రూ.5 ల‌క్ష‌లు ఏ మూల‌కు…రూ.కోటి కావాలి!

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ ఇచ్చిన రివార్డు ప్ర‌క‌ట‌న స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది. నిందితుల ఆచూకీకి సంబంధించి కచ్చిత‌మైన స‌మాచారం ఇచ్చిన వారికి రూ.5 ల‌క్ష‌ల రివార్డు ఇస్తామ‌ని సీబీఐ…

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ ఇచ్చిన రివార్డు ప్ర‌క‌ట‌న స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది. నిందితుల ఆచూకీకి సంబంధించి కచ్చిత‌మైన స‌మాచారం ఇచ్చిన వారికి రూ.5 ల‌క్ష‌ల రివార్డు ఇస్తామ‌ని సీబీఐ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే రూ.5 ల‌క్ష‌లు చిన్న మొత్త‌మ‌ని, భారీ మొత్తం కావాల‌ని డిమాండ్లు మొద‌ల‌య్యాయి. సీబీఐ రివార్డు ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌కు ఓ ఆయుధం ఇచ్చిన‌ట్టైంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సంబంధించి ప్ర‌తిదీ వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు… దీనిపై కూడా రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేశారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సీబీఐ ప్ర‌క‌టించిన రూ.5 ల‌క్ష‌ల రివార్డు ఏ మూల‌కు స‌రిపోతుంద‌ని ప్ర‌శ్నించారు. 

స‌మాచారం ఇచ్చిన వారికి త‌ప్ప‌కుండా ప్రాణ‌భ‌యం ఉంటుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాస్‌రెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని తెలిపారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని ఆయ‌న గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం.

వివేకా హ‌త్య విష‌య‌మై సమాచారం అందించేవారికి రూ.కోటి రివార్డు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. హత్య కేసు మిస్ట‌రీని త్వ‌ర‌గా ఛేదించే క్ర‌మంలోనే సీబీఐ రివార్డు ప్రకటించి ఉంటుందని భావిస్తున్నట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇదే ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే మాత్రం వెంటనే పట్టుకుంటున్నారని ర‌ఘురామ ఆరోపించారు.