నిన్న కాక మొన్న పెట్టిన పార్టీని అప్పుడే మూసేస్తున్నారా? ఇదే ఇప్పుడు జనం మధ్యన జరుగుతున్న చర్చ.
ఉంచుకున్నా, మూసేసినా కూడా ఎటువంటి ఫరక్ పడదనేది ఎక్కువగా వినిపిస్తున్న వాదన.
ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రాధాన్యం సంతరించుకోకుండానే, ఏ విధమైన చారిత్రక ఉద్యమ నేపథ్యం లేకుండానే ఆవిర్భవించిన పార్టీకి ఆశించిన దాంట్లో పదో వంతు కూడా స్పందన రానప్పుడు అది ఉంటే ఎంత ఊడితే ఎంత?
ఇంకా పార్టీ తీరుతెన్నులు తెలీయకుండానే అంతర్గత అభిప్రాయ భేదాలతో ఆ పార్టీ నాయకులు ఒక్కక్కరూ వదిలి పోతుంటే అటువంటి పార్టీ ఉంటే ఎంత? ఊడితే ఎంత?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీసుకురాగల శక్తి విధివిధానల్లో ఇసుమంతైనా చూపని పార్టీ ఉంటే ఎంత? ఊడితే ఎంత? 20 రోజుల క్రితమే చేవెళ్ళ ప్రతాప రెడ్డి, కేటీ నరసింహారెడ్డి పార్టీని వదిలిపోగా నేడు ఇందిరా శోభన్ పార్టీకి గుడ్ బై చెప్పేసారు.
నిజానికి జయలలిత పక్కన శశికళ స్థాయిలో రాజకీయాన్ని నడపగలదనుకున్న ఇందిరా శోభన్ ఇలా పార్టీని ఇంత త్వరగా వదిలేసి బయటికొచ్చి విమర్శలు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు.
షర్మిల పార్టీనైతే పెట్టారు గానీ ఆమెకు నాయకత్వ లక్షణాలు అస్సలు లేవన్నది తేటతెల్లమయ్యింది. నాయకత్వం అంటే ప్రెస్ మీట్స్ లో తెలివైన సమాధానాలు చెప్పడం, తనని తాను సమర్ధించుకోవడం కాదు. అది పార్టీ స్పోక్స్ పర్సన్ పని.
నాయకత్వమంటే ముందు కుడిభుజం, ఎడం భుజం లాంటి వాళ్లని పబ్లిక్ గా గౌరవించాలి. ఏదైనా మందలింపు ఉంటే మూడో వ్యక్తికి తెలియకుండా నాలుగు గోడల మధ్యలో జరగాలి.
అంతే గానీ ఒకానొక సభలో స్టేజ్ డిసిప్లైన్ లేదని చిరాకు పడుతూ ఇందిరా శోభన్ ని షర్మిల “ఏం చేస్తున్నారు. గాడిదలు కాస్తున్నారా?” అని మైకులో మందలించారు. అది ఎంత మాత్రమూ సరి కాదు. ఇందిరా శోభన్ సర్దుకుపోయినా ఆ సంఘటనతో ప్రజల్లోకి నెగటివ్ సిగ్నల్స్ వెళ్లిపోయాయి.
“ఆంధ్ర నుంచి వచ్చి మా తెలంగాణా స్త్రీని గాడిదలు కాస్తున్నారా అంటుందా”, అని తెలంగాణా ప్రజలు కొందరు మండిపడ్డారు.
కేవలం వైయస్సార్ కూతురు అనే అర్హత తప్ప షర్మిలకి వేరే ఏ ఇమేజ్ ఉంది? తండ్రి వెనక తనయగా, అన్నచాటు చెల్లెలుగా తప్ప జనంతో పెనవేసుకున్న అనుబంధమేదీ లేదు కదా. అన్నగారు పడ్డట్టు ప్రతిపక్షాల వల్ల ఇబ్బందులేవీ పడలేదు కదా. తమిళనాడులో జయలలితలాగ అవమానాలేవీ గతంలో చూడలేదు కదా.
పోనీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా అల్లకల్లోలంగా ఉంది కనుక శాంతిస్థాపన కోసం పోరాటానికొచ్చింది అనుకోవడానికి అటువంటి వాతావరణమేదీ లేదు కదా.
కేవలం తండ్రి పేరు వాడుకుని ఒక పార్టీ పెడితే రెడ్ల ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు చీల్చొచ్చు అనే ఎలిమెంటరీ స్కూలు ఆలోచనతో పార్టీ పెట్టినట్టుంది తప్ప అంతకంటే ఆదర్శనీయమైన లక్ష్యాలేవీ కనపడలేదు.
పోనీ లక్ష్యం ఏదైనా ముందు అంతర్గతంగా సామరస్య వాతావరణం ఉండాలి. ఆ తర్వాత ఏ ప్రశాంత్ కిషోరునో రప్పించుకుని కథ నడపొచ్చు. ప్రస్తుతానికైతే ఎటువంటి స్ట్రాటెజీ లేకుండా, ఏ విధమైన దిశానిర్దేశం లేకుండా, ప్రజలతో మమేకమవడానికి దారి కనపడక, ప్రజలు కూడా పట్టించుకోక త్రిశంకు స్వర్గంలో వేలడుతున్న పార్టీ అంతర్గత కలహాలతో పట్టు వీడి కింద పడుతోంది.
బయటికొచ్చిన ఇందిరా శోభన్ ఏకంగా “పిచ్చోళ్ల మధ్యలో నేను పని చెయ్యలేను” అనేసారు. పార్టీ అధినేత్రిని “అక్కా” అని సంబోధిస్తూనే ఆమె నిర్ణయాలను వేలెత్తి చూపలేక కింది స్థాయి నాయకులను “స్క్రాప్” అంటూ దుయ్యబట్టారు. ఇప్పటి వరకు కాస్తొ కూస్తో ఆ పార్టీకి నాలుక ఇందిరా శోభన్ ఒక్కరే.
“నాది ఆంధ్ర ప్రాంతం కాదు. నేను తెలంగాణా మహిళనే. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను” అని షర్మిల ఎన్ని చెప్పినా తెలంగాణా ప్రజానీకం ఆమెను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే చూస్తుంది. ఎందుకంటే స్థాపించిన పార్టీ స్వయానా తండ్రి వైయస్సార్ పేరు మీదనే ఉంది కదా.
“నేను తెలంగాణాయే కానీ, నా జెండా సీమాంధ్ర” అన్నట్టుంటుంది.
అదలా ఉంచితే అసలు షర్మిల పార్టీ పెట్టిందే రాంగ్ టైములో. ప్రజల్లో ప్రభుత్వం మీద అసహనం తారాస్థాయిలో ఉన్నప్పుడే ఇలా నింగి నుంచి దిగివచ్చిన పార్టీలవైపు జనం కాస్త దృష్టి సారిస్తారు. కానప్పుడు ఒక ప్రహసనంలా చూస్తారు తప్ప మనసు పెట్టరు.
అలాంటి పరిస్థితుల్లో పార్టీని నడపడమంటే మాటలు కాదు. బోలెడన్ని ఖర్చులుంటాయి. ఎన్నో విరాళాలు కావాలి.
గెలుస్తుందనుకునే గుర్రం మీద పందెం కాస్తారు ఎవరైనా. అంతే కానీ అరోగ్యం దెబ్బతిని నీరసించిన గుర్రం మీద ఎవ్వరూ పందెం కాయరు. ఇప్పుడు వైయ్యస్సార్టీపీ పరిస్థితి నీరసించి చతికిలపడిన గుర్రంలా ఉంది. “అలక్ష్మీ కలహాధారా” అని చెప్పినట్టు డబ్బులేని చోట కలహాలే వస్తాయి. డబ్బున్న చోట ఆత్మ సంతృప్తి లేకపోయినా భరిస్తూ పని చేసే శక్తి వస్తుంది. ఆ డబ్బుని సంపాదించడానికి ఇప్పుడు పార్టీ నాయకత్వం నానా యాతనా పడాలి.
ఇప్పటివరకూ షర్మిల పార్టీది ఫ్లాప్ షోయే. ముందు ముందు తెలివిగా ప్రవర్తించి పార్టీమీద ప్రస్తుతం ఉన్న ఈ పర్సెప్షన్ ని మార్చగలిగితే భవిష్యత్తుంటుంది. లేకపోతే అప్పట్లో విజయశాంతి తల్లి తెలంగాణా పార్టీలాగ దుకాణం మూసేసుకోవడమే.
– తంగిరాల సుబ్రహ్మణ్యం