2024లో చంద్రబాబు పోటీ చేయరా..?

ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరట. ఎన్నికలకు ఏడాది ముందుగా ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారట. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని,…

ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయరట. ఎన్నికలకు ఏడాది ముందుగా ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారట. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని, రాష్ట్రాన్ని కష్టాల్లో నుంచి బయటపడేసేందుకే తాను జగన్ కి వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టినట్టు బిల్డప్ ఇస్తారట. 

ఎన్నికల్లో పోటీ చేయకుండా మీకోసం పాదయాత్ర చేస్తున్నానంటూ కనికట్టు చేసి టీడీపీని అధికారంలోకి తేవడమే చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది.

కుప్పం చినబాబుకే..

చంద్రబాబుకి అచ్చొచ్చిన కుప్పం నియోజకవర్గం ఇక చినబాబుకే సొంతం అని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకూ నారా లోకేష్ కి సొంత నియోజకవర్గం అంటూ ఏదీ లేదు. మంగళగిరి ప్రజలు షాకివవ్వడంతో అక్కడికి వెళ్లడమే మానుకున్నారు లోకేష్. కనీసం తాము అనుకుంటున్న రాజధాని ప్రాంతంలో అయినా బలపడాలనే ఉద్దేశం ఆయనకు లేదు. 

మరో రెండు మూడు నియోజకవర్గాల్లో సర్వే చేయించినా లోకేష్ కి నచ్చలేదు. టీడీపీ బలంగా ఉంటుందనుకున్న ప్రాంతాల్లోనూ లోకేష్ పోటీ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో అయిష్టంగానే చంద్రబాబు కుప్పంను త్యాగం చేయాల్సిన పరిస్థితి. అయితే అదేదో ప్రజల కోసం చేస్తున్న త్యాగంగా బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నారట బాబు. కుప్పంలో లోకేష్ ని పోటీ చేయించి, తాను రాష్ట్రం మొత్తం పర్యటన చేసి టీడీపీని అధికారంలోకి తేవడానికి చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ వయసులో అవసరమా..?

2019 ఎన్నికల ముందు కూడా చంద్రబాబు రాష్ట్ర పర్యటన ప్లాన్ చేసుకున్నా.. వయసు, ఆరోగ్య రీత్యా ఆయన బయటకు రాలేకపోయారు. మరోవైపు టీడీపీ గెలుపుపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఆయన్ను బయటకు రానీయలేదు. కానీ గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ బాల్చీ తన్నేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల ముందు పాదయాత్ర కానీ, సైకిల్ యాత్ర కానీ లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

పోనీ లోకేష్ ని పంపిస్తే, లాభం కంటే నష్టమే ఎక్కువ. అందుకే చంద్రబాబు తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నారట. కొడుకు భవిష్యత్ కోసం తాను ఏమైపోయినా పర్లేదని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు, ముఖ్యనేతలతో ఈ అంశాన్ని చర్చించారని, వారు వారించారని కూడా కథనాలు వెలువడుతున్నాయి.

మొత్తమ్మీద.. లోకేష్ కోసం కుప్పం నియోజకవర్గాన్ని త్యాగం చేసి, రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారట చంద్రబాబు. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.