జ‌బ్బుకు మందు వేయ‌కుండా…బుచ్చ‌య్య‌కు బుజ్జ‌గింపులా?

వ్యాధిర‌ట్టు అన్నారు పెద్ద‌లు. కానీ టీడీపీలో అందుకు విరుద్ధ‌మైన ప‌రిస్థితి. తెలుగుదేశం పార్టీని పీడిస్తున్న వ్యాధిని న‌యం చేసుకోడానికి బ‌దులు ….అస‌లు వ్యాధే లేద‌ని క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇది ఆ పార్టీకి…

వ్యాధిర‌ట్టు అన్నారు పెద్ద‌లు. కానీ టీడీపీలో అందుకు విరుద్ధ‌మైన ప‌రిస్థితి. తెలుగుదేశం పార్టీని పీడిస్తున్న వ్యాధిని న‌యం చేసుకోడానికి బ‌దులు ….అస‌లు వ్యాధే లేద‌ని క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇది ఆ పార్టీకి భారీ న‌ష్టం తీసుకురానుంద‌నే ఆందోళ‌న టీడీపీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి పార్టీ పెద్ద‌ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే.

ఇదే వైసీపీలో ఎవ‌రైనా అస‌మ్మ‌తి గ‌ళం వినిపించే వుంటే… టీడీపీ అనుకూల మీడియా ఏం చేసేదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.ఎందుకంటే క‌ళ్లెదుట ర‌ఘురామ‌కృష్ణంరాజు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఉన్నారు. బుచ్చ‌య్య చౌద‌రి అసంతృప్తి కేవ‌లం ఆయ‌న వ్య‌క్తిగ‌తం అన్న‌ట్టు టీడీపీ, ఎల్లో మీడియా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఎవ‌రికి న‌ష్టం? అంతిమంగా టీడీపీకే న‌ష్టం క‌లిగిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అస‌లు టీడీపీని న‌డిపించే తీరుపైనే బుచ్చ‌య్య అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌నే కాదు, త‌న‌లాంటి వాళ్లు చాలా మంది పార్టీలో అసంతృప్తిగా ఉన్నార‌ని బుచ్చ‌య్య బ‌హిరంగంగానే ప్ర‌క‌టించి, ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బుచ్చ‌య్య విమ‌ర్శ‌ల్లో మంచిని గ్ర‌హించి, స‌రిదిద్దుకోవాల్సిన టీడీపీ, ఆ ప‌ని చేయ‌క‌పోగా…. త్రిమెన్ క‌మిటీని పంపి ఆయ‌న నోరు మూయించే చ‌ర్య‌ల‌కు దిగింది. బుచ్చ‌య్యను మ‌రోసారి బుజ్జ‌గించి ఆయ‌న నోరు మూయిస్తే…  మ‌రి పార్టీని న‌డిపించే తీరులోని లోపాల‌పై ఆయ‌న లేవనెత్తిన కీల‌క అంశాల సంగ‌తేంటి? అవి గాలిలో క‌లిసిపోవాల్సిందేనా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

బుచ్చ‌య్య ఎపిసోడ్ టీడీపీకి వైద్య భాష‌లో చెప్పాలంటే గ్యాంగ్రీన్ వాటిల్లింది. గ్యాంగ్రీన్ అంటే…శ‌రీర భాగాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా చేసే నాళాలు మూసుకుపోవ‌డం. దీంతో శరీర భాగాల‌కు ప్రాణ‌వాయువు, ఇత‌ర పోష‌కాలు అంద‌వు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి క‌ణ‌జాలం న‌శిస్తుంది. అంతేకాదు, అక్క‌డి శ‌రీర భాగం కుళ్లిపోతుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిలో గ్యాంగ్రీన్ వ్యాపిస్తుంద‌ని వైద్యులు గుర్తిస్తే… అక్క‌డి శ‌రీర భాగాల‌ను తొల‌గించ‌డం తెలిసిందే. లేదంటే ప్రాణాల‌కే ముప్పు.

ఇప్పుడు టీడీపీలో కూడా అలాంటి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులే నెల‌కున్నాయి. దీన్ని స‌రిదిద్దుకోకుండా, పార్టీలోని లోపాల‌ను ప్ర‌స్తావించిన గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిపై వ్య‌తిరేక భావ‌న క‌లిగేలా ఓ ప‌థ‌కం ప్ర‌కారం ఎల్లో మీడియా న‌డుచుకుంటోంది. ఇందులో భాగంగా న‌స పెడ‌తార‌నే భ‌యంతోనే టీడీపీ పెద్ద‌లు ఫోన్ ఎత్త‌లేదంటున్నార‌ని, అలాగే కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేల‌కు ఫోన్ చేస్తే ఎంత మాత్రం రిసీవ్ చేసుకుంటున్నార‌ని రివ‌ర్స్ అటాక్ చేస్తుండ‌డం ఆశ్య‌ర్యం క‌లిగిస్తోంది.

త‌నకు ఫోన్‌లో అందుబాటులో లేర‌ని, సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌ను పార్టీ పెద్ద‌లు ప‌ట్టించుకోలేద‌ని బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌స్తావిస్తే, దానికో కౌంట‌ర్ వాదన‌ను ఎల్లో మీడియా ముందుకు తెస్తోంది. ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్ వెళుతూ, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సీనియ‌ర్ నాయ‌కుడి కోరిక మేర‌కు ప‌రామ‌ర్శించార‌ని, అలాగే ఇటీవ‌ల ర‌మ్య హ‌త్య కేసులోనూ, అలాగే క‌ర్నూలు జిల్లాలోని మ‌రో హ‌త్య కేసులోనూ లోకేశ్ నేరుగా వెళ్లారు క‌దా? అని ఆయ‌న్ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయ‌డం దేనికి సంకేతం?

పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో ఫోన్‌లో మాట్లాడ్డానికి తీరిక లేని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు… మ‌రి ప్ర‌త్య‌ర్థి పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుతో గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడ్డానికి, చాటింగ్‌లు చేయ‌డానికి తీరిక ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించ‌డానికి ఎల్లో మీడియాకు మ‌న‌సు రాలేదా? అని టీడీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నాయి. 

ఎంత‌సేపూ కుట్ర‌ల‌ను న‌మ్ముకుని బ‌ల‌ప‌డ‌దామ‌నే వ్యూహం త‌ప్ప‌, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను ప‌ట్టించుకోవాల‌నే ధ్యాస కొర‌వ‌డింద‌ని బుచ్చ‌య్య చౌద‌రి అభిమానులు మండిప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా పార్టీ పెద్ద‌లు త‌మ త‌ప్పుల్ని తెలుసుకుని స‌రైన మార్గంలో న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని బుచ్చ‌య్య చౌద‌రి అనుచ‌రులు హిత‌వు చెబుతున్నారు.