మొన్న అంబటి రాంబాటు, నిన్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు…ఒకరేమో వైసీపీ ఎమ్మెల్యే, మరొకరు ఏకంగా మంత్రి. సరస సంభాషణలకు సంబంధించి ఇద్దరిపై సోషల్ మీడియాలో రోజుల వ్యవధిలో వైరల్ అవుతున్న ఆడియోలు.
అధికార పార్టీకి తలవొంపులు తెచ్చేలా మహిళలతో బాధ్యత గల నేతల సరస సంభాషణలు…జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉన్నాయి. నిజం గడప దాటేలోపు, అబద్ధం లోకాన్ని చుట్టేస్తుందనే సామెత చందాన…వైసీపీ నేతలు పరాయి మహిళలతో ఏమిటీ సరసాలు అనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఇవి ఫేక్ అడియోలని అంబటి, తాజాగా ముత్తంశెట్టి నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నారు. తమపై ఇలాంటి తప్పుడు వాయిస్ రికార్డులు ప్రసారం, ప్రచారం చేస్తున్న వారిపై ఇద్దరు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది తమ వాయిస్ కాదని తేల్చి చెప్పారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే….అంబటిని బద్నాం చేసినప్పుడే వెంటనే పోలీసులు దోషులెవరో తేల్చి, శిక్ష విధించి ఉంటే, ఇప్పుడు ముత్తంశెట్టికి జరిగి ఉండేది కాదు కదా అని!
అధికారంలో తాము ఉంటూ కూడా చేష్టలుడిగి అప్రతిష్టపాలు కావడం ఏపీ అధికార పార్టీ నేతలకే చెల్లిందనే విమర్శలున్నాయి. ఎవరెవరో ఫోన్లు చేసి అడుగుతుంటే బాధనిపించిందని ముత్తంశెట్టి తాజా ఆడియో ఉదంతంపై ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే తాను నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు.
సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులెవరో పోలీసులే తేలుస్తారని మంత్రి చెప్పారు. మరి అంబటి ఫిర్యాదుపై పోలీసులు ఏం తేల్చారు? ఎప్పటికి తేలుతుంది? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సైబర్ క్రైం పోలీసులు దోషులను తేల్చకపోతే… ఇలాంటివి మరిన్ని పునరావృత మవుతూ అధికార పార్టీని భ్రష్టు పట్టిస్తాయనే ఆందోళన నెలకుంది.