మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తాజా ట్విస్ట్. హత్య కేసులో సమాచారం రాబట్టేందుకు సీబీఐ బహుమతి ఎర వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు సంబంధించి కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇస్తే …. క్యాష్ రూపంలో మంచి బహుమతి అందజేస్తామని సీబీఐ ప్రకటించింది. ఇప్పుడీ ఆఫర్ సర్వత్రా చర్చకు దారి తీసింది. కడప, పులివెందుల కేంద్రాలుగా సీబీఐ దాదాపు 75 రోజులుగా సీబీఐ విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను అనేక దఫాలుగా విచారించింది. వీరిలో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
అందులోనూ సునీల్ యాదవ్ చెప్పాడని పులివెందులలో వివేకా ఇంటి సమీపంలోని వాగులో మారణాయుధాల కోసం అన్వేషించింది. ఆ తర్వాత సునీల్, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇళ్లలో కొన్ని ఆయుధాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీంతో హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు అందరూ భావించారు. అకస్మాత్తుగా సీబీఐ శనివారం ఇచ్చిన ప్రకటన మరోసారి అందర్నీ అయోమయంలో పడేసింది. ఇంతకూ ఆ ప్రకటన సారాంశం ఏంటో తెలుసుకుందాం.
“2019, మార్చి 14-15 తేదీల్లో రాత్రి వేళ అతి దారుణంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో 2020, జూలై 9న సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ నేరానికి సంబంధించి నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తాం. సమాచారం ఇచ్చే వ్యక్తి లేదా వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతాం. సాధారణ ప్రజలెవరైనా సమాచారం ఇచ్చేందుకు ముందుకు రావాలి. హత్యకు సంబంధించి నమ్మకమైన, కచ్చితమైన సమాచారం ఉంటే పరిశోధనాధికారి లేదా పర్యవేక్షణాధికారి(సంబంధిత అధికారుల సెల్ఫోన్, ల్యాండ్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు)కి ఇవ్వాలి”
సీబీఐ తాజా ప్రకటన నేపథ్యంలో పలు ప్రశ్నలు, అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ 75 రోజుల్లో సీబీఐ విచారణలో హత్యకు సంబంధించి ఏం తేల్చినట్టు? ఎలాంటి కచ్చితమైన, నమ్మకమైన వివరాలను రాబట్టలేదని సీబీఐ తాజా ప్రకటన పరోక్షంగా తనకు తానుగా ప్రకటించుకున్నట్టైందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బహుశా సీబీఐ విచారణలో చిట్టచివరి ప్రయత్నంగా రూ.5 లక్షల బహుమతి ఎర వేసినట్టుగా జనం అభిప్రాయ పడుతున్నారు. సీబీఐ తాజా బంపర్ ఆఫర్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే … తానింత కాలం చేసిన విచారణంతా వృథానేనా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.