అరవై ఆరేళ్ల సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ల తరువాత వయసు మీద పడిన తరువాత కూడా హీరోగా కొనసాగుతూ, క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా కొనసాగించుకోగలుగుతున్న స్టార్. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి.
ఆచార్య పూర్తయిపోయినట్లే. గాడ్ ఫాదర్ స్టార్ట్ అయింది. భోళాశంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాలు స్టార్ట్ కావాల్సి వుంది. అయితే వీటి తరువాత సంగతి ఏమిటి? అన్నది పాయింట్.
తనకు 70 ఏళ్లు వచ్చే వరకు సినిమాలు చేయాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఏడు పదుల వయస్సు పూర్తయ్యేలోగా ఇప్పుడు చేతిలో వున్నవాటితో కలిసి కనీసం 20 సినిమాలు చేయాలని అనుకుంటున్నారట.
ఈ విషయమే తనను కథలు చెప్పే డైరక్టర్లకు మెగాస్టార్ చెబుతున్నారట. లైన్లు ఓకె చేసి కథలు రెడీ చేయమంటున్నారట. చిన్న చిన్న స్పూఫ్ సినిమాలు చేసిన ఓ డైరక్టర్ కు కూడా మంచి కథ తెస్తే చేసేద్దాం అని మాట ఇచ్చేసినట్లు బోగట్టా.
ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు 2022 మే నాటికి పూర్తి చేసేయాలన్నది సంకల్పం అంట. నిజానికి ఈ ఫీట్ యంగ్ హీరోల వల్లే కాదు. ఏడాదికి ఒకటి చేయడం కష్టంగా వుంది. అలాంటింది ఏడాది లోపు నాలుగు సినిమాలు అందించడం, ఆ తరువాత కూడా ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేయడం అంటే సాధ్యమేనా? అన్నది అనుమానం.
సరే, ఆయన చకచకా సినిమాలు ఓకె చేయచ్చు. ఫినిష్ చేయచ్చు. కానీ విడుదల ఎలా? కనీసం ఆరేడు నెలలు గ్యాప్ వుండాలి కదా? మరి ఆయన ప్లాన్ ఏమిటో?