కర్ణాటక, మధ్యప్రదేశ్ అయిపోయాయి.. ఇక రాజాస్తానే తదుపరి అన్నట్టుగా మారుతోంది వ్యవహారం. అక్కడ రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయింది. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేకు భారీగా డబ్బులను ఆఫర్ చేస్తోందని, రాజ్యసభ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో బీజేపీ నెగ్గాలని చూస్తోందని, అందుకే ఎమ్మెల్యేల కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అశోక్ గెహ్లట్ ప్రభుత్వం క్యాంపులను నిర్వహిస్తూ ఉంది. వారిని రిసార్టులకు తరలించి రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ కాపాడుకోవాలని చూస్తున్నట్టుగా ఉంది.
అయితే ఈ వ్యవహారం రాజ్యసభ ఎన్నికలతో అయిపోతోందా? లేక కర్ణాటక, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చినట్టుగా బీజేపీ వాళ్లు రాజస్తాన్ లోనూ తమకు అలవాటుగా మారిన పనిని చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఒకేసారి జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఓటేసిన సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ను కూల్చేశారు. కాంగ్రెస్ రెబల్స్ తో బీజేపీ పని పూర్తి చేసింది. అంతకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్నీ రెబల్స్ ద్వారానే బీజేపీ కూలదోసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో.. రాజస్తాన్ లోనూ అలాంటి పరిణామాలే ఉంటాయేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజస్తాన్ లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీనే ఉంది ప్రస్తుతానికి. అయినా కూడా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రిసార్టు రాజకీయం కాంగ్రెస్ కే తప్పడం లేదు. ఈ క్రమంలో అక్కడ ముందు ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలుంటాయో!