ఈ రోజుతో మెగాస్టార్ మెగా మూవీ గాడ్ ఫాదర్ డ్రీమ్ రన్ ముగుస్తుంది. ఇక నుంచి రన్ వుంటుంది కానీ తొలి అయిదు రోజులు ఊపినంత వుండదు. దసరా సెలవులు కూడా ఈ రోజుతో ముగిసిపోతున్నాయి. సినిమా ను చాలా ఏరియాల్లో విక్రయించకుండా అడ్వాన్స్ ల మీద విడుదల చేసారు కాబట్టి సమస్య లేదు. బయ్యర్లు ధైర్యంగా వుంటారు. ఎందుకంటే ఆ అడ్వాన్స్ లు కూడా మరీ ఎక్కువ కాదు కనుక.
కానీ నైజాం విషయానికి వస్తే అక్కడి వ్యవహారం వేరు. సినిమాను 22 కోట్ల మేరకు విక్రయించారని వార్తలు వచ్చాయి. కాదు 20 కోట్లకు అమ్మారు మరో రెండు కొట్లు అదనంగా రిటర్నబుల్ కండిషన్ మీద తీసుకున్నారని కూడా వార్తలు వున్నాయి. ఏమైనా ఖర్చులతో కలిపి అయినా 22 కోట్లు వసూలు చేయాలి.
కానీ ఇప్పటి ట్రెండ్ చూస్తుంటే ఆ లక్ష్యానికి చాలా దూరంలోనే కలెక్షన్లు ఆగిపోతాయని అంచనా వేస్తున్నారు. నైజాంలో 12 నుంచి 14 కోట్ల మేరకు మొత్తం వసూళ్లు వుంటాయని అంచనా వేస్తున్నారు. అది కూడా జిఎస్టీతో కలిపి. అలా అయితే నిర్మాత దాదాపు ఆరేడు కోట్లు వెనక్కు ఇచ్చుకోవాల్సి వుంటుంది.
నైజాం ఏరియా కొన్న పంపిణీ దారుకు థియేటర్ల అడ్వాన్స్ కింద ఎగ్జిబిటర్ ఆసియన్ సునీల్ 15 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. ఆయన డబ్బులు కూడా ఓ నాలుగయిదు కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఇరుక్కుంటాయి. నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ కు వస్తే, అక్కడి నుంచి ఎగ్జిబిటర్ కు రావాల్సి వుంటుంది.
నైజాంలో 15 కోట్ల లోపే అంటే చాలా తక్కువ కింద అంచనా. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్లందరి సినిమాలు కనీసం 30 కోట్ల నుంచి ఆ పైగా వసూలు చేస్తాయి. అలవైకుంఠపురములో సినిమా 42 కోట్లు పైగానే వసూలు చేసింది.