ప్రభుత్వమే చేపట్టనున్న బందరుపోర్టు నిర్మాణం

బందరు పోర్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం కేటాయించే స్థలాలను లీజుకు మాత్రం తీసుకుని, పనులు మొదలు పెట్టకుండా.. దశాబ్దానికి పైగా సాగుతూ వస్తున్న నాటకానికి తెరపడింది. జగన్మోహన రెడ్డి నవయుగ సంస్థతో బందరు పోర్టు…

బందరు పోర్టు నిర్మాణం పేరుతో ప్రభుత్వం కేటాయించే స్థలాలను లీజుకు మాత్రం తీసుకుని, పనులు మొదలు పెట్టకుండా.. దశాబ్దానికి పైగా సాగుతూ వస్తున్న నాటకానికి తెరపడింది. జగన్మోహన రెడ్డి నవయుగ సంస్థతో బందరు పోర్టు ఒప్పంద నిర్మాణాన్ని రద్దు చేసేశారు. ప్రతిష్టాత్మకమైన ఏపీ అభివృద్ధిలో కీలకం కాగల ఈ పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టే అవకాశమే ఇప్పుడు కనిపిస్తోంది. అదే జరిగితే.. కొత్త చరిత్రకు శ్రీకారం అవుతుంది.

బందరు పోర్టు విషయంలో అసమంజసమైన చాలా విషయాలు చోటు చేసుకున్నాయి. పైలాన్ నిర్మాణాలు, వాటి ఆవిష్కరణ పేరిట సూడో అభివృద్ధి ప్రచారాలు తప్ప.. గత ప్రభుత్వం సాధించిందంటూ ఏమీలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. నవయుగ సంస్థ పోర్టు నిర్మాణంపై అంత ఆసక్తిగా లేదనే పుకార్లు కూడా మెండుగా వచ్చాయి.

ఇలాంటి నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర రవాణా మరియు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ఒక కీలక ప్రకటన చేశారు. ఆ ప్రైవేట్ సంస్థ పోర్టు నిర్మాణానికి వెనుకడుగు వేసేట్లయితే.. రాష్ట్ర ప్రభుత్వమే దానిని చేపడుతుందని అన్నారు. దానికి వీలుగా తొలి అంకం ఇప్పుడు పూర్తయినట్లుగా భావించాలి. నవయుగతో ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసేసింది. ఈ నిర్మాణం ప్రభుత్వం తరఫునే చేపడుతామంటూ జగన్ ప్రకటించడం ఒక్కటే తరువాయి.

పోర్టు అనేది కేవలం నిర్మాణంతో పూర్తయిపోదు. ఎప్పటికీ ఆదాయవనరుగానే ఉంటుంది. అభివృద్ధి ప్రదాతగానే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో దానిని ప్రభుత్వమే గనుక పూర్తిచేసినట్లయితే.. రాష్ట్రానికి చాలా ఎడ్వాంటేజీ అవుతుంది. అవినీతి, లంచగొండి వ్యవహారాలకు కూడా కత్తెర వేసినట్లు అవుతుంది. అసలే ఇప్పటికే సదరు కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనులను మాత్రం మొదలుపెట్టకుండా.. రైతుల జీవితాలతో ఆడుకుంటూ పరిసర ప్రాంతాల్లో భూదందాలకు తెరలేపిందనే విమర్శలు చాలా ఉన్నాయి.

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పోర్టు నిర్మాణం చేపడితే గనుక… అన్ని రకాలుగానూ రాష్ట్రానికే లబ్ధిచేకూరుతుందని.. ఈ నిర్ణయాన్ని కూడా జగన్ వీలైనంత త్వరలోనే తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. ఎటూ పేర్ని నాని మాటలను బట్టి.. నిర్మాణం స్వయంగా చేపట్టే ఆలోచన ప్రభుత్వానికి ముందు నుంచి ఉన్నట్లుంది. అది కార్యరూపం దాలిస్తే మంచిది.

కుదిరితే వైసీపీ లేదంటే బీజీపీ.. మరోవైపు సోదరుడి చీలిక