భవనం ఖరీదు రూ.884 కోట్లు.. ఏంటి దాని ప్రత్యేకత?

ఇండియా నుంచి అమెరికా వరకు దేశం ఏదైనా, ధనవంతులు పెట్టుబడులు పెట్టేది ఇళ్ల పైనే. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఒకే అపార్ట్ మెంట్ లో పలు ఫ్లాట్స్…

ఇండియా నుంచి అమెరికా వరకు దేశం ఏదైనా, ధనవంతులు పెట్టుబడులు పెట్టేది ఇళ్ల పైనే. ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కూడా దీనికి మినహాయింపు కాదు. ఒకే అపార్ట్ మెంట్ లో పలు ఫ్లాట్స్ పై ఏకంగా 119 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాడు ఈ ధనవంతుడు. భారతీయ కరెన్సీలో దీని విలువు అటుఇటుగా 884 కోట్ల 22 లక్షల రూపాయలు.

న్యూయార్క్ లోని ఫ్లాటరాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఓ బిల్డింగ్ లో జెఫ్ కు ఇప్పటికే మూడంతస్తుల పెంట్ హౌజ్ ఉంది. ఇప్పుడు అదే అపార్ట్ మెంట్ లో 18 మిలియన్ డాలర్లు పెట్టి కొత్తగా మరో ఫ్లాట్ తీసుకున్నాడు. 4 బెడ్ రూమ్స్ తో 4155 చదరపు అడుగులతో ఉన్న ఈ ఫ్లాట్, బిజోస్ పాత అపార్ట్ మెంట్ కు ఆనుకునే ఉంటుంది. జులైలో ఈ డీల్ సెట్ అయి, ఆగస్ట్ లో ఫైనలైజ్ అయింది. ఇదే ఆపార్ట్ మెంట్ లో అదనంగా ఉన్న మరో 3 యూనిట్లతో కలుపుకొని బెజోస్.. ఈ భవనంపై 119 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు. తాజా కొనుగోలుతో ఈ భవనంలోని 20, 22, 23, 24 ఫ్లోర్లు బిజోస్ సొంతం అయ్యాయి.

ఇంతకీ ఈ భవనం ప్రత్యేకత ఏంటి?

ఈ బిల్డింగ్ ను 1913లో నిర్మించారు. ఆ టైమ్ లో న్యూయార్క్ లో ఎత్తైన భవనం ఇదే. డిజైనర్లు షివార్డ్-గాత్ ఈ భవనాన్ని ప్రయోగాత్మకంగా నిర్మించారు. అప్పట్లోనే భవిష్యత్తును ఊహించి కాంటెంపరరీ డిజైన్ వాడారు. ముందుగా ఆఫీస్ స్పేస్ కోసం అనుకున్నారట. తర్వాత నివాస సముదాయంగా మార్చారు. ఓపెన్ ఫ్లోర్ ప్లేట్స్, అతి పెద్ద కిటికీలు, ఎత్తుగా ఉండే సీలింగ్ ఈ బిల్డింగ్ ప్రత్యేకత.

అప్పట్లోనే ఈ బిల్డింగ్ లో గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్లు ఏర్పాటుచేశారు. సెక్యూరిటీ, కోల్డ్ స్టోరేజీ, ఫిట్ నెస్ సెంటర్, అన్ని వయసుల వారి కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్, యోగా సెంటర్, ట్రీట్ మెంట్ రూమ్, క్రీడా ప్రాంగణం, లాంజ్, డైనింగ్/మీటింగ్ రూమ్, పెద్ద ఫంక్షన్ల కోసం క్యాటరింగ్ కిచెన్, స్క్రీనింగ్ రూమ్ ఏర్పాటుచేశారు.

ఇక జెఫ్ బెజోస్ తీసుకున్న ఫ్లోర్స్ విషయానికొస్తే.. అందులో 7 గదులతో కూడిన మాస్టర్ స్వీట్ రూమ్ ఉంది. 5వేల చదరపు అడుగుల టెర్రస్ ఉంది. బెడ్ రూమ్ కిటికీ నుంచి చూస్తే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనిపిస్తాయి. మొత్తంగా ఈ బిల్డింగ్ లో బెజోస్ కు 5 ఇళ్లు ఉన్నాయి.

ఇదే అపార్ట్ మెంట్ లో టెక్సాస్ బిలియనీర్ ఎడ్ బాస్, ఈఎస్పీఎన్ కు చెందిన మైక్ గ్రీన్ బెర్గ్, ఛార్లెస్, సెరిల్ కుష్నెర్ తమ మనవళ్ల కోసం 3 ఫ్లోర్లు తీసుకున్నారు. జెఫ్ రాకతో ఇప్పుడు తమ ఫ్లోర్లకు మరింత రేటు పెరిగిందని వాళ్లు సంబరపడుతున్నారు.

ఇలాంటి పెట్టుబడులు పెట్టడం బెజోస్ కు కొత్త కాదు. గతంలో వాషింగ్టన్ డీసీలో ఉన్న ఓ టెక్స్ టైల్ మ్యూజియం ను 23 మిలియన్ డాలర్లు పెట్టి కొన్నాడు. మన్ హట్టన్ లో సెంట్రల్ పార్క్ కనిపించేలా 4 అంతస్తుల భవనం కొన్నాడు. వీటితో పాటు సియాటెల్, టెక్సాస్, కాలిఫోర్నియాలో జెఫ్ కు బిల్డింగ్ లు ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ లో ఉన్న జెఫ్ బెజోస్, ఈ లాక్ డౌన్ టైమ్ లో ఏకంగా 24 బిలియన్ డాలర్లు ఆర్జించి, తన సంపాదనను మరింత పెంచుకున్నాడు.