సూపర్ స్టార్ మహేష్ బాబుకు డైరక్టర్ కొరటాల శివకు మధ్యలో ఏం జరుగుతోంది? టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట ఇదే. ఎందుకంటే మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసారు. ఆయనతో మంచి సంబంధాలు వున్నాయి. పైగా మైత్రీ మూవీస్ తో మంచి మైత్రీ బందాలు వున్నాయి.
ఇన్ని వుండి కూడా తన ఆచార్య సినిమాను సంక్రాంతికి అది కూడా జనవరి 12నే విడుదల చేయాలని దర్శకుడు కొరటాల శివ ఎందుకు పట్టుదలగా వున్నారు. ఇటు మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా. పైగా మహేష్ బాబు సినిమా ఆ మర్నాడే విడుదల కాబోతోంది.
మరి ఆ ముందు రోజే తన ఆచార్య సినిమా విడుదల చేయాలని కొరటాల ఎందుకు పట్టుదలగా వున్నట్లు? ఆర్ఆర్ఆర్ రాకపోతే అక్టోబర్ 13కు వస్తామని నిర్మాత నిరంజన్ రెడ్డి తనను అడిగిన వారికి చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రావడం లేదనే వినిపిస్తోంది. మరి అలాంటపుడు ఎందుకు సంక్రాంతి బరిలో జనవరి 12న ఖాళీ చేయించాలని కిందా మీదా అవుతున్నారు?
తక్కువ పోటీలో కాకుండా కీలకపోటీలో దిగి నెగ్గాలనే కోరికా? లేక సంక్రాంతి బరిలో దిగితే కలెక్షన్లు బాగుంటాయనా? కరోనా వ్యవహారం అప్పటికి పూర్తిగా తేలిపోతుందనా? ఇవన్నీ కానీ వీటిలో ఒకటి కానీ కారణం అయితే అయి వుండొచ్చు. కానీ చూసేవాళ్లకు మాత్రం మహేష్ సినిమా మీద పోటీగా ఆచార్యను తీసుకువస్తున్నట్లే వుంది.
నిజానికి జనవరి 12న పవన్ కళ్యాణ్ సినిమా వుంది. పవర్ స్టార్ అభిమానులు దీన్ని సవాలుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ ఫ్యాన్స్ తో గట్టి పోటీ వుంది కనుక. పైగా మహేష్ సినిమాకు, పవర్ స్టార్ సినిమాకు ప్రభాస్ సినిమాతో కూడా పోటీ వుంది.
అలాంటి పోటీ నుంచి సింపుల్ గా పవన్ కళ్యాణ్ ను తప్పించేసి, మెగాస్టార్ ను ఇరికించాలని అనుకుంటున్నారా? అన్న అనుమానం కూడా వినిపిస్తోంది. ఈ రెండూ కాక మిర్చి తరువాత యువి జనాలతో కొరటాలకు దూరం పెరిగిందని గ్యాసిప్ లు వున్నాయి. వాళ్ల సినిమా రాథేశ్యామ్ వుంది. దానికి పోటీగా ఆచార్యను దింపుతున్నారా? అన్నది మరో అనుమానం.
జనవరి ఫస్ట్ వీక్ లో వేసుకోవచ్చు. లేదా మూడో వారంలో వేసుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయడం లేదు. పైగా ఈ విషయంలో మెగాస్టార్, నిర్మాత నిరంజన్ రెడ్డి పెద్దగా కలుగచేసుకోవడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొరటాల మనసులో ఏమున్నట్లో?