మునుగోడు ఉప ఎన్నిక వేడెక్కింది. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేశారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వెంట నడిచారు. నామినేషన్ అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్‌కు దమ్ముంటే మునుగోడులో పోటీ చేయాలని సవాల్ విసిరారు. మునుగోడులో పోటీకి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సొమ్ము లక్ష కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకున్నారని ఆరోపణ చేశారు.
మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. వచ్చే బతుకమ్మ నాటికి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో వుంటారని ఆయన జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను దేశమంతా చూస్తోందన్నారు.
రాష్ట్ర భవిష్యత్ ఏంటో మునుగోడు ఉప ఎన్నిక తేలుస్తుందన్నారు. నల్గొండ జిల్లా అంటే విప్లవాల ఖిల్లా అని ఆయన అన్నారు. తమను దొంగదెబ్బ తీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ సందర్భంగా బీజేపీ తన సత్తా చాటింది. వేలాదిగా బీజేపీ కార్యకర్తలు తరలిరావడంతో విజయంపై ఆ పార్టీకి ధీమా ఏర్పడింది.
బీజేపీలో జోష్ కనిపించింది. ఇప్పటికే బీజేపీ ఎన్నికల సైన్యం మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా దిగింది. ఇంటింటికి తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థిస్తోంది. ఈ ఎన్నిక తెలంగాణ ఉజ్వల భవిష్యత్‌కు మలుపుగా బీజేపీ ఇంటింటి ప్రచారంలో పదేపదే చెబుతోంది.