ఈఎస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయగానే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దివాళాకోరు రాజకీయాలకు తెరలేపారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయగానే బలహీన వర్గాలపై ఎక్కడా లేని ప్రేమ బాబులో పుట్టుకొచ్చింది. అచ్చెన్నాయుడి అరెస్ట్ నేపథ్యంలో బాబు ఏమన్నారో చూద్దాం.
‘ అచ్చెన్నాయుడి కిడ్నాప్ బహీనవర్గాలపై దాడి. అసెంబ్లీకి మరో 4 రోజు ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్ జగన్ కుట్రే. రాష్ట్రవ్యాప్తంగా బడుగు బహీనవర్గాలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగు బహీనవర్గాలు ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేసి జోతిరావుఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనను తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పాలనలో జరిగిన ఓ అమానవీయ ఘటనను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంగా తమకిచ్చిన హామీ మేరకు ఆలయాల్లో పనిచేస్తున్న తమకు కమీషన్‌ను పెంచాలని సచివాలయం దగ్గర నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును నాయీ బ్రాహ్మణులు కోరారు. హామీని అమలు చేయాలని అడగడమే నేరమైంది. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన చంద్రబాబు…తనతో పెట్టుకుంటే తోకలు కత్తెరిస్తానంటూ నాయీ బ్రాహ్మణులు మనోభావాలనే దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరించారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ వీధి రౌడీలా నాయీ బ్రాహ్మణుల మీదికి కొట్టేందుకు దూసుకెళ్లడం…నేటికీ నాయీ బ్రాహ్మణులు మరిచిపోలేకున్నారు. నాడు ఒక్క బీసీలనే కాదు, బడుగు బలహీన వర్గాలను అవమానించే రీతిలో బాబు వ్యవహరించారు. అలాంటి పెద్ద మనిషి నేడు అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు కులం రంగు పులమడం బాబుకే చెల్లింది.
నాయీ బ్రాహ్మణులను స్వయంగా తిట్టిన నాయకుడు…నేడు బడుగు బలహీన వర్గాలంటూ మొసలి కన్నీరు కార్చడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నాడు నడిరోడ్డుపై నాయీ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తానన్నప్పుడు తాము గుర్తు రాలేదా అని బీసీలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు