రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీని వీడాలన్న నిర్ణయం నుంచి ఒక్క మెట్టు కూడా కిందికి దిగలేదు. పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని మనస్తాపం చెందిన గోరంట్ల …రాజీనామా యోచనలో ఉన్నారనే వార్తలు గుప్పమనడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చంద్రబాబునాయుడు ఫోన్ చేశారని సమాచారం.
తొందరపడొద్దని, సమస్యలను పరిష్కరిస్తానని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారని సమాచారం. సోమవారం అమరావతి రావాలని, అన్నీ మాట్లాడుకుందామని చంద్రబాబు ఆహ్వానించినా బుచ్చయ్య తిరస్కరించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ దూతలుగా మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్లను గోరంట్లతో చర్చించేందుకు రాజమండ్రికి అధిష్టానం పంపింది. గోరంట్లతో ఆయన నివాసంలో మాజీ మంత్రులు చర్చించారు. గోరంట్లతో చర్చించిన అనంతరం మాజీ మంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ కొందరితో తనకు ఇబ్బందులున్నట్టు తమ దృష్టికి తెచ్చారని మాజీ మంత్రులు చెప్పుకొచ్చారు.
అంతే తప్ప ఆయన రాజీనామా చేయలేదని, చేయరని ధీమాగా చెప్పారు. ఆ తర్వాత కొంత సేపటికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ త్వరలో తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటిస్తానని తెలిపారు. దానిపై ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పారు.
పార్టీ నడపడంపై లోపాలున్నాయని గోరంట్ల తెలిపారు. పార్టీని బతికించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తల మనోభావాలను పార్టీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తాను చంద్రబాబును కలిసేది లేదని, తనను ఎవరైతే కలిసి చర్చించారో, వాళ్లే అధినేతను కలిసి తన అభిప్రాయాలను అధినేతకు వివరిస్తారని చెప్పారు.
తనకు ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. దాని కోసమే బతుకుతున్నట్టు చెప్పారు. అది లేనప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటానని గోరంట్ల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.