పారిపోతున్న వాళ్లూ ముస్లింలే, తాలిబన్ల పాలనను ఊహించుకుని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నదీ ముస్లింలే, నోరెత్తితే తాలిబన్లు నిర్దక్షిణ్యంగా చంపేస్తారేమో అని కిక్కుమనలేని పరిస్థితుల్లో ఉన్నదీ ముస్లింలే! ఏతావాతా అఫ్గాన్ ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్న తాలిబన్లు కూడా ముస్లింలే! పాలకులు ఒక మతం వారు, బాధితులు మరో మతం వారు ఉన్న పరిస్థితులను ప్రపంచం ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు. అయితే పాలించే వారు, బాధితులు ఒకే మతం వారు కావడం, వారి మధ్యన ప్రధాన అభిప్రాయ బేధాలు మత విశ్వాసాలే కావడం అఫ్గాన్ లో జరుతున్న దారుణం!
తాలిబన్లు, అఫ్గాన్ ప్రజలు ఒకే దేవుడిని కొలుస్తారు. ఒకే సంప్రదాయాలను పాటిస్తారు. అయితే తాలిబన్లు చెబుతున్నది మధ్యయుగం నాటి ముస్లిం సంప్రదాయాలను, షరియా చట్టాన్ని పాటించాలని. అయితే రోజులు మారాయి, ప్రపంచం మారింది.. ఇంకా మధ్యయుగం నాటి పద్ధతులను పాటించడం ఎలా? అలా బతకడం ఎలా? అనేది అఫ్గాన్ ప్రజలు వేస్తున్న ప్రశ్న.
ప్రత్యేకించి గత ఇరవై సంవత్సరాల్లో అఫ్గాన్ ప్రజలు స్వేచ్ఛను రుచి చూశారు. ఆ స్వేచ్ఛ ఇక ఉండదనేదే భావనే వారిని భయకంపితులను చేస్తోంది. ప్రాణాలను పణంగా పెట్టి అయినా సరే.. తాలిబన్ల పాలన అనే నరకం నుంచి బయటపడాలని అఫ్గాన్ ప్రజలు తపిస్తున్నారు. ఈ విషయంలో వారు ఎంత సాహసానికి అయినా తెగిస్తున్నారనే అంశం గత కొన్ని రోజుల పరిణామాలు ప్రపంచానికి అర్థం అయ్యేలా చేస్తున్నాయి.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కేవలం అఫ్గాన్ ప్రజల కష్టాలనే కాదు, మతఛాందసం అనేది ఎంత ప్రమాదకరమైనది అనేది! మతం అనేది మానవ మనుగడలో ఏర్పడింది. ఆ మనుగడ ఒక్కో శతాబ్దంలో ఒక్కోలా ఉండింది. పదేళ్ల కిందటి సాఫ్ట్ వేర్లను ఇప్పుడు వాడం. పదేళ్ల కిందటి ఓఎస్ లతో తయారు చేసిన ఫోన్లను ఔట్ డేటెడ్ అంటాం. అయితే ఎప్పుడో శతాబ్దాల కిందట, నాటి కాలమానం, ప్రజలకు ఉన్న పరిస్థితుల మధ్యన చేసుకున్న మత సంప్రదాయాలను మాత్రం ఇప్పుడు కూడా పాటించాలంటే ఎలా సాధ్యం అవుతుంది. అభివృద్ధిని, ఆర్థిక శక్తిని సాధించుకున్న కొన్ని ముస్లిం దేశాలు చాంధస వాదాన్ని ఎంతో కొంత వదులుకున్నాయి. కొన్ని దేశాలు మాత్రం వదిలించుకోలేకపోతున్నాయి. అదే తేడా.
అయితే సంప్రదాయాలు, మతం కట్టుబాట్లు అనేవి.. ప్రజలను ఒక్కో దేశంలో ఒక్కో తరహాలో పరిమితుల్లో బతికేలా చేస్తుండవచ్చు. ముస్లిం ఛాందసుల విషయానికే వస్తే.. అఫ్గాన్ లో ఒక తరహా పరిస్థితులు, పాకిస్తాన్ లో మరో తరహా పరిస్తితులు, అభివృద్ధి చెందిన ముస్లిం దేశాల్లో ఇంకో తరహా పరిస్థితులు. అయితే ప్రతి చోటా ఏదో తరహా ఆంక్షలు అయితే ఉండటాన్ని గమనించవచ్చు. ఫలానాది చేయకూడదు, ఫలానాది మాత్రమే చేయాలి, ఫత్వాలు, తలనరకుతామనే హెచ్చరికలు.. వివిధ దేశాల్లోని మత వర్గాల నుంచి వింటూనే ఉంటాం. ఇంకా మధ్యయుగం నాటి పరిస్థితుల నుంచి వీళ్లు ఎప్పటికి బయటపడతారనే జాలి ప్రకటించడం తప్ప.. మరో మతం వారు వెళ్లి సంస్కరించే పరిస్థితి ఎక్కడా లేదా.
అలాగని ఏదైనా మతం పూర్తి స్థాయిలో సంస్కరించబడింది అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. అసలు మనిషి పూర్తిగా సంస్కరించబడితే మతమే ఉండదేమో! మనుషులను ఏదో రకంగా పాలించడానికే మతాన్ని కొందరు ఆయుధంగా మార్చుకున్నారు శతాబ్దాల కిందటే. వారి ఎత్తుగడలు మాత్రం ఎప్పటికప్పుడు ఏదో రకంగా పారుతున్నాయి.
ప్రజలను సెంటిమెంటల్ గా వాడుకుంటూ.. మతానికి ప్రమాదం వచ్చిందంటూ వారిని బెదరగొడుతూ పబ్బం గడుపుకునే పాలకులు అనేక దేశాల్లో ఉంటారు. అలాంటి వారు కూడా కొందరు ప్రజలు కోరుకుంటున్న మినిమం స్వేచ్ఛను ఇస్తూ ఉంటారు. మరీ మతం పేరుతో ఒత్తిడి చేస్తే ప్రజలు తిరగబడతారేమో అనే భయం ఆ పాలకుల్లో ఉంటుంది. అయితే తాలిబన్లు ఆ దశను ఎప్పుడో దాటి పోయారు.
ప్రజలు తిరగబడటం మాట అటుంచి.. ప్రజలు తాము చెప్పిన మధ్యయుగం నాటి పరిస్థితుల్లో మాత్రమే బతకాలి, లేకపోతే నిర్ధాక్షిణ్యంగా చంపుతామని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎన్నో యేళ్ల కిందటే తాలిబన్లకు అఫ్గాన్ ప్రజలు మతం పేరుతో లైసెన్స్ ఇచ్చారు, ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నా వారు ఇవ్వరు.
గమనిస్తే మిగతా ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంది ఈ ఘట్టం నుంచి! ఇంతకీ తాలిబన్ అంటే అర్థం ఏమిటో తెలుసా? విద్యార్థి అని! ప్రారంభ దశలో తాలిబన్లు విద్యార్థులే. ఆ తర్వాత రాక్షసత్వానికి వారే ప్రత్యామ్నాయంగా మారారు! వారికి ఆ అవకాశం ఇచ్చింది మాత్రం మతమే!