టాలీవుడ్ బాక్సాఫీస్: ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్

కరోనా తర్వాత ఓటీటీ పవర్ పెరిగినా, ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకునే సరికి సినిమావాళ్లు కాస్త రిలాక్స్ అయ్యారు. థియేటర్లే మేలు, ఓటీటీలు అవసరం లేదని తీర్మానించేసుకున్నారు. కానీ సెకండ్ వేవ్ దెబ్బ…

కరోనా తర్వాత ఓటీటీ పవర్ పెరిగినా, ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకునే సరికి సినిమావాళ్లు కాస్త రిలాక్స్ అయ్యారు. థియేటర్లే మేలు, ఓటీటీలు అవసరం లేదని తీర్మానించేసుకున్నారు. కానీ సెకండ్ వేవ్ దెబ్బ ఓ రేంజ్ లో పడింది. కనీసం ఫస్ట్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలు థియేటర్లోకి వచ్చి కాస్తో కూస్తో కలెక్షన్లు కళ్లజూశాయి కానీ, సెకండ్ వేవ్ తర్వాత మాత్రం ఇంకా థియేటర్లు పూర్తి స్థాయిలో రన్నింగ్ లోకి రాలేదు. తెలంగాణలో ఫుల్ పర్మిషన్ ఉన్నా, ఏపీలో సెకండ్ షోస్ లేవు. దీనికితోడు లోకల్ లాక్ డౌన్ వల్ల చాలా చోట్ల షోలు పడటంలేదు. టికెట్ రేట్లు కూడా తగ్గించేసేసరికి పెద్ద సినిమాల విడుదలలు వెనక్కి వెళ్లిపోతున్నాయి.

తాజాగా థియేటర్లలోకి వచ్చిన రాజరాజ చోర సినిమా కూడా టాక్ బాగుంది కానీ జనాలు మాత్రం థియేటర్లకు ఇంకా అలవాటు కాకపోవడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల సినిమా సూపర్ హిట్టని చెబుతున్నారే తప్ప, మొదటి రోజు వసూళ్లపై స్పందించలేకపోయారు. కనీసం అంచనా కలెక్షన్లు కూడా చెప్పలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో తమ సినిమా విడుదలై ఉంటే చాలా పెద్ద హిట్టయ్యేదనే బాధను మాత్రం ఇద్దరు నిర్మాతలు వ్యక్తం చేశారు.

అంతెందుకు.. సెకెండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్ అంటూ జబ్బలు చరుచుకున్న ఎస్ఆర్ కళ్యాణమండపం యూనిట్ కూడా పత్తా లేదు. విడుదలైన మొదటి 4 రోజులు హడావుడి చేసిన ఈ సినిమా జనం, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. థియేటర్లలో వచ్చే రాబడి కంటే, ప్రచారం చేస్తే అయ్యే ఖర్చు ఎక్కువ అవుతోందని, అందుకే పాజిటివ్ టాక్ తో సినిమాను అలా వదిలేశామని స్వయంగా యూనిట్ సభ్యులు చెబుతున్న మాట. 

గతంలో ఫస్ట్ డే అక్షయ్ సినిమాలకి 20కోట్ల మేర నెట్ బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడది 2 కోట్లు కూడా లేదు. అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ సినిమా వ్యథ ఇది. ఈ సినిమాను ప్రదర్శిస్తున్న హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో కేవలం 13 టికెట్లు మాత్రమే బుక్ అయ్యేసరికి షో క్యాన్సిల్ చేశారు. అక్షయ్ కెరీర్ లోనే అత్యంత తక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా బెల్ బాటమ్ నిలిచిపోతుందని అంటున్నారు.

పైరసీతో దెబ్బ మీద దెబ్బ

ఇప్పటికే థియేటర్లలో ఆక్యుపెన్సీ లేదు, ఏపీలో టిక్కెట్ రేట్లు తగ్గించారు. కొన్ని చోట్ల థియేటర్లు తెరవలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమాను మరింత దెబ్బకొడుతోంది పైరసీ. ఏదైనా సినిమాకు మంచి టాక్ వచ్చింది, చూద్దాం అనుకునేలోపు పైరసీ ప్రింట్ రెడీ అయిపోతోంది. అన్నట్టు పైరసీలో కూడా ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఒకప్పుడు పైరసీ అంటే కెమెరా ప్రింట్ మాత్రమే. కానీ ఇప్పుడు విడుదలైన మొదటి రోజు రాత్రికే హెడ్ డీ ప్రింట్లు వచ్చేస్తున్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు 4 రోజుల తర్వాత వసూళ్లు తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం.

ఇటు రాజ రాజ చోర సినిమాకు కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమా పైరసీ ప్రింట్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ రోజుల్లో.. ఓవైపు ఇలా పైరసీ ప్రింట్స్ దిగిపోతుంటే, థియేటర్లకు ఆడియన్స్ ఎందుకొస్తారు? దీనిపై దృష్టి పెట్టేంత సాహసం, సమయం ఇండస్ట్రీ పెద్దలకు ఉందా? మంచి రిలీజ్ డేట్ చూసుకొని డేట్ తో పోస్టర్ రిలీజ్ చేయడంలో చూపించినంత శ్రద్ధ దీనిపై ఎందుకు పెట్టరు?

గాడినపడేనా..?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అసాధారణ పరిస్థితుల వల్ల చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చినా నిలబడలేక ఇబ్బందులు పడుతున్నాయి. పెద్ద సినిమాలన్నీ భవిష్యత్తుపై ఆశతో ముందే రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నాయి. అప్పటికి పరిస్థితులు చక్కబడతాయో లేదో అనే అనుమానం మాత్రం అందరిలో ఉంది.

మరోవైపు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నవారు మాత్రం ఓటీటీలతో సరిపెడుతున్నారు. సినిమా సూపర్ హిట్టయినా, థియేటర్లకు జనాలు రాకపోతే నిర్మాతలకు డబ్బులు రావు. దాని బదులు ఓటీటీలకు ఇస్తేనే మరింత ఉపయోగం ఉంటుందనే భావనలో కొంతమంది ఉన్నారు. మొత్తమ్మీద.. సినీ ఇండస్ట్రీలో ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. అన్నట్టుంది పరిస్థితి.