ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా వంటలు చేయడానికి, ఫిట్ నెస్ కాపాడుకోవడానికి, వెబ్ సిరీస్ లు చూడడానికి సమయం కేటాయిస్తే.. రాధికా ఆప్టే మాత్రం స్టోరీస్ రాయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుంది. అందర్లానే ఈ హాట్ బ్యూటీ కూడా ఇంట్లో వంటలు చేసినప్పటికీ.. కథలు రాయడానిక్కూడా ప్రాధాన్యం ఇచ్చింది.
“ప్రస్తుతానికైతే దీని గురించి ఎక్కువ మాట్లాడ్డం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రైటింగ్ అనేది ఎటు వైపు వెళ్తుందో నాక్కూడా తెలియదు. ప్రస్తుతం నేను రాస్తున్నది నాకు బాగా నచ్చితే, బహుశా నేనే డైరక్ట్ చేసి ఓ సినిమా తీస్తానేమో.”
ఇలా తను కథలు రాస్తున్న విషయాన్ని బయటపెట్టింది ఈ బ్యూటీ. లాక్ డౌన్ ప్రారంభమయ్యే సమయానికి భర్త బెనెడిక్ట్ టేలర్ తో కలిసి లండన్ వెళ్లింది రాధికా ఆప్టే. ఆ టైమ్ కు బ్రిటన్, తన సరిహద్దులు మూసేసినప్పటికీ, లాక్ డౌన్ పరిస్థితులు చూసి తనకు భయం కలగలేదంటోంది.
“ఇక్కడ (లండన్) రూల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. బయటకు వెళ్లడానికి, ఫ్రెండ్స్ ను కలవడానికి మాకు అనుమతిచ్చారు. కిరాణా షాపులు కూడా తెరిచారు. సాధారణ జీవితం కంటే భిన్నంగా ఏమీ లేదు. లాక్ డౌన్ టైమ్ లో ఇక్కడ ఉండడం ఆనందంగా ఉంది.”
పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసే అవసరం రాలేదని.. తనకు పుస్తకాలు చదివే అలవాటున్నప్పటికీ లాక్ డౌన్ టైమ్ లో పుస్తకాలు తెరవలేదని.. స్టోరీస్ రైటింగ్ పై ఎక్కువ దృష్టిపెట్టానని చెబుతోంది రాధిక ఆప్టే.
కథలు రాయడంతో పాటు ఈ లాక్ డౌన్ టైమ్ లో వర్కవుట్స్, సైక్లింగ్, వాకింగ్ చేసింది రాధిక. మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన బేకింగ్ కూడా చేసింది. ఈసారి మరిన్ని కొత్త వంటకాలు ట్రై చేశానంటోంది ఈ హీరోయిన్.