కోట శ్రీనివాసరావు మొహంపై ఉమ్మేసిన బాలయ్య

బాలయ్య బిహేవియర్, ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు నోరు జారారు, మరెన్నో సార్లు చేయి చేసుకున్నారు. ఆయనంతే అని అంతా వదిలేశారు కూడా. అయితే బాలయ్యకు ఈ యాటిట్యూడ్…

బాలయ్య బిహేవియర్, ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎన్నోసార్లు నోరు జారారు, మరెన్నో సార్లు చేయి చేసుకున్నారు. ఆయనంతే అని అంతా వదిలేశారు కూడా. అయితే బాలయ్యకు ఈ యాటిట్యూడ్ ఈమధ్య వచ్చింది కాదు, ఏళ్ల కిందటే ఆయన ''అదో టైపు'' అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మొహంపై బాలయ్య ఉమ్మేసిన ఘటన ఒకటి బయటకొచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కోట బయటపెట్టారు.

“రాజమండ్రిలో ఓసారి బాలయ్య తగిలాడు. ఆయనేదో సినిమా పనిమీద వచ్చాడు. నేను జంధ్యాల గారి సినిమా కోసం వెళ్లాను. పొద్దున్నే కిందకొచ్చి లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. పరుచూరి బ్రదర్స్ నన్ను చూసి పక్కకు తప్పుకోమని సైగలు చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఇటు చూస్తే బాలకృష్ణ వస్తున్నాడు. నేను గౌరవంగా నమస్కారం బాబు అన్నాను. కాండ్రించి నా మొహం మీద ఉమ్మేశాడు. ఏం చేస్తాం, ఏం చేయలేకపోయాను.”

ఇలా తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టారు కోట. అసలు బాలయ్య ఎందుకిలా వ్యవహరించాల్సి వచ్చిందో కూడా బయటపెట్టారు కోట. ఓ సినిమాలో తను ఎన్టీఆర్ వేషం వేశానని, అది బాలయ్యకు నచ్చలేదని అన్నారు.

“ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో మండలాధీశుడు అనే సినిమా చేశాను. అందులో రామారావు గారి వేషం వేశాను. ఆ పాత్ర చాలా వివాదాస్పదమైంది. విజయవాడలో ఓసారి నన్ను ఎన్టీఆర్ అభిమానులు కొట్టారు. ఓ అభిమాని నా గుండెలపై ఎక్కి చెప్పుతో కొట్టాడు. నిజానికి ఆ వేషం వేయడం నా తప్పు కాదు, మేకర్స్ చెప్పారు నేను చేశాను. ఆ వేషం వేసినందుకు ఇప్పటికీ నేను బాధపడ్డం లేదు. బాలయ్యకు కూడా ఆ కోపం ఉన్నట్టుంది. పైగా ముఖ్యమంత్రి గారి అబ్బాయి. నాన్నను తిడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా, బాలయ్యకు కూడా వచ్చింది.”

ఇలా అప్పటి సంఘటనను గుర్తుచేసుకొని బాధపడ్డారు కోట శ్రీనివాసరావు. జీవితంలో అలాంటి చేదు జ్ఞాపకాలు తనకు చాలా ఉన్నాయని, జీవితం అంటేనే అదన్నారు. అయితే ఇంత జరిగినా ఎన్టీఆర్ మాత్రం తనను భుజం తట్టి మెచ్చుకున్నారని, బాలయ్య మాత్రం ముఖంపై ఉమ్మేశాడని చెప్పుకొచ్చారు ఈ సీనియర్ నటుడు.