రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి బలంగా వీచిన సందర్భంలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు సీట్లు టీడీపీ వశమయ్యాయి. వాటిలో ఒకటి చీరాల నియోజకవర్గం. చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు, ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీకి చెందినవారే. అయితే ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఏడాదిలోపే పోతుల సునీత దంపతులు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. కరణం బలరాం తన కుమారుడ్ని వైసీపీలోకి పంపించి.. తాను కూడా అనధికారికంగా జగన్ తోనే అంటూ సంకేతాలు పంపారు.
అంటే అపోజిషన్ అంతా అధికార పార్టీలోకి వచ్చేసింది. అయితే చీరాలలో వైసీపీకి ప్రతిపక్షమే లేదు కానీ స్వపక్షంలోనే విపక్షం తయారైంది. నియోజకవర్గ ఇంచార్చి ఆమంచి కృష్ణమోహన్ కి ఎమ్మెల్యే కరణం బలరాం అంటే పడదు, కరణం బలరాంకి ఎమ్మెల్సీ పోతుల సునీత అంటే పడదు. సునీతకీ ఆమంచికీ చాలాకాలం నుంచీ వైరం ఉంది. ఇలా ముగ్గురిలో ఏ ఒక్కరికి ఇంకొకరితో పొసగదు.
సునీత పార్టీలో చేరినప్పుడు, బలరాం కొడుకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పుడు కూడా ఆమంచి ఆ సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన చీరాలలో వీరెవ్వరినీ పిలవకుండా సొంతంగా పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. వైసీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, కార్యకర్తలంతా తనవెంటే ఉన్నారంటూ.. పరోక్షంగా బలరాం, సునీత వర్గాలను రెచ్చగొట్టారు.
ఇలా ఒకరినొకరు కవ్వించుకుంటూ, రెచ్చగొట్టుకుంటూ.. చివరకు పార్టీ క్యాడర్ ని మూడుగా చీల్చేశారు. ముగ్గురూ కలిసి ఉంటే.. ఎవరితోనైనా పోరాడటం సులువు. ఇలా అధికార వర్గంలోనే మూడు వర్గాలుంటే ఇక ప్రభుత్వ సిబ్బంది ఎవరిమాట వింటారు, ఎవరి సలహాలు పాటిస్తారు? ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ముగ్గురి నాయకుల మధ్య నలిగిపోతున్నారు.
రాజకీయ పంచాయితీతో పాటు.. అధికారుల ఇబ్బందులు కూడా సీఎం వద్దకు చేరాయి. జిల్లా మంత్రి బాలినేని సమక్షంలో మూడు వర్గాలతో సీఎం జగన్ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముగ్గురికీ సర్దిచెబుతారో లేక.. ముగ్గురిలో ఒకరికే నియోజకవర్గ బాధ్యతలు అప్పజెబుతారో తేలాల్సి ఉంది.