థియేటర్లకు ఇంకా సమస్యేమిటి?

తెలంగాణ ఎగ్జిబిటర్లు మళ్లీ సమావేశం అవుతున్నారు. వినాయకచవితికి రెండు సినిమాలు ఆన్ లైన్ లో విడుదల కావడంపై తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆగ్రహంగా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అన్న సంగతి పక్కన…

తెలంగాణ ఎగ్జిబిటర్లు మళ్లీ సమావేశం అవుతున్నారు. వినాయకచవితికి రెండు సినిమాలు ఆన్ లైన్ లో విడుదల కావడంపై తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆగ్రహంగా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా? కాదా? అన్న సంగతి పక్కన పెడితే అసలు తెలంగాణ ఎగ్జిబిటర్లకు సమస్యలేమిటి? ప్రభుత్వం వారితో అన్ని విధాలా సహకరిస్తోంది. పార్కింగ్ చార్జీలు ఉదారంగా ఇచ్చేసింది. 

పోనీ సినిమాలు అన్నీ ఓటిటికి వెళ్లిపోతున్నాయి అని అనుకుంటే, అదీ కాదు. వారానికి మూడు నుంచి ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. గత రెండు మూడు వారాలుగా అదే పరిస్థితి. మరో రెండు మూడు వారాల వరకు అదే వ్యవహారం. 

థియేటర్లకు కావాల్సింది ఇదే కదా? ఫలానా సినిమా థియేటర్ కు రావాలని కాదుగా? వినాయకచవితికి టక్ జగదీష్ వేస్తే నష్టం ఏమిటి? అది ఓటిటిలో ఫ్రీగా చూసేది. లవ్ స్టోరీ డబ్బులు ఇచ్చి చూసేది. జనం హ్యాపీగా అదీ చూస్తారు. ఇదీ చూస్తారు. మరి అదే రెండూ థియేటర్లలోకి వస్తే కలెక్షన్లు చీలిపోవా? అయినా లవ్ స్టోరీ వస్తుంటే టక్ జగదీష్ ఆన్ లైన్ లోకి వస్తే ఎగ్జిబిటర్లకు సమస్యేమిటి? ఉంటే గింటే నిర్మాత సునీల్ కు వుండాలి కానీ?

థియేటర్ల లో పండగకు సినిమాలు వేసుకోవాలని వున్నట్లే, ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ వాళ్లకు, టీవీ వాళ్లకు కూడా వుంటుందిగా? లవ్ స్టోరీ విడుదల చేసుకుంటున్నాం, టీవీలో మంచి సినిమాలు వేయవద్దు అంటే మానేస్తారా? మానరు కదా?

సినిమాను ఓటిటికి ఇచ్చేసిన తరువాత విడుదల అన్నది కార్పొరేట్ల చేతిలో వుంటుంది తప్ప నిర్మాత, హీరోల ప్రమేయం అన్నది అంతంతమాత్రం అన్న సంగతి ఎగ్జిబిటర్లకు తెలియందా? ఓటిటికి వ్యతిరేకంగా థియేటర్లు బంద్ చేస్తాం అనే హెచ్చరిక ఎంత వరకు సబబు అన్నది కూడా ఆలోచించాలి. 

థియేటర్ కు సినిమా కావాలి. సినిమాకు థియేటర్ కావాలి. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. సినిమాకు థియేటర్ కు బదులు ఓటిటి ప్లాట్ ఫారమ్ ఆల్టర్ నేటివ్ గా వుంది. కానీ థియేటర్ కు సినిమా తప్ప మరో ఆల్టర్ నేటివ్ లేదు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి తప్ప ఘర్షణ పనికిరాదు