రాయలసీమలో యాభైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారం సాధించాలంటే రాయలసీమ మద్దతు పుష్కలంగా ఉండాల్సిందే. దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది.
ఉమ్మడి ఏపీలో అయినా, విభజనకు గురైన తర్వాత అయినా రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలంటే రాయలసీమలో సత్తా చూపించాలి. ఇలా రాజకీయంగా రాయలసీమ కుంభస్థలం లాంటి స్థాయిలో ఉంది. మరి ఇలాంటి కుంభస్థలాన్ని కొట్టగలిగే పార్టీలే అధికారాన్ని పొందుతాయి. ఇలా అధికారాన్ని పొందేది తమ పార్టీనే అని జనసేన ప్రగాఢంగా విశ్వసిస్తోంది.
ఇటీవలే ఆ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్రకటించేశారు. ఇలా ఇంట్లో వాళ్ల మద్దతు సంగతి బాగానే ఉంది కానీ, రాజకీయంగా మాత్రం జనసేన ఇప్పటికీ బుడిబుడి అడుగులు కూడా వేయలేకపోతూ ఉండటం గమనార్హం.
యాభైకి పైగా స్థానాలున్న రాయలసీమలో జనసేన పార్టీకి కనీసం ఒక్కటీ రెండు నియోజకవర్గాల్లో కూడా సరైన నాయకత్వం లేదు. మరో ఏడాదిన్నరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా.. ఇప్పటి వరకూ జనసేన క్షేత్ర స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం మాట అటుంచి, కనీసం నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకత్వాన్ని సంపాదించుకోలేకపోతోంది.
యాభైకి పైగా స్థానాల్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా చెప్పుకోదగిన స్థాయి ఉన్న ఇన్ చార్జి లేరు! ఒక మాజీ ఎమ్మెల్యేనో, ఒక మాజీ ఎంపీనో.. జనసేన జెండా పట్టుకుని కనిపించడం లేదు. మరి అభ్యర్థులంటే రాత్రికి రాత్రి పుట్టుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఒకవేళ అలాంటి వాళ్లు పోటీ చేసినా.. దక్కే ప్రయోజనం ఎంతో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో.. రాయలసీమ రాజకీయంలో జనసేన అచేతనంగా ఉండటం విశేషం.
రాయలసీమ ప్రాంతంలో పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు పర్యటిస్తూ ఉంటారు. అయితే ఆ పర్యటనలు పక్కా కుల సమీకరణాల ఆధారంగానే జరుగుతాయి. రాయలసీమలో బలిజల జనాభా కాస్త గట్టిగా ఉన్న చోటే పవన్ కల్యాణ్ పర్యటనలు సాగుతూ ఉంటాయి. బలిజలు ఉన్న టౌన్లలోనే జనసేన కార్యకలాపాలు కాస్త కనిపిస్తాయి. అక్కడే నలుగురైనా జనసేన జెండాలతో కనిపిస్తారు. అక్కడే ఆటోలపై, బైకులపై జనసేన లోగో ఉంటుంది.
ఆటో మీదో, బైకు మీదో జనసేన లోగో వేశారంటే వారు బలిజలై ఉంటారనుకోవడంలో పెద్ద వింత లేదు కూడా. వాస్తవానికి సీమలో బలిజల జనాభా గణనీయంగా ఉంటుంది. అనంతపురం, కడప జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వీరు నిర్ణయాత్మక శక్తులు. వీరు పవన్ కల్యాణ్ ను బాగా ఓన్ చేసుకుంటారు కూడా! అయినప్పటికీ… రాజకీయంగా మాత్రం వీరి మద్దతు కూడగట్టడం ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ కు సాధ్యం కావడం లేదు.
ఒకవేళ పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ అయితే.. వీరి మద్దతు ఎంతో కొంత ఈ పాటికి పవన్ కల్యాణ్ వైపు ట్రాన్స్ ఫర్ అయ్యేది కూడా! అయితే.. పార్టీ ప్రారంభించి ఇన్నేళ్లవుతున్నా పవన్ కల్యాణ్ తనో సీరియస్ ప్లేయర్ అని సొంత కుల స్తుల ముందు నిరూపించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ స్థానంలో ఇన్ని సంవత్సరాలుగా ఎవరైనా బలిజ కుల ప్రముఖుడు పని చేసి ఉంటే.. వారు పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువ ప్రాధాన్యతను పొందే వారు.
పవన్ కల్యాణ్ తనకు కులం లేదంటాడు. కానీ ఆయన పర్యటనలు బలిజల జనాభా ఆధారంగానే సాగుతాయి. ఆయన పోటీ కాపుల ఓట్ల లెక్కల ప్రకారమే జరుగుతుంది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటుంది వ్యవహారం. ఈ మధ్య కాలంలో కులం గురించి మరింతగా మాట్లాడుతున్నారు. కులాన్ని చూసైనా జగన్ ను ఓడించే ఆవేశం తెచ్చుకోవాలంటూ పవన్ కల్యాణ్ బాహాటంగా వ్యాఖ్యానించారు. మరి ఎన్నికల నాటికి ఈయన కుల జాడ్యం ఇంకా ఏ స్థాయి వరకూ వెళ్తుందో వేచి చూడాల్సి ఉంది. మరి ఇంత చేసినా స్వకులంలో కూడా పవన్ కల్యాణ్ మద్దతు పొందలేకపోవడం మరో ప్రహసనం.
ఎలాగూ జనసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే జనసేన పోటీ చేస్తుందనే విషయం స్పష్టం అవుతోంది. మరి అలాంటప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేనకు అవకాశం లభించదు. టీడీపీతో జనసేన పొత్తు సందర్భంగా రాయలసీమ లో ఈ పార్టీ సీట్లను కూడా అడిగే అవకాశం లేదు. ప్రధానంగా గోదావరి, ఉత్తరాంధ్రల్లోనే జనసేన సీట్లను కోరవచ్చు. రాయలసీమలో ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా జనసేన ఆశించకపోవచ్చు. ఆశించినా.. అవి కూడా తిరుపతి, మైదుకూరు, అనంతపురం అర్బన్ ఇలా బలిజల జనాభా ఆధారంగానే జనసేన తమ జాబితాను చంద్రబాబుకు సమర్పించుకోవచ్చు!
అయితే జనసేన సొంతంగా పోటీ చేస్తే బలిజల్లో ఎంతో కొంత శాతం ఆ పార్టీకి ఓట్లు పడతాయి. అదే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఓటేసే వారి తీరులో కూడా మార్పు తప్పదు. రాజకీయాల్లో ఒకటీ ప్లస్ ఒకటి ఎప్పుడూ రెండు కాదనేది సామెత. తెలుగుదేశం, జనసేనల పొత్తు కూడా ఇలానే ఉంటుంది.
ఒకవేళ జనసేన అస్సలు ఎన్నికల్లో పోటీ చేయకుండా, చంద్రబాబు పెద్ద పాలేరులా పవన్ కల్యాణ్ ప్రచారం చేసి పెడితే వ్యవహారం ఒకలా ఉంటుంది. చంద్రబాబు దయాదక్షిణ్యాల మీద పవన్ కల్యాణ్ కొన్ని సీట్లను పొంది పోటీ చేస్తే వ్యవహారం మరోలా ఉంటుంది.
ఏదేమైనా.. పాతికేళ్ల రాజకీయం అంటూ పవన్ చెప్పే మాటలకూ, ఆయన వ్యవహరించే తీరుకూ మాత్రం అస్సలు సంబంధం లేదు. అందుకే పార్టీ ఆవిర్భావం జరిగి ఎనిమిదేళ్లు గడిచిపోయినా.. రాయలసీమలో జనసేనకు ఇంకా తాడూ లేదు, బొంగరం లేదు, తిప్పే వాడూ లేదు!