మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత చిన్నకుమారుడికి బుల్లెట్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ పరిణామాలను టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. కానీ ఈ ఉదంతంపై టీడీపీ గప్‌చుప్ అన్నట్టు నోరు మెదపక పోవడం గమనార్హం. రెండురోజుల క్రితం హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌తో టీడీపీ యువనేత పరిటాల సిద్ధార్థ్ పట్టుబడ్డారు. ఇది కలకలం రేపింది.
సిద్ధార్థ్ లైసెన్స్డ్ గన్‌కు, బ్యాగులో దొరికిన బుల్లెట్‌కు తేడా ఉండడంతో సమస్య తలెత్తింది. గతంలో పాయింట్ 32 క్యాలిబర్ గన్‌కు సిద్ధార్థ్ లైసెన్స్ పొందారు. అయితే సిద్ధార్థ బ్యాగులో 5.56 క్యాలిబర్ బుల్లెట్ పోలీసులకు దొరికింది. సిద్ధార్థ్ వద్ద సాయుధ బలగాలు వాడే ఇన్సాస్ రైఫిల్ బుల్లెట్ ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వివరణ ఇవ్వాలని సిద్ధార్థ్‌కు నోటీసు ఇచ్చారు.
పరిటాల సిద్ధార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో సిద్ధార్థను పోలీసులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్‌తో పరిటాల సిద్ధార్థ్ పట్టుబడ్డారు. సిద్ధార్థ్‌పై కేసు నమోదు చేసి వివరణ ఇవ్వాలని ఎయిర్పోర్ట్ పోలీసులు నోటీసులిచ్చారు. సిద్ధార్థ లైసెన్స్డ్ గన్‌కు బ్యాగులో దొరికిన బుల్లెట్‌కు వ్యత్యాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
బ్యాగులో బుల్లెట్ ఉందని, దానికి అవసరమైన పత్రాలు లేవనే సంగతి తనకు తెలియదని సిద్ధార్థ చెప్పారు. అనంతపురానికి చెందిన ఇండో టిబెటెన్ బోర్డర్లో పని చేస్తున్న కానిస్టేబుల్ తూటాగా విమానాశ్రయ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తూటా పరిటాల సిద్ధార్థ్ దగ్గరికి ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తూటా కలిగిన వ్యక్తి ఎలా వచ్చిందో తెలియదనే సమాధానంతో విమానాశ్రయ పోలీసులు సంతృప్తి చెందలేదని సమాచారం. అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై టీడీపీ నేతలెవరూ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో పరిటాల సిద్ధార్థ్ పెద్ద ప్రమాదంలో పడ్డారనే చర్చకు అవకాశం ఇచ్చినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.