బీజేపీలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందా?

రాజకీయ పార్టీలు ఎలా ఎదుగుతాయో, ఎలా పతనమవుతాయో ఎవరూ ఊహించలేరు. ఇందుకు అనేక కారణాలుంటాయి. బలమైన రాజకీయ పార్టీల్లోనే నాయకులు తమ భవిష్యత్తును వెతుక్కుంటూ ఉంటారు. ఒకానొకప్పుడు కేవలం రెండు పార్లమెంటు సీట్లు సాధించుకొని…

రాజకీయ పార్టీలు ఎలా ఎదుగుతాయో, ఎలా పతనమవుతాయో ఎవరూ ఊహించలేరు. ఇందుకు అనేక కారణాలుంటాయి. బలమైన రాజకీయ పార్టీల్లోనే నాయకులు తమ భవిష్యత్తును వెతుక్కుంటూ ఉంటారు. ఒకానొకప్పుడు కేవలం రెండు పార్లమెంటు సీట్లు సాధించుకొని అంటరాని పార్టీగా, మతతత్వ పార్టీగా పేరుపడిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు ఓ మహావృక్షంలా ఎదిగిపోయింది. ఇది మహావృక్షమే కాదు వటవృక్షం కూడా. దాని నీడలో మరో పార్టీ ఎదిగేందుకు అవకాశంలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పార్టీలో ఇమడలేక, అసంతృప్తి కారణంగానో, అన్యాయం జరిగిందనో బాధపడి పార్టీ ఫిరాయించాలనుకునేవారికి ఎదరుగా కనబడుతున్నది బీజేపీయే. తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లోని నేతలు బీజేపీవైపే చూస్తున్నారు. కొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీలో చేరితేనే భవిష్యత్తు ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. దీంతో వేలంవెర్రిగా కమలం పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు.

బీజేపీవైపు ఆకర్షితులవడం ఎప్పటినుంచో ప్రారంభమైనా మొన్న జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు చేసి దాన్ని ప్రత్యేక ప్రతిపత్తిని హరించిన తరువాత ఆ పార్టీ వైపు చూడటం ఇంకా ఎక్కువైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా అత్యంత ధైర్యవంతులనే ముద్ర పడింది. కశ్మీర్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల కొన్ని పార్టీల్లో వ్యతిరేకత ఉన్నా ఎక్కువ పార్టీలు ముఖ్యంగా చాలా ప్రాంతీయ పార్టీలు సమర్థించాయి. కశ్మీర్‌పై ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెసు సహా అనేక పార్టీల్లో ప్రకంపనలు పుట్టించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన  కాంగ్రెసును ఆ తరువాత రాహుల్‌ గాంధీ తీసుకున్న నిర్ణయం కారణంగా నాయకత్వ సంక్షోభం చుట్టుముట్టింది. తాజాగా కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఆ పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. పార్టీ నిర్ణయాన్ని కొందరు నాయకులు కేంద్రంలో, రాష్ట్రాల్లో బహిరంగంగానే వ్యతిరేకించారు.

రాజ్యసభలో చీఫ్‌విప్‌ రాజీనామా కూడా చేశారు. జ్యోతిరాదిత్య సింధియా, మరికొందరు వ్యతిరేక గళం వినిపించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరు కాంగ్రెసు నాయకులు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇక కేంద్రం నిర్ణయాన్ని టీడీపీ, వైకాపా, టీఆర్‌ఎస్‌ బేషరతుగా సమర్థించాయి. పార్టీగా టీడీపీయే కాకుండా వ్యక్తిగతంగా అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రం నిర్ణయానికి మద్దతు ప్రకటించడం విశేషమనే చెప్పుకోవాలి. కాని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఏపీలో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీ నాయకులు బీజేపీ వైపే చూశారు. అలా చూసిన రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. వీరు టీడీపీలో కీలకపాత్ర పోషించిన నేతలే. బీజేపీలో చేరిన సీఎం రమేష్‌ కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయాన్ని గోప్యంగా ఉంచడంలో, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించినట్లు వార్తలొచ్చాయి. ఇక తెలంగాణ కాంగ్రెసులో కశ్మీర్‌పై నిర్ణయంతో సంబంధం లేకుండా ఎన్నికలు అయిపోయినప్పటినుంచే లుకలుకలున్నాయి.

ఇప్పుడు కశ్మీర్‌పై కాంగ్రెసు వ్యతిరేకత కారణంగా కొందరు బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటివారిలో ఈమధ్య విజయశాంతి పేరు వినిపించింది. 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీకి దూరంగా ఉన్న ఈమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందు పార్టీకి దగ్గరయ్యారు. ఆమెకు ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత మళ్లీ ఆమెలో అసంతృప్తి రాజుకుంది. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని వాపోతోంది. కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాన్ని సమర్థించడమే కాకుండా ప్రశంసించారు. ఈమె అడుగులు బీజేపీ వైపు పడతాయని అనుకుంటున్నారు. అందులోనూ ఆమె రాజకీయ జీవితం బీజేపీతోనే ప్రారంభమైంది.

కాంగ్రెసులో అత్యంత సీనియరే కాకుండా, గాంధీ కుటుంబానికి హనుమంతుడు మాదిరిగా విధేయుడైన వి.హనుమమంతరావు అలియాస్‌ వీహెచ్‌ కూడా పార్టీ మారతానని హెచ్చరిక జారీచేశారు. ఆయన చూపూ బీజేపీ వైపే ఉందని ఊహాగాలనాలొస్తున్నాయి. ఇక వివేక్‌ వెంకటస్వామి బీజేపీలో చేరడం ఖాయమంటున్నారు. ఈయన టీఆర్‌ఎస్‌ నుంచి బయటకొచ్చిన నాయకుడు. కాంగ్రెసు నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఊగిసలాటకు స్వస్తి చెప్పి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. ఫిరాయింపుదారులకు బీజేపీయే దిక్కన్నట్లుగా పరిస్థితి తయారైంది. 

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక