కేసీఆర్- బిఆర్ఎస్ ఈ అడుగులు ఏ వెలుగులకు?

‘తెలంగాణ’ తప్ప తనకు మరో ప్రాధాన్యం ఏదీ లేదని.. ఒక ప్రాంతం ప్రజల మీద విద్వేషాగ్నులను రగిల్చి, ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించి మొత్తానికి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. ఇప్పుడు పాట మార్చారు. దేశమంతా తెలంగాణ…

‘తెలంగాణ’ తప్ప తనకు మరో ప్రాధాన్యం ఏదీ లేదని.. ఒక ప్రాంతం ప్రజల మీద విద్వేషాగ్నులను రగిల్చి, ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తించి మొత్తానికి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. ఇప్పుడు పాట మార్చారు. దేశమంతా తెలంగాణ లాగా అభివృద్ధి చెందాలని అంటున్నారు! అలా దేశమంతా.. తెలంగాణలాగా బాగుపడాలంటే.. తాను దేశ్ కీ నేతా కావడం ఒక్కటే మార్గమని తీర్మానించారు. టిఆర్ఎస్‌ను.. భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. 

ఈ అడుగులు ఏ వెలుగుల వైపు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తీసుకువెళతాయి? నిన్నటిదాకా ఒక ప్రాంత ప్రయోజనాలను లక్ష్యిస్తూ.. ఇరుగు పొరుగు అందరూ తప్పు చేస్తున్నారని రంకెలువేసిన వ్యక్తి.. ఇవాళ ‘దేశమంతా నా వెంట నడవండి’ అని నినదిస్తే అది వర్కవుట్ అవుతుందా? ఆయన కొత్త పల్లవిని దేశప్రజలు ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హఠాత్తుగా యావత్ భారతదేశం మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? దేశం మొత్తాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన.. ‘ఇప్పుడే’ ఎందుకు కలిగింది? లాంటి ప్రశ్నలు ఆయన జాతీయ పార్టీని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సర్వత్రా వినిపిస్తున్నాయి! దేశాన్ని ఉద్ధరించాలని ఆలోచన ఎవరికి ఎప్పుడైనా కలగవచ్చు. దానిని మనం తప్పు పట్టలేం. కానీ, అందరి సంగతి వేరు.. కేసిఆర్ సంగతి వేరు! తెలంగాణ తప్ప తనకు ఇంకొక పదం తెలియదన్నట్టుగా.. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తాను.. అన్నట్లుగా కేసీఆర్ సుదీర్ఘకాలం రాజకీయం నడిపారు. 

ఇరువు పొరుగు రాష్ట్రాలతో కూడా నిత్యం కయ్యం పెట్టుకుంటూ.. వాళ్లతో వాటాలు పంచుకోవలసి వచ్చినప్పుడు రకరకాల అడ్డగోలు వాదనలతో పీటముడికి కారణం అవుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను తెలంగాణకు మాత్రమే నాయకుడిని అని పలుమార్లు నిరూపించుకున్నారు! ఇప్పుడు కూడా ఆయన తెలంగాణ రాజకీయాలలోనే ఉంటూ దేశ రాజకీయాలను అయినంతవరకు ప్రభావితం చేయాలని అనుకుంటే అది ఇంకో తరహా! జాతీయ రాజకీయాల్లో ఫ్రంట్ కు ఒక కీలకమైన సంధానకర్తగా వ్యవహరించవచ్చు. కానీ దశాబ్దాల తన రాజకీయ జీవితాన్ని ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాయకుడిగా, ఆయనే స్వయంగా సంకోచింపజేసుకున్నారు. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ‘దేశ్ కీ నేతా’ అని తన గులాబీ దళాలతో అనిపించుకున్నంత మాత్రాన.. దానికి సర్వజనామోదం లభిస్తుందా?

ఇప్పుడే ఎందుకు?

కేసీఆర్.. ఇప్పుడు తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. ఈ నిర్ణయానికి ముందు పరిణామాలు జరిగిన క్రమంలో రెండు రకాల మార్పులు వచ్చి ఉంటే.. అసలు ఈ పార్టీ పుట్టేదేనా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. ఆ రెండు రకాలు ఏమిటి?

(1) బిజెపి పుణ్యం : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్‌కు వెన్నులో వణుకు పుట్టించేంతగా బలపడకపోయి ఉంటే.. కేసీఆర్ కు జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన అయినా వచ్చేదేనా?

(2) కాంగ్రెస్ పుణ్యం : కేసీఆర్ ప్రతిపాదించినట్లుగా బిజెపియేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుకు.. ఆయన భేటీ అయిన ఇతర రాష్ట్రాల నాయకులందరూ ఆమోదముద్ర వేసి ఉంటే అసలు ఈ పార్టీ పుట్టేదేనా? 

ఈ రెండు కోణాల్లోంచి చూసినప్పుడు.. కేసీఆర్ జాతీయ పార్టీ అనేది దేశాన్ని ఉద్ధరించే లక్ష్యం ఏమోగానీ.. బిజెపి, కాంగ్రెస్ పార్టీల వల్లనే పుట్టుకొచ్చిందనే వాదనను మనం నమ్మవచ్చు. 

బిజెపి పుణ్యం ఎంత ఉన్నదో చూద్దాం.. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. గులాబీ దళానికి ఇక తెలంగాణలో తిరుగులేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. బిజెపి, కాంగ్రెస్ లు కూడా సీట్లను ఎగరేసుకుపోయాయి. తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు, దళపతిలో అతివిశ్వాసాన్ని దెబ్బకొట్టాయి. సహజంగా అసెంబ్లీ సీటుకు ఉపఎన్నిక వచ్చినప్పుడు.. అధికార పార్టీకి ఎంతో కొంత ఎడ్వాంటేజీ ఉంటుంది.

అధికారబలగాల్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తేడా కొట్టింది. కాంగ్రెస్ పార్టీ సిటింగు సీటు, టిఆర్ఎస్ సిటింగు సీటు కూడా బిజెపికి కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఫలితాలు ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు కేసీఆర్! ఆయన రాజకీయ వ్యూహరచనా దురంధరుడు! 

అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో దూకుడు పెంచింది. ఇంకో ఉపఎన్నికలో వారు ఓడిపోవచ్చు గాక.. కానీ.. కేసీఆర్‌కు గుబులు పుట్టించే తీరులో కమలనాయకులు స్పీడు పెంచారు. పాదయాత్రలు, భారీ బహిరంగ సభలు, కార్యక్రమాలు, ఆరోపణల దాడులు పెంచి ఉక్కిరి బిక్కిరి చేశారు. బిజెపి వారి దూకుడు గమనించి.. ‘నువ్వు నాకు నిద్రలేకుండా చేసేట్లయితే.. నేనూ నీకు నిద్రలేకుండా చేస్తా..’ అనే సిద్ధాంతం ఫాలో అవుతున్నట్లుగా కేసీఆర్ జాతీయరాజకీయాల ఊసు ఎత్తడం ప్రారంభించారు. 

మోడీ సర్కారును అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైందనే నినాదం ఎత్తుకున్నారు. మోడీ సర్కారును కూల్చడానికి జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్ అవసరం ఉందనే ఆలోచనను ఆయన దేశంలోని ఇతర పార్టీల చెంతకు పుష్ చేశారు. నిజానికి అన్ని పార్టీలకు కూడా అలాంటి కోరిక ఉంది. ఆ ఆలోచనను పుష్ చేయడంలో ఆయన తన స్వార్థాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా కలిపేశారు. బిజెపితో పాటు, కాంగ్రెసు కూడా లేని ఫ్రంట్ కావాలని కేసీఆర్ కోరిక. అది పూర్తిగా ఆయన స్వార్థం. కాంగ్రెసు ఉండే కూటమిలోకి వెళ్లాల్సి వస్తే.. తన రాష్ట్రంలో అధికారాన్ని వాళ్లతో పంచుకోవాల్సి వస్తుందనే స్వార్థం. కానీ.. ఆ గుంజాటన ఇతరులెవ్వరికీ లేదు. వాళ్లు హాయిగా కాంగ్రెసు కూడా పంచడానికి సిద్ధంగానే ఉన్నారు. స్టాలిన్, నితీశ్ కుమార్, కుమారస్వామి, హేమంత్ సోరెన్ అందరూ ఆ బాపతు నాయకులే. కేసీఆర్ కాలికి బలపం కట్టుకుని అందరు నాయకుల వద్దకు తిరిగారు. తన ఆలోచనలను పంచుకున్నారు. తన  స్వార్థాన్ని దాచిపెట్టారు. స్వార్థం దాస్తే దాగేది కాదు. వారెవ్వరూ పసికూనలు కాదు. అందుకే ఆయన ఫ్రంట్ అటకెక్కింది. ప్రత్యేకవిమానం ఖర్చులు, సదరు నాయకులకు శాలువాలు, జ్ఞాపికలు మాత్రం ఖర్చు తేలాయి! ఫలితం సున్నా!!

ఫ్రంట్ కోసం అందరినీ తాను దేబిరించడం ఏమిటి? తానే కొత్త జాతీయ పార్టీ పెట్టేస్తే పోలా? అనే ఆలోచన ఆ తర్వాతే వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది! దీన్ని బట్టి.. భారత్ రాష్ట్ర సమితి అనే పార్టీ ఆవిర్భావం.. పూర్తిగా బిజెపి, కాంగ్రెస్ ల పుణ్యం అని మనకు అర్థమవుతుంది.

నిన్నటి కేసీఆర్‌ను దేశం మరచిపోతుందా?

కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఇవాళ అందరూ ‘దేశ్ కీ నేతా’, ‘దేశోద్ధారక’ అని అంటున్నారు. అంటున్నవాళ్లందరూ తెలంగాణ వాళ్లే అన్న సంగతి మనం మరచిపోకూడదు. రేపో మాపో ఈ మాటలు దేశంలోని ఇతర ప్రాంతాల వారితో అనిపించుకోవడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అది సాధ్యమేనా?

‘అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నమ్మకు పరమాన్నం పెడతాట్ట’ అనే సామెతను కేసీఆర్ పలుమార్లు చెబుతుంటారు. సహజంగానే, అద్భుతమైన చతురోక్తులతో కూడిన మాటకారి అయిన కేసీఆర్.. సభారజంకంగా ప్రత్యర్థుల్ని దుమ్మెత్తిపోయడానికి వారి  చేతగానితనాన్ని ఎండగట్టడానికి ఈ మాట వాడతారు. ఇప్పుడు ఆయనకు కూడా అదే వర్తిస్తుందేమో. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఈ తొమ్మిదేళ్ల పాలన కాలంలో.. సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన అనుసరించిన నీతి ఎలాంటిది? ఆయన దృక్పథం ఎలా ఉండింది? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాదును కోల్పోవడం వలన పేద రాష్ట్రంగా రాత్రికి రాత్రి మారిపోయి ఉండొచ్చు. అందువలన కేసీఆర్ ను నిధులు, ఆర్థిక సాయం అడగడం లేదు. ఆంధ్రప్రదేశ్ కు చేయవలసిన చెల్లింపులు, రుణాలు అయినా చేశారా? అప్పులను పంచుకున్నారా? నీటి వాటాల్లో ఎన్ని కొత్త పితలాటకాలు పెడుతున్నారు? ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు? ఇవన్నీ కూడా దేశం గమనిస్తున్న సంగతులే. సోదరరాష్ట్రాన్ని ఇన్నేళ్లుగా ఇన్ని ఆరళ్లు పెడుతూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు హఠాత్తుగా దేశాన్ని మొత్తంగా ఉద్ధరించేస్తానని అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్మాలి?

ఈ చిల్లర విలీనాలతో నష్టమే ఎక్కువ?

అన్నప్రాసన నాడే ఆవకాయ వడ్డించుకున్నట్టుగా.. ఆవిర్భావం నాడే.. 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధి దాటని తన పార్టీకి ఆయన జాతీయ అస్తిత్వాన్ని కూడా తయారు చేసుకున్నారు. తమిళనాడులో చిదంబరం ఎంపీ, ఒక చిన్న పార్టీ అధ్యక్షుడు అయిన తిరుమావళవన్.. తన పార్టీని బిఆర్ఎస్ లో విలీనం చేశారు. అంటే విలీనం అనే అధికారిక ప్రక్రియ.. ఈసీ గుర్తింపు తర్వాత వస్తుంది. 

ఈ అరవ ఎంపీగారి కీర్తనలతో కేసీఆర్ మురిసిపోతున్నారా? ఆయన మరీ అంత అమాయకుడు కాకపోవచ్చు. ఏదో సభారంజకంగా ఉంటుంది గానీ.. ఆయన ఈ పరిణామాల్ని ప్రాక్టికల్ గానే చూడగలరు! నిజానికి ఈ ఎంపీగారి విలీనంతో బిఆర్ఎస్ కు లాభమా నష్టమా కూడా సందేహమే?

ఎందుకంటే.. తమిళనాడులోని విడుదలై చిరుతైగళ్ కట్చి.. అనే చిన్న ప్రాంతీయ పార్టీకి తిరుమావళవన్ అధ్యక్షుడు. దళిత్ పాంథర్స్ పేరుతో దళితుల సమానత్వం కోసం పోరాడే సంస్థ నుంచి వేరుపడి ఆయన ఈ పార్టీ పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే.. ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకేతో పొత్తు పెట్టుకుని ఆయన చిదంబరం ఎంపీగా గెలిచారు. డీఎంకే కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఫలితం ఆయన ఎంపీ పదవి. ఇప్పుడాయన తన పార్టీని బిఆర్ఎస్ లో విలీనం చేయబోతున్నారు. 

ఆయన ప్రస్తుతం దళిత బాంధవుడిగా కేసీఆర్ ను ఎన్ని రకాలుగా అయినా కీర్తించవచ్చు గాక.. కానీ, మళ్లీ ఎంపీ ఎన్నికలొస్తే.. అదే చిదంబరం నుంచి డిఎంకె మద్దతులేకుండా బిఆర్ఎస్ టికెట్ మీద నెగ్గగలరనే నమ్మకం ఉందా? ఇలాంటి చిల్లర పార్టీల విలీనం వల్ల కేసీఆర్ కు వచ్చేదేమీ లేదు. ఇంకా నష్టం కూడా! ఎలాగంటే.. వీసీకే (తమిళపార్టీ) అసలు బలం, స్వరూపం తెలిసిన వారు.. ఆ విలీనాన్ని చూసి నవ్వుకుని.. తాము చేతులు కలిపితే.. తమ స్థాయి కూడా వీసీకే రేంజికి పడిపోతుందని వెనక్కు తగ్గే ప్రమాదమూ ఉంటుంది. 

దేవెగౌడ పార్టీని విలీనానికి ఒప్పించి ఉంటే.. కేసీఆర్ ఓ అద్భుత విజయం సాధించినట్టు మనం భావించేవాళ్లం. కానీ అనేక దఫాలు హైదరాబాదు వచ్చి కేసీఆర్ తో మాటామంతీ నెరపి వెళ్లిన కుమారస్వామి తీరా శాలువా కప్పారు గానీ.. విలీనం కాదు కదా.. పొత్తు ఆలోచన కూడా లేనేలేదని తేల్చిచెప్పండం కేసీఆర్ ప్రయత్నానికి, భారత్ రాష్ట్ర సమితికి అవమానకరం.

దళిత కార్డు పనిచేయదు!

రాజకీయ నాయకుల్లో ఓటుబ్యాంకును తయారు చేసుకోవడానికి దళిత కార్డును ప్రయోగించని వారు భూమండలమంతా వెతికినా దొరకరు. ఎంతటి అగ్రవర్ణ దురహంకారంతో వెర్రెత్తిపోయే పార్టీ అయినా.. సభాముఖంగా దళితప్రేమను వెల్లువలాగా కురిపిస్తారు. దళితకార్డు ప్రయోగించి ప్రజాదరణను కూడగట్టడం అనేది పాచిపోయిన టెక్నిక్‌. అయినా అందరూ కోరుకునేదే. ఆధునిక రాజకీయ వ్యూహాల్లో చతురుడైన కేసీఆర్ ఆ పాచిపోయిన టెక్నిక్‌నే వాడుతున్నారు. ఆయన కొత్త తీరులో.. హైదరాబాదులో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తానని వాక్రుచ్చారు. (రిటైర్డు ఐఏఎస్ లు, మేధావులతో కూడా ఓ సదస్సు హైదరాబాదులోనే నిర్వహిస్తానని గతంలో చెప్పిఉన్నారు.) జాతీయ పార్టీగా ఆవిర్భవించే ప్రయత్నంలో.. ప్రతి సదస్సునూ హైదరాబాదులో నిర్వహించడం అనేది రాంగ్ మూవ్!

హైదరాబాదులో తప్ప మరో ఊరిలో మీటింగు పెట్టడానికి కూడా జంకే బిఆర్ఎస్.. జాతీయ పార్టీగా ఎలా మనగలుగుతుంది? అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తే ఏం చెప్తారు?

అదంతా తర్వాత.. దళితులకు తెలంగాణ సర్కారు చాలా చాలా చేసిందని కేసీఆర్ అంటున్నారు. ఆ మోడల్ ను దేశానికంతా పరిచయం చేస్తానని అంటున్నారు. మరో కోణంలో చూస్తే.. దేశంలో ప్రతి ప్రభుత్వమూ దళితులకు మేం చాలా చేస్తున్నామనే చెబుతుంది. కేసీఆర్ కూడా తెలంగాణలో చాలా చేశాం అని.. దేశంలోని దళితులకు ఇంకా చాలా చేస్తాం అని బహుశా చెప్పబోతారు. దేశంలోని దళితులకు చేయగల ‘ఇంకా చాలా’ మేలును ఇన్నేళ్ల పాలనలో తెలంగాణలో ఎందుకు అమల్లోకి తేలేదు అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? ఎంతగా దళిత ప్రేమ కురిపించినా.. దళిత మేధావులు కేసీఆర్ చిత్తశుద్ధిని నమ్మే అవకాశం లేదు. 

తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రజలకు మాట ఇచ్చిన ఈ ఉద్యమనేత.. అవసరం తీరగానే ఎలా వ్యవహరించారో తెలంగాణ సమాజం మాత్రమే కాదు, యావత్ దేశంలోని దళిత మేధావులు గమనిస్తూనే ఉన్నారు. అంతటి బహిరంగ వంచన తర్వాత ఎలా నమ్ముతారు? అంతో ఇంతో రైతు అనుకూల పార్టీగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో చూడాలి. 

ఇల్లలికారు అంతే..

ఇల్లలకగానే పండగ కాదు. జాతీయ పార్టీ పెట్టగానే.. మోడీ గుండెల్లో రైళ్లు పరుగెత్తవు. అందుకు ఇంకా చాలా కసరత్తు జరగాలి. ఈ ప్రయత్నం కేవలం పట్టాలు మాత్రమే. ఇంకా ఇంజిను కావాలి. దాని వెనుక బోగీలు జత కలవాలి. ఎన్ని బోగీలు జత కలిస్తే ప్రయాణం అంత ఘనంగా ఉంటుంది. 

ఆంధ్రోళ్లని ద్రోహులుగా చిత్రీకరించి.. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఉద్యమానికి పురిగొల్పి రాష్ట్రం సాధించినంత ఈజీ కాదు.. జాతీయ రాజకీయాల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లడం. తీరా రాష్ట్రం వచ్చేసిన తర్వాత.. బహిరంగ వేదికమీద చిరునవ్వులు చిందిస్తూ.. అప్పుడేదో ఉద్యమ సమయంలో, ఆ ఆవేశంలో ఏదేదో అంటాం.. ఆంధ్రోళ్లందరూ కూడా మా బిడ్డలే.. వాళ్లకు కాల్లో ముల్లు దిగితే పంటితో తీస్తా అనే తరహా నాటకీయ డైలాగులతో యావత్ దేశాన్నీ నమ్మించడం కష్టం. చిత్తశుద్ధి కనపడాలి. 

ఆయన నిజంగానే బిజెపిని గద్దెదించడానికే పార్టీ పెట్టాడని ఇతరులను నమ్మించగలగాలి. ఇప్పటిదాకా ఆయన వేస్తున్న అడుగులు.. బిజెపి వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా మోడీ దళానికి మేలు చేసేలాగానే కనిపిస్తున్నాయి. ఈ అభిప్రాయం తప్పని కేసీఆర్ నిరూపించుకోవాలి. కేవలం మోడీని తిట్టడం ఒక్కటే అందుకు దారి కాదు. ఇలా అనేకానేక అననుకూలతలను దాటుకుంటూ, వ్యూహాలకంటె ముఖ్యంగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తేనే ఆయన ప్రస్థానం కొత్త వెలుగువైపు సాగుతుంది.

ముక్తాయించే ముందు.. మంచో చెడో.. నాలుగు దశాబ్దాలు పైబడిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడును విలేకరులు బిఆర్ఎస్ గురించి అడిగినప్పుడు.. ‘నవ్వుటయే యెరుంగని ఆ మహామహితాత్ముడు..’ ఓ వెర్రి నవ్వు నవ్వి.. జవాబివ్వకుండా వెళ్లిపోయారు. ఆ నవ్వు విస్మరించదగినది కాదు!

ఇప్పుడది ఒకే ఒక నవ్వు. బిఆర్ఎస్ ప్రయోగం విఫలమైతే.. రేపు అదే లక్షల కోట్ల నవ్వులుగా మారుతుంది. కేసీఆర్ నవ్వులపాలు అవుతారు! అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారనే ఆశిద్దాం.

..ఎల్.విజయలక్ష్మి