ఏ పార్టీ అయినా అధికారంలో లేని సమయంలో దానికి ఉండాల్సిన విశ్వాసం నాయకత్వం మీద. పార్టీ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు… ఆ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో విశ్వాసాన్ని కలిగించాల్సింది కేవలం ఆ పార్టీ నాయకుడు మాత్రమే! ఈ విషయాన్ని ఏ అభినవ చాణక్యుడో చెప్పనక్కర్లేదు, ఈ మాత్రం చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ అక్కర్లేదు… టీ కొట్టు జనాలు కూడా ఈ విషయాన్ని విపులంగా విశదీకరిస్తారు.
మరి ఇలాంటి అత్యంత ప్రాథమిక, కీలకమైన అంశంలోనే ఇప్పుడు ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కార్నర్ అవుతోంది! అటు ప్రజల్లోనే కాదు, ఇటు పార్టీలో కూడా అధినాయకత్వం ఆదరణ కోల్పోతోంది! చంద్రబాబుకు వయసు మళ్లింది, బయట ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. చంద్రబాబు నాయుడి పొలిటికల్ కెరీర్ కూడా ముగిసినట్టే. కరోనా వంటి పరిస్థితులూ, వయసు.. ఈ రెండూ చంద్రబాబుకు ఇక తన రాజకీయ భవిష్యత్తుకు సహకారం అందించకపోవచ్చు. అలాగే చంద్రబాబు మార్కు రాజకీయాలకు కూడా ఈ తరం ఆదరణ అందదని స్పష్టం అవుతోంది.
సొంతంగా ఏనాడూ గెలిచిన చరిత్ర లేని చంద్రబాబును మరోసారి గద్దెనెక్కించడానికి వచ్చే ఎన్నికలనాటికి ఎవ్వరూ తోడయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఏదో అనుకూల మీడియా ఉంది కాబట్టి.. ఇంకా చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తూ ఉంది కానీ, లేకపోతే ఏ ములాయం సింగ్ యాదవ్ లాగానో చంద్రబాబు నాయుడు కూడా తెరమరుగు అయ్యే పరిస్థితే ఉండేది. అయితే ములాయంకు అయినా ఆయన తనయుడు పార్టీని ఉనికిలో నిలుపుతున్నాడు. కానీ గతంలో అఖిలేష్ లాగానే లోకేష్ అనే నినాదంతో వార్తలకు ఎక్కిన లోకేష్ మాత్రం .. ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చి పదేళ్లు అవుతున్నా, ఇంకా ఏబీసీడీలు దిద్దుకోలేదు.
ఇన్నేళ్లలో లోకేష్ ప్రతిభను చూసి తరించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఆయనతో కష్టమే అనే అభిప్రాయానికి వచ్చేసింది. ఏతావాతా.. టీడీపీకి ఇప్పుడు ఉన్న సమస్యలలో కెళ్లా అతి పెద్ద సమస్య నారా లోకేష్ బాబే అనే స్పష్టత వస్తోంది.
ఆది నుంచి హంసపాదే!
చంద్రబాబు తనయుడు అనే అర్హత లోకేష్ ను రాజకీయాల వైపుకు తీసుకు వచ్చింది. అయితే దశాబ్దకాలం గడిచిపోయినా.. ఇంకా లోకేష్ ఉన్న అర్హత చంద్రబాబు తనయుడు అనేది మాత్రమే! ఈ పదేళ్లలో లోకేష్ తనకంటూ సాధించుకున్న ఉనికి, హోదా ఏమీ లేదనేది నగ్నసత్యం. చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు. చంద్రబాబు తనయుడిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. చంద్రబాబు తనయుడిగా మంత్రి పదవిని తీసుకున్నాడు.
చంద్రబాబు తనయుడిగా ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. చంద్రబాబు తనయుడిగానే ఎన్నికల్లో పోటీ చేసి, చంద్రబాబు తనయుడిగానే ఆ ఎన్నికల్లో ఓటమిని మిగుల్చుకున్నాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు తనయుడిగానే టీడీపీ అధికారిక పదవులు, పార్టీపై అజమాయిషీ కలిగి ఉన్నాడు చంద్రబాబు నాయుడు తనయుడు! ఇక కనీసం వ్యక్తిగత ఛరిష్మా లేకపోవడం లోకేష్ కు ఉన్న పెద్ద శాపం లాగుంది. నోరు విప్పితే ఆయనేం మాట్లాడతారనేది.. బ్రహ్మదేవుడికి కూడా అంతుబట్టే అంశం కాదు.
సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఉరేసుకున్నట్టే అని తను బహిరంగంగా చేసిన వ్యాఖ్యతో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నారు లోకేష్. ఆ తర్వాత కులపిచ్చి, మతపిచ్చి, బంధుప్రీతీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అని సెలవిచ్చి.. కితకితలు పెట్టిన లోకేష్ ప్రస్థానం కామెడీగా మారిపోయింది. ఆ కామెడీ.. ఎప్పటికప్పుడు కొనసాగుతోంతే తప్ప.. లోకేష్ ఇంకా సీరియస్ మ్యాటర్ గా మారడం లేదు! నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్ అంటూ లోకేష్ విషయంలో ఇప్పటి వరకూ ఎవ్వరూ చెప్పడం లేదు.
మంత్రి కావడమే పెద్ద మైనస్!
ఇప్పటి వరకూ లోకేష్ కెరీర్ సాగిన వైనాన్ని గమనిస్తే, ఎవరు ఐడియానో కానీ, ఆయన ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే అతి పెద్ద మైనస్ గా మారినట్టుగా ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అయ్యారనే అపఖ్యాతి వచ్చింది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి లోకేష్ చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయి ఉంటే.. ఆ అపవాదు ఏర్పడేది కాదు. అయితే తనను తాను అప్పట్లో కేటీఆర్ తో పోల్చుకున్నారో ఏమో కానీ.. లోకేష్ మంత్రి పదవిని తీసుకున్నారు.
ఏ ప్రముఖ రాజకీయ నేతా ఎంట్రీ ఇవ్వని రీతిలో నామినేటెడ్ పదవి ద్వారా మంత్రి పదవిని నిలబెట్టుకున్నారు! అది గొప్ప అని లోకేష్ అనుకుని ఉండవచ్చు గాక, ఆ స్టెప్పే లోకేష్ ను ప్రజల్లో పలుచన చేసినట్టుగా ఉంది. మంత్రి పదవిని తీసుకోకుండా.. పార్టీ బాధ్యతలను నిర్వర్తించి, డైరెక్టుగా ఎన్నికల్లో బరిలోకి దిగి ఉంటే.. లోకేష్ గురించి ఇంకా ఏవో అంచనాలు అయినా ఎన్నికల సమయానికి మిగిలి ఉండేవి. అయితే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. చంద్రబాబు తనయుడిగా మంత్రి పదవిని తీసుకున్నారు, పార్టీ చేతిలోని అధికారం పోగానే మంత్రి పదవి పోయింది, చంద్రబాబు తనయుడు అనే ట్యాగ్ మాత్రమే మిగిలి ఉంది!
ఇప్పటికీ ఒక నియోజకవర్గం లేదు!
గత రెండేళ్లలో చంద్రబాబు నాయుడి తనయుడు ప్రజల మధ్యకు వచ్చిన సందర్భాలు కేవలం వేళ్ల మీద లెక్కబెట్ట తగినవి. ఆయా సందర్భాల్లో లోకేష్ చేసిన అపరిపక్వ వ్యాఖ్యలు మాత్రం బండెడు ఉంటాయి. రాయలసీమలో రక్తం పారుతోంది అంటూ ఈ మధ్యనే లోకేష్ చేసిన ప్రసంగం.. వింటే, ఎవరి చెవుల్లో లోకేష్ పువ్వులు పెట్టేందుకు ప్రయత్నిస్తాడనే సందేహం వస్తుంది. వ్యక్తిగత కక్షలతో జరిగిన రెండు హత్యలకు లోకేష్ ఇచ్చిన రియాక్షన్, అరేయ్.. తురేయ్.. అంటూ చేసిన ప్రసంగం ఆయన కామెడీకి పరాకాష్ట.
తెలుగుదేశం హయాంలో.. పరిటాల హయాంలో.. జరిగిన హత్యలు, చంద్రబాబు హయాంలో.. రాయలసీమ లో పారిన నెత్తురు.. వీటన్నింటినీ గుర్తు చేసేంత స్థాయిలో సాగింది లోకేష్ ప్రసంగం. 2014-19ల మధ్యన కూడా తెలుగుదేశం పార్టీ కత్తికి నెత్తురు దాహం తీరలేదు. ప్రభుత్వ కార్యాలయంలోనే దర్జాగా ఆ కత్తులకు పని చెప్పారు పచ్చ చొక్కాలు. లోకేష్ ఒకటి మాట్లాడితే.. ప్రత్యర్థులకు పది కౌంటర్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా సాగుతూ ఉంది లోకేష్ పొలిటికల్ ప్రస్థానం.
ఇక ఇప్పటి వరకూ లోకేష్ కు అంటూ చెప్పుకోవడానికి ఒక నియోజకవర్గం లేకుండా పోయింది. గత ఎన్నికల సమయంలో ఎన్నో అధ్యయనాలు చేసి, మరెంతగానో కాచి వడపోసి.. మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సామాజికవర్గ సమీకరణాలు, అమరావతి ఇమేజ్.. ఇవన్నీ కలిసి అయినా లోకేష్ ను ఎమ్మెల్యేను చేస్తాయనే లెక్కలేశారు. అయితే.. వాటిల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు తనయుడిని ఎమ్మెల్యేగా చేయలేకపోయాయి.
తొట్టతొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి.. ఓటమి పాలైన ముఖ్యమంత్రి తనయుడిగా లోకేష్ కొత్త రికార్డును స్థాపించారు. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చే వారు తమ ఎంట్రీతోనే భారీ మెజారిటీలను నమోదు చేయడాన్ని చూశారంతా. లేకపోతే వారికి మనుగడ కూడా ఉండదు. రాజకీయ వారసత్వాలను ప్రజలు మెచ్చుకునే పరిస్థితి లేదిప్పుడు. ఎవరైనా రాజకీయ వారసులు ఎంట్రీ ఇచ్చారంటేనే.. మొదటి దెబ్బలోనే రికార్డులు సృష్టించాలి.
తమకు ప్రజల ఆదరణ ఉందని దేశానికి అర్థమయ్యేలా చాటుకోవాలి. అలాంటిది దేశానికి ప్రధానులను, రాష్ట్రపతులను తనే నియమించినట్టుగా చెప్పే చంద్రబాబు నాయుడు సొంత కుమారుడు మాత్రం కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. అంతే కాదు.. ఇప్పటి వరకూ లోకేష్ కోసం ఒక నియోజకవర్గాన్ని మళ్లీ రిజర్వ్ చేయలేకపోయింది టీడీపీ. కనీసం వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గాలన్నా.. ఈ పాటికే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సింది.
అక్కడ మకాం పెట్టి క్షేత్ర స్థాయిలో కనిపిస్తూ, ప్రజలకు చేరవయితే కానీ.. వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్ దాఖలు సాధ్యం కాదు. అలాంటిది లోకేష్ వ్యవహారం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తుంది. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసి తనను తాను పట్టు వదలని విక్రమార్కుడు అనిపించుకోవడానికి కానీ, లేదా మరో నియోజకవర్గాన్ని ఎంచుకుని.. సొంత పొలిటికల్ కెరీర్ కు పునాదులు వేసుకునే ప్రయత్నం కానీ లోకేష్ ఇప్పటి వరకూ చేసుకుంటున్నట్టుగా కనిపించదు! ఒకసారి ఎన్నికల్లో చిత్తు అయినా.. లోకేష్ ఇంకా అతి విశ్వాసంతోనే ఉన్నారో, లేక ఏ నియోజకవర్గాన్ని టచ్ చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నారో బయటి వాళ్లకు ఇంకా తెలియదు. ఈ రెండు విధాల్లో ఎలా ఉన్నా.. లోకేష్ పొలిటికల్ కెరీర్ ఇంకా డోలాయమానంగా ఉన్నట్టే.
వేరే వాళ్లైతే ఈ పాటికే చాప్టర్ క్లోజ్!
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల వైపు వచ్చే వారితో పోలిస్తే రాజకీయ వారసుల రాజకీయం డిఫరెంట్. పొలిటికల్ పార్టీ లీడర్ల తనయులకు లిఫ్ట్ ఈజీగా దొరుకుతుంది. అదే సమయంలో.. వారి వ్యవహారంలో ఏదైనా తేడా ఉందంటే.. వారి కెరీర్ లు అంతే త్వరగా దెబ్బతింటాయి. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుల్లో ఒకరి కథ అలాగే ఉంది. తేజస్వి పోరాడుతున్నాడు కానీ.. ఇంకో కొడుకు వేషాలు వేసుకుంటూ నవ్వులపాలయ్యాడు. ఇక రామ్ విలాస్ పాశ్వాన్ కనుమూయగానే ఆయన తనయుడు చిరాగ్ పాశ్వాన్ ను అడ్రస్ లేకుండా చేశారు సొంత పార్టీ వాళ్లు, బంధువులు.
ఎంత ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ.. ఉద్ధండపిండాలైన తండ్రులు ఉన్నంత వరకే వారి తనయులకు అంతో ఇంతో విలువ అని వివిధ ఉదాహరణలతో స్పష్టం అవుతోంది. టీడీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు రెక్కలు ముక్కలు చేసుకుంటుంటేనే లోకేష్ ఈ మాత్రమైన కనిపిస్తున్నారు. కనీసం సొంత సామాజికవర్గం మధ్యన, పార్టీ నేతల మధ్యన చంద్రబాబు చక్రం తిరిగినంత సేపే లోకేష్ తెర మీద ఉంటారనేది కూడా ఇప్పుడు స్పష్టత వస్తున్న అంశం.
లోకేష్ కోసం పచ్చమీడియా ఎంతగానో ఆరాట పడుతూ ఉంది. లోకేష్ తన తీరుతో ఎంత కామెడీ అయిపోతున్నా.. ఆయననో సీరియస్ మ్యాటర్ గా చూపించడానికి అలుపెరగని ప్రయత్నాలు సాగుతున్నాయి టీడీపీ అనుకూల మీడియా నుంచి. ఆది నుంచి ఇదే జరుగుతూ ఉంది కానీ, లోకేష్ వారి కష్టానికి కూడా ప్రయోజనంగా మారడం లేదు. ఆఖరికి రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు కూడా ఇంకా లోకేష్ విషయంలో ఆందోళనే ఉంది.
ఏం చేస్తే లోకేష్ ఒక నాయకుడు అవుతాడనే తపన చంద్రబాబు అభిమాన బృందాల్లో అనునిత్య చర్చగా, వారిని మనసును తొలిచివేసే అంశంగా మారినట్టుగా ఉంది. వాళ్లంతా ఎన్నో ప్రణాళికలు రూపొందించి, లోకేష్ ను పట్టాలెక్కించేందుకు అలుపెరగకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినా.. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా, వారందరి కష్టం కూడా
లోకేష్ విషయంలో బూడిదలో పోసినట్టుగా మారుతోంది. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేశాకా.. చంద్రబాబును ఒక గొప్ప నేతగా, విజనరీగా ప్రొజెక్ట్ చేయడంలో విజయవంతం అయిన మీడియా వర్గాలు..లోకేష్ విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్నది ఎన్టీఆర్ ను అయితే ముఖ్యమంత్రి సీట్లో తను కూర్చున్న చంద్రబాబునే మరోసారి ప్రజల చేత ఆమోదింపజేసేంత స్థాయిలో అనుకూల ప్రచారాన్ని సాగించిన మీడియా వర్గాలు అష్టకష్టాలు పడి కూడా లోకేష్ ను కనీసం ఎమ్మెల్యేగా గెలిపించలేకపోయాయి.
మరొకరికి ఎవరైనా ఈ మాత్రం మీడియా ప్రొజెక్షన్ ఉండి, అంత ప్యాడింగ్ ఉంటే.. వారు రాకెట్ల దూసుకుపోయే వారేమో! అయితే లోకేష్ పరిస్థితి మాత్రం అన్నీ ఉన్నా.. అన్నట్టుగా.. ఒక డైలీ సీరియల్ లా కొనసాగుతూ ఉంది. ఇన్ని మాటలూ చెప్పాకా, ఇంకో మాటలో చెప్పాలంటే.. మరో పార్టీలోనో, మరో రాష్ట్రంలోనో ఇంకో నేత తనయుడి వ్యవహారాలు ఈ రీతిన కొనసాగి ఉంటే.. వారి పొలిటికల్ చాప్టర్ ఎప్పుడో ముగిసిపోయేది.
కేవలం చంద్రబాబుకు ఉన్న మీడియా బ్యాకప్ ద్వారా మాత్రమే.. ఇంకా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతున్నారు. జనాలు లోకేష్ ను తిరస్కరించేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా అనర్హుడువి అన్నారు. అయితే.. జనాలు లోకేష్ నుంచి తేలికగా తప్పించుకున్నారు కానీ, తెలుగుదేశం పార్టీకి మాత్రం అది సాధ్యం అవుతున్నట్టుగా లేదు.
ఎక్కడ లోపం ఉందో కనుక్కోలేకపోతున్నారా?
అధికారంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్లు లోకేష్ ను కొంతైనా తీర్చిదిద్దేందుకు కొంత ప్రయత్నాలు చేశారంటారు. అప్పట్లో మండలి బుద్ధప్రసాద్ లాంటి వాళ్లు లోకేష్ కు తెలుగు మీద కొంచెం జ్ఞానం కలిగించడానికి ప్రయత్నించారట. ప్రత్యేకంగా ట్యూషన్లు గట్రా చెప్పించి, యండమూరి వంటి వాళ్లతో పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు కూడా వేయించారనే టాక్ ఒకటి బయటకు వచ్చింది.
మరి అపర మేధావులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు లాంటి వారి బోధలు కూడా లోకేష్ ను తీర్చిదిద్దలేకపోయాయా? అనేదే శేష ప్రశ్న. మరో విశేషం ఏమిటంటే.. చంద్రబాబును గొప్ప నాయకుడిగా అభివర్ణించే కమ్మ సామాజికవర్గం యువతరం కూడా లోకేష్ ను ఎందుకో ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేయదు! చంద్రబాబు రాజకీయంగా, పాలనపరంగా చేసిన తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించే కమ్మ కుర్రాళ్లు లోకేష్ ప్రస్తావన వస్తే మాత్రం నవ్వేస్తారు! అలా టీడీపీ వీరాభిమానవర్గాలు కూడా లోకేష్ ను గట్టిగా సమర్థించే పరిస్థితి లేదింకా!
బహుశా వారి చూపు జూనియర్ ఎన్టీఆర్ మీద ఉండటం కూడా దీనికి ఒక కారణం కావొచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా? రాజకీయాల కోసం సినిమా కెరీర్ ను పణంగా పెడతాడా? అనేది వేరే చర్చ. అయితే లోకేష్ మాత్రం తెలుగుదేశం వీరాభిమానవర్గాల్లో కూడా విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాడని వాళ్లతో మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది.
ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం!
లోకేషా, జూనియర్ ఎన్టీఆరా.. అనే క్రాస్ రోడ్స్ టీడీపీకి ఎంతో దూరంలో లేవు! ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లు స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నారు. జూనియర్ కు పార్టీలో తావులేదనే స్పష్టమైన సంకేతాలను వారు ఇస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి, పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొంత భాగాన్నిన అయినా స్వీకరించాలంటూ నోరు తెరిచే వాళ్లను పార్టీ నుంచి బయటకు పంపుతామనే సంకేతాలను కూడా స్పష్టంగా ఇస్తున్నారు.
ఈ రకంగా అయితే చంద్రబాబు, లోకేష్ లు తేల్చేశారు. పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కాదు, లోకేషే దిక్కు అనే క్లారిటీ అటు వైపు నుంచి వస్తోంది. ఈ అంశంపై బాలకృష్ణ కూడా ఇటీవలి టీవీ ఇంటర్వ్యూలో తన ఓటు అల్లుడికే అని స్పష్టం చేసినంత పని చేశారు! తద్వారా తెలుగుదేశం భవిష్యత్తు లోకేష్ తోనే ముడిపడి ఉందని స్పష్టం అవుతోంది.
అయితే.. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మాత్రం జూనియర్ ను విస్మరించడం లేదు. గతంలో అవసరానికి ఒకసారి తారక్ ను ప్రచారానికి వాడుకోవడం, ఆ తర్వాత సైడ్ చేసేయడం, ఇప్పుడు లోకేష్ ఫెయిల్యూర్ స్టోరీ.. ఇదంతా వారికి తారక్ అయితే బెటరేమో అనే అభిప్రాయాన్ని కలిగించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. తారక్ ను ఇప్పుడు చంద్రబాబు పిలిస్తే.. గతంలో లాగా అతడు ప్రచారం చేసి వెళ్లిపోయేలాగా ఉండదు వ్యవహారం. చంద్రబాబు తీరును బాగా అర్థం చేసుకున్న నందమూరి కుటుంబీకుడు ఎవరైనా ఉంటే అది బహుశా జూనియర్ ఎన్టీఆరే అయ్యుండొచ్చనే కామెంట్లు వినిపిస్తుంటాయి.
ఇలాంటి నేపథ్యంలో లోకేష్ కోసం జాకీలు వేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగకపోవచ్చు. మీడియా ఉంది, తను ఇంకా యాక్టివ్ గా ఉన్నట్టే కాబట్టి.. చంద్రబాబు నాయుడు తన తనయుడే టీడీపీ భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చే ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మరో వాదనను వినరని కూడా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో వచ్చే రెండున్నరేళ్లలో టీడీపీ శ్రేణులు ఇంకా ఎలా స్పందిస్తాయనేదే ఆసక్తిదాయకమైన అంశం.
ఇప్పటికే సవాలక్ష రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న టీడీపీకి అధినేత తనయుడే అతి పెద్ద సమస్యగా మారిన తరుణంలో.. పచ్చ పార్టీ పాలిటిక్స్ ఇంకెలా సాగనున్నాయో!
-జీవన్ రెడ్డి.బి