పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నారా? అంటే…అనుమానమే అనే జవాబు వస్తోంది. రాజకీయాల్లో ప్రతి ఎన్నికను సీరియస్‌గా తీసుకుని, గెలుపోటములతో సంబంధం లేకుండా బరిలో వుండేవారినే జనం ఎప్పటికైనా గుర్తిస్తారు. అదేంటో గానీ, పవన్‌కల్యాణ్ ఏ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఏపీలో ప్రస్తుతం పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ మిత్రపక్షమైన బీజేపీ కూడా అదే పనిలో వుంది. జనసేనతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థుల ఖరారు, ప్రచారంపై దృష్టి పెట్టింది. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఏపీ బీజేపీ నేతలు వదిలేశారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. బీజేపీ, జనసేన మధ్య అధికారికంగా పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తామని ఏపీ బీజేపీ నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. కుటుంబ, అవినీతి పార్టీలైన టీడీపీ, వైసీపీలతో సమాన దూరం పాటిస్తామని బీజేపీ చెబుతూ వస్తోంది. బీజేపీతో పొత్తుపై పవన్‌కల్యాణ్ ఇటీవల కాలంలో ఏమీ మాట్లాడ్డం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే వైసీపీ, టీడీపీ, వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్న ఏకైక పార్టీ ఏదైనా వుందంటే…అది జనసేన మాత్రమే.
జనసేన డొల్లతనాన్ని ఈ ఎన్నికలు బయట పెడుతున్నాయి. కేవలం మీడియా అటెన్షన్ కోసమే అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, పవన్‌కల్యాణ్‌తో సహా ఆ పార్టీ నేతలంతా పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల నియోజక వర్గాల్లో బరిలో నిలిచేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తాజాగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్నూలుకు చెందిన రఘు పేరును ఆ పార్టీకి చెందిన సీమ నాయకులు ప్రతిపాదించి అధిష్టానానికి పంపారు.
జగన్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేసే పవన్‌కల్యాణ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు తప్పితే, మరే ఎన్నికలతో తమకు సంబంధం లేదన్నట్టుగా పవన్‌కల్యాణ్ వ్యవహార శైలి వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై విద్యావంతుల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వుందో నిరూపించ డానికి పవన్ కల్యాణ్‌కు ఇంతకంటే అవకాశం ఏముంటుంది?
అలాగే జగన్ ప్రభుత్వంపై వీరోచిత పోరాటం చేస్తున్నానని కలలు కంటున్న పవన్‌కు …చదువుకున్న వాళ్లలో తన పార్టీపై ఎంత వరకు అభిమానం వుందో తెలుసుకునే అవకాశం ఉంది. ఇలాంటి మంచి అవకాశాలను జారవిడుచుకుంటూ, పవన్ ఎలాంటి రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. బీజేపీ మాత్రం పవన్‌తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతోంది.