ఎట్టకేలకు ప్రశ్నించే గొంతుక మేల్కొంది. జగన్ ప్రభుత్వాన్ని జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. దేనికి గర్జనలు అంటూ పవన్‌కల్యాణ్ చేసిన వరుస ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు మూడు రాజధానులపై సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
‘దేనికి గర్జనలు?…రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినం దుకా? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా?’
‘దేనికి గర్జనలు?… విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా? . దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?’
‘దేనికి గర్జనలు?…ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా?. మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?’ అంటూ పవన్ వరుస ట్వీట్లు చేశారు.
ఇలా సాగింది పవన్‌కల్యాణ్ నిలదీత. మూడు రాజధానులపై ఉత్తరాంధ్ర అధికార పార్టీ నేతలు గట్టిగా మాట్లాడుతున్న తరుణంలో పవన్‌కల్యాణ్ ట్వీట్ చేయడం గమనార్హం. ఉత్తరాంధ్రకు రాజధాని ఇవ్వడంపై పవన్‌కల్యాణ్ మద్దతు పలకాలని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇటీవల డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
పవన్‌కల్యాణ్ కూడా లోకేశ్‌ను అనుసరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల మధ్య కంటే సోషల్ మీడియాలో గడిపేందుకే పవన్ ఇష్టపడుతున్నట్టు, ఆయన ట్వీట్లు, పోస్టులు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ వైఖరి ఏంటో సొంత పార్టీ వాళ్లకే అర్థం కాని దయనీయ స్థితి.