చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ వ్యవహారశైలిపై టీడీపీలో ఎంతగా అసంతృప్తి ఉందో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఎపిసోడే నిదర్శనం. బుచ్చయ్య చౌదరికి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అంటే ప్రాణం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీ కళ్ల ముందే ఆరిపోతుంటే తట్టుకోలేకపోతున్నానని గోరంట్ల వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు ఎందుకంత కోపం? పదిసార్లు ఫోన్ చేస్తే… కనీసం ఒక్కసారి కూడా రిసీవ్ చేసుకోనంత తప్పుడు పనులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏం చేశారని ఆయన అనుచరులు, అభిమానులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంపై రాజకీయ విశ్లేషకులు కొన్ని అంశాలను తెరపైకి తెస్తున్నారు. వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా ఎన్టీఆర్ కుటుంబానికి విధేయతగా ఉండడమే గోరంట్ల చేస్తున్న మొదటి తప్పు. ఆ తర్వాత 2014లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని వ్యతిరేకించడం రెండో తప్పు. టీడీపీని బలోపేతం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్‌ని తీసుకురావాలని డిమాండ్ చేయడం మూడో తప్పు. ఇలా ఇంకా అనేక చిన్నాపెద్దా అంశాలు గోరంట్ల చేస్తున్న తీవ్ర తప్పిదాలుగా చంద్రబాబు, లోకేశ్ పరిగణిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే ఆయన్ను పొమ్మనకుండానే పొగబెడుతున్నా… పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 2014లో పొత్తులో భాగంగా గోరంట్ల లాంటి సీనియర్ నేత ప్రాతినిథ్యం వహిస్తున్న రాజమండ్రి సీటును బీజేపీకి చంద్రబాబు కేటాయించడాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బుచ్చయ్య చౌదరికి ఇష్టం లేని రాజమండ్రి రూరల్ సీటును కట్టబెట్టారు. 2019కి వచ్చే సరికి ఎర్రన్నాయుడి కుమార్తె ఆదిరెడ్డి భవానీని తెరపైకి తీసుకురావడం వెనుక బుచ్చయ్య చౌదరికి శాశ్వతంగా చెక్ పెట్టే కుట్ర దాగి ఉందని చెబుతున్నారు.
ఇదే అంశాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బుచ్చయ్య చౌదరిపై ఆదిరెడ్డి అప్పారావును ఉసిగొల్పుతున్నారని, అందుకే రాజమండ్రి సిటీలో మొదటి నుంచి ఆయన మనుషులుగా గుర్తింపు పొందిన వాళ్లను ఎమ్మెల్యే భవానీ పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉదాహరణకు ఇటీవల సంస్థాగత ఎన్నికలకు సంబంధించి వాసిరెడ్డి రాంబాబు, మరుకుర్తి రవియాదవ్, మజ్జి పద్మ, కొయ్యాన కుమారి, నక్కా రాజబాబు తదితర్ల పేర్లను బుచ్చయ్య ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదించిన ఏ ఒక్కరికీ పదవులు ఇవ్వలేదు. అలాగే మహిళా నేతల పేర్లను తెలుగు మహిళా రాష్ట్రధ్యక్షురాలు అనితకు ఇవ్వగా, రూరల్ నుంచి మాత్రమే ఇవ్వాలని కఠినంగా చెప్పినట్టు తెలిసింది. ఇవేకాకుండా మరికొందరిని రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలని అచ్చన్నాయుడుకి చెప్పగా, నిర్ద్వందంగా తిరస్కరించినట్టు సమాచారం. తద్వారా పార్టీలో తన స్థానం ఏంటనే ప్రశ్న, ఆవేదన ఆయనను మనస్తాపానికి గురి చేశాయని బుచ్చయ్య అభిమానులు చెబుతున్నారు.
మరోవైపు పార్టీ ఫిరాయింపులు తగదని చంద్రబాబుకు చెప్పిన కారణంగా, తనకు రెండేళ్ల పాటు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదని తన మనసును అధినేత గాయపరిచిన కారణాలను తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో ఆయారాం, గయారాంలకు ప్రాధాన్యత ఉందని, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి నాయకులు, కార్యకర్తలకు విలువ లేదని బుచ్చయ్య విరుచుకుపడుతున్నారు. అయితే తన అన్న కుమార్తె , రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబాన్ని టార్గెట్ చేసే క్రమంలోనే బుచ్చయ్య చౌదరి డ్రామాలాడుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేయడం ద్వారా, తమ నాయకుడు అసమర్థుడనే సంకేతాల్ని బుచ్చయ్య పంపుతున్నారని లోకేశ్ అభిమానులు, సన్నిహితులు మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావడం అంటే, లోకేశ్ నాయకత్వానికి, ఆయన భవిష్యత్‌కు రాజకీయ సమాధి కట్టడమే అని ఆయన అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. నీతి, నిజాయితీలకు టీడీపీలో విలువ లేదని తమ నాయకుడి ఉదంతమే నిరూపిస్తోందని బుచ్చయ్య చౌదరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీని కాపాడుకోవాలని తపన పడడమే తమ నాయకుడు చేసిన తప్పా? అని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. గోరంట్ల పదేపదే అలకబూనడం, ఆ తర్వాత బుజ్జగిస్తే సర్దుకోవడం వల్లే… ఇప్పుడాయన అలకకు విలువ లేకుండా పోయిందనే అభిప్రాయాలు లేకపోలేదు. కనీసం ఈ దఫా అయినా తన నిర్ణయంపై గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉందని బుచ్చయ్య శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.