చంద్ర‌బాబుకు అంత ధైర్యం వుందా?

తెలంగాణ‌లో ఎన్నిక‌లొస్తే త‌ప్ప ఆ రాష్ట్రంలో టీడీపీ ఉంద‌ని చంద్ర‌బాబుకు గుర్తు రాదు. ప్రస్తుతం అక్క‌డ మునుగోడు ఉప ఎన్నిక ఓ యుద్ధాన్ని త‌ల‌పిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక…

తెలంగాణ‌లో ఎన్నిక‌లొస్తే త‌ప్ప ఆ రాష్ట్రంలో టీడీపీ ఉంద‌ని చంద్ర‌బాబుకు గుర్తు రాదు. ప్రస్తుతం అక్క‌డ మునుగోడు ఉప ఎన్నిక ఓ యుద్ధాన్ని త‌ల‌పిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

అన్ని పార్టీల ఎన్నిక‌ల సైన్య‌మంతా మునుగోడులో దిగింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ మొద‌లైంది. గెలుపుపై మూడు పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. లోలోప‌ల మాత్రం భ‌య‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మునుగోడు ఉప ఎన్నిక బ‌రిలో టీడీపీ నిల‌వ‌డంపై చ‌ర్చ‌కు తెర‌లేచింది. తెలంగాణ టీడీపీ నాయ‌కులు చంద్ర‌బాబునాయుడిని క‌లిసి మునుగోడు ఉప ఎన్నిక‌లో పోటీ చేద్దామ‌ని సూచించారు.

బీసీల పార్టీగా టీడీపీ గుర్తింపు పొందింద‌ని, కావున అక్క‌డ ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థిని బ‌రిలో నిలుపుదామ‌ని చంద్ర‌బాబుకు నేత‌లు సూచించారు. అంతేకాకుండా, టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థుల‌నే నిలిపాయ‌ని, టీడీపీ త‌ర‌పున బీసీ అభ్య‌ర్థిని నిలిపితే రాజ‌కీయంగా లాభిస్తుంద‌నేది నాయ‌కుల అభిప్రాయం. పైగా మునుగోడులో బీసీల ఓట్లు గ‌ణ‌నీయంగా ఉన్నాయ‌ని చంద్ర‌బాబు దృష్టికి తెలంగాణ టీడీపీ నేత‌లు తీసుకెళ్లారు.

అంద‌రి అభిప్రాయాల్ని తీసుకుని మునుగోడులో పోటీ చేయ‌డంపై ఈ నెల 13న నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు వారితో చెప్పారు. మునుగోడులో టీడీపీ బీజేపీ అభ్య‌ర్థిని బ‌రిలో నిలిపితే రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తుంద‌ని బీజేపీ భావిస్తుంది. ఒక‌వేళ చంద్ర‌బాబు వ‌ల్ల ఓడిపోయామ‌ని భావిస్తే మాత్రం చంద్ర‌బాబుపై బీజేపీ క‌క్ష పెంచుకుంటుంది. తాము పోటీ చేయ‌డం వ‌ల్ల బీజేపీకి లాభ‌మా? న‌ష్ట‌మా? అనేది తెలుసుకోడానికే చంద్ర‌బాబు టైం తీసుకున్న‌ట్టు స‌మాచారం.

మునుగోడులో బీజేపీని కాద‌ని చంద్ర‌బాబు బ‌రిలో దిగే ధైర్యం చేయ‌ర‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే మునుగోడులో గెలుపు తెలంగాణ రాజ‌కీయాన్ని మారుస్తుంద‌ని బీజేపీ న‌మ్ముతోంది. దీంతో ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. మునుగోడును సాకుగా తీసుకుని బీజేపీకి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు చంద్ర‌బాబు ఆలోచన చేయ‌వ‌చ్చు.