రాజకీయ నాయకులు చేసే ట్వీట్లు.. స్వయంగా వారు చేసేవి కాదని.. వారి పురమాయింపుతో వారు చెప్పినప్పుడు గానీ, లేదా వారి మనుసులో ఉండే భావాన్ని గ్రహించిగానీ.. ఎవరో చిరుద్యోగులు అలాంటి ట్వీట్లు చేస్తుంటారని చాలా మంది నెటిజన్లకు తెలుసు. చంద్రబాబునాయుడు ట్వీట్లు చూసినా కూడా.. స్వయంగా ఆయనే చేస్తున్నట్లు అనిపించదు. ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న సమయంలో కూడా ట్వీట్లు మాత్రం యథాతథంగా వెల్లువెత్తడానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. అయితే తాజాగా చంద్రబాబు ట్వీట్ మాత్రం.. హాట్ టాపిక్ గా మారి, ఆయన దిగజారుడుతనానికి పరాకాష్టగా నిలుస్తోంది.
రాష్ట్రంలో ఆశావర్కర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నట్టుగా ప్రజల్లో ఒక విషబీజం నాటాలని ఆయన అనుకుంటున్నట్లుగా ఉంది. అదే తడవుగా.. ఆయన గణాలు ఓ ట్వీట్ ను తయారు చేసేశాయి. ఆశా వర్కర్లు ఒక పాడె మోసుకు వెళుతున్నట్లుగా ఒక ఫోటో సంపాదించాయి. గతంలో జగన్ ఆశా వర్కర్లకు అనుకూల నిర్ణయం ప్రకటించిన తర్వాత.. వారు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న ఫోటోను కూడా సేకరించాయి. ఆ రెండు ఫోటోలను కలిపి.. అప్పుడు ఇప్పుడు అంటూ… మిక్స్ చేసి.. ట్వీట్ లో సంధించారు. ‘‘ప్రజాక్షేత్రంలో మాటతప్పితే జరిగే సన్మానం ఇదే’’ అంటూ బాబుగారి కామెంట్ ను కూడా మిక్స్ చేశారు.
అయినా ప్రజాక్షేత్రంలో మాటతప్పితే ఎలాంటి సన్మానం జరుగుతుందో చంద్రబాబుకు మించి చెప్పగలిగిన వారు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే.. మాట తప్పినందుకు అలాంటి సన్మానం అపూర్వంగా జరగబట్టే ఆయన ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు.
కాపోతే ఆయన ఇక్కడే పప్పులో కాలేశారు. ఆశా వర్కర్లు పాడె మోస్తున్నట్లుగా ఉన్న ఫోటో ఇప్పటిది కాదు. 2015లో వారు నిరసనలు తెలియజేస్తున్నప్పటిది. అది కూడా మన రాష్ట్రంలో కాదు… తెలంగాణలో. అంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆయన తరఫున ట్వీట్లు చేసేవాళ్లు పనిచేన్తున్నారన్నమాట. ఇది వారి తెలివిడికింద ప్రజలు భావిస్తే పర్లేదు. కానీ.. ట్వీట్ అనేది చంద్రబాబు పేరిట ఉన్నందుకు గాను.. ఆయనకు ఆపాటి కామన్ సెన్స్ లేదని అసహ్యించుకుంటేనే ప్రమాదం.